Nagula Chavithi 2023 Puja Muhurat: హిందూ సంప్రదాయంలో నాగ పంచమి, నాగులచవితి వేడుకలు ప్రత్యేకం. నాగదేవతను ఆరాధించే ఈ వేడుకల్లో నాగుల పంచమిని శ్రావణమాసం శుక్లపక్షం పంచమి తిథి రోజు జరుపుకుంటే...నాగుల చవితి వేడుకలు కార్తీకమాసం పౌర్ణమి ముందు వచ్చే చవితి రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది నాగుల చవితి నవంబరు 17 శుక్రవారం వచ్చింది మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను 'వెన్నుపాము' అంటారు. కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారంలా ఉంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్టు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కతూ మనిషిలో సత్వగుణాన్ని హరించివేస్తుంది. అందుకోసమే నాగుల చవితిరోజు ప్రత్యక్షంగా విషసర్పాలున్న పుట్టలను ఆరాధించి పాలుపోస్తే మనిషిలో ఉన్న విషసర్పం శ్వేతత్వం పొందుతుందని చెబుతారు.
Also Read: ఈ రోజే (నవంబరు 15) భగినీ హస్త భోజనం, సోదరుడి క్షేమాన్ని కోరుకుంటూ జరుపుకునే వేడుక!
నవంబరు 17 నాగులచవితి
చవితి ఘడియలు తిథి నవంబరు 16 గురువారం మధ్యాహ్నం 12.54 గంటలకు మొదలై...నవంబరు 17 శుక్రవారం ఉదయం 11.32 వరకూ ఉంది. అందుకే నవంబరు 17 శుక్రవారం నాగులచవితి జరుపుకుంటారు.
రాత్రివేళ చేసే పండుగలు ( దీపావళి అమావాస్య, అట్ల తదియ,కార్తీక పౌర్ణమి) అయితే రాత్రికి తిథి ఉండడం ప్రధానం. మిగిలిన అన్ని పండుగలకు సూర్యోదయానికి తిథి ఉండడమే లెక్కలోకి వస్తుంది. అంతెందుకు రీసెంట్ గా జరుపుకున్న దీపావళికి ఇదే అనుసరించారు. సూర్యోదయానికి చతుర్థశి తిథి,సూర్యాస్తమయానికి అమావాస్య తిథి ఉండడంతో నరకచతుర్థశి, దీపావళి అమావాస్య ఒకేరోజు జరుపుకున్నారు. ఇక నాగుల చవితికి సూర్యోదయానికి తిథి ప్రధానం కాబట్టి నవంబరు 17 శుక్రవారమే నాగుల చవితి.
పుట్టలో పాలుపోసే ముహూర్తం
సాధారణంగా ఉదయం సమయంలో వర్జ్యం,దుర్ముహూర్తాలు ఉంటాయి. ఈ సమయంలో పుట్టలో పాలు పోయరు. అందుకే వర్జ్యం, దుర్ముహూర్తం లేని సమయం చూసి ఇంట్లో పూజ పూర్తిచేసి ఆ తర్వాత పుట్టలో పాలుపోయాలి..
నవంబరు 17 శుక్రవారం దుర్ముహూర్తం - ఉదయం 8.23 నుంచి 9.08 వరకు...తిరిగి మధ్యాహ్నం 12.08 నుంచి 12.54 వరకు
నవంబరు 17 శుక్రవారం వర్జ్యం - మధ్యాహ్నం 12.46 నుంచి 2.18
చవితి ఘడియలు శుక్రవారం ఉదయం పదకొండున్నరవరకూ ఉంది...అంటే ఆ సమయంలో వర్జ్యం లేదు.. ఇక దుర్ముహూర్తం ఉన్న సమయం మినహాయించి...ముందుగా కానీ..దుర్ముహూర్తం పూర్తయ్యాక చవితి ఘడియలు దాటిపోకుండా అంటే పదకొండున్నరలోపు నాగేంద్రుడి పూజ చేయాలి...
Also Read: కార్తీకమాసంలో రోజూ తలకు స్నానం చేయాలా!
పుట్ట దగ్గర ఇలా చదువుకుంటారు
నన్నేలు నాగన్న , నాకులమునేలు
నాకన్నవారలను నాఇంటివారనేలు
ఆప్తమిత్రులనందరిని ఏలు
పడగ తొక్కిన పగవాడనుకోకు
నడుము తొక్కిన నావాడనుకో
తోక తొక్కితే తొలిగిపో వెళ్లిపో
ఇదిగో ! నూకల్ని పుచ్చుకో మూకల్ని ( పిల్లల్ని) ఇవ్వు
అని పుట్టలో పాలు పోస్తూ నూక వేసి వేడుకుంటారు
ప్రార్థన
పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!
గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!
చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!
వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!
పుట్టలోని నాగేంద్రస్వామి!! ....
నాగ ప్రతిమ ఆరాధన
కొన్ని చోట్ల ప్రజలు తమ ఇళ్ల గోడలపై పాముల బొమ్మలు గీసి పూజలు చేస్తారు. పుట్టలు అందుబాటులో ఉన్నవారు స్వయంగా పుట్టలదగ్గరకు వెళ్లి పాలుపోసి పూజిస్తారు. పుట్టలు అందుబాటులో లేనివారు నాగప్రతిమలను ఆరాధించవచ్చు. ఈ రోజు నాగదేవతతో పాటు శివుడిని పూజించడం వల్ల ఇంట్లో ధన, ధాన్యాలకు లోటు ఉండదని ఒక నమ్మకం సాధారణంగా ప్రతి శివాలంయలోనూ రావిచెట్టు దగ్గర నాగప్రతిమలు ఉంటాయి. వాటికి పాలతో అభిషేకం చేసి అలంకరించి భక్తితో నమస్కరిస్తే సరిపోతుంది.
Also Read: కార్తీక సోమవారం వ్రతవిధి 6 రకాలు, మీరు అనుసరించేది ఏది!
గమనిక: ఇవి పండితులు నుంచి సేకరించిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..