Boy Dies in Dogs Attack In NTR District | నందిగామ: ఎన్టీఆర్ జిల్లా  నందిగామలో విషాదం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో గాయపడిన రెండేళ్ల బాలుడు మృతిచెందాడు. బాలుడి తల్లిదండ్రులు గుండె పగిలేలా ఏడ్చారు. కుక్కలు తమ బాబుపై దారుణంగా దాడి చేసి చంపాయంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తెలంగాణలోనూ ఇలాంటి హృదయ విదారక ఘటనలు పలుచోట్ల జరిగాయి. ఏపీలో గతంలో ఆసుపత్రుల్లో ఎలుకలు కొరకడం ద్వారా సైతం చిన్నారులు మృతిచెందిన సంచలన కేసులు నమోదు కావడం తెలిసిందే. తాజాగా మరో చిన్నారి చనిపోవడంతో అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


నందిగామలోని పెనుగంచిప్రోలు గ్రామంలో తూఫాన్ కాలనీకి చెందిన రెండేళ్ల బాల తోటి ప్రేమ్ కుమార్ ఆరుబయట ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో వీధి కుక్కలు ఒక్కొక్కటిగా 10 అక్కడికి వచ్చాయి. ఒక్కసారిగా 10 వీధి కుక్కలు రెండేళ్ల బాలుడిపై దాడి చేసి పంట పొలాల్లోకి లాక్కొని వెళ్లేందుకు చూశాయి. అది గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేస్తూ, కుక్కల్ని తరమడంతో బాలుడ్ని అక్కడే వదిలి వెళ్లాయి. కానీ వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రేమ్ కుమార్ కు తీవ్ర గాయాలు కాగా, చికిత్స కోసం కుటుంబసభ్యులు బాలుడ్ని హుటాహుటిన నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే బాలుడు చనిపోయాడని నిర్ధారించారు.


గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, వాటిని పట్టుకుని తమకు రక్షణ కల్పించాలని గ్రామ పంచాయితీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశాం. అయినా వారు పట్టించుకోకపోవడంతో ఇంత విషాదం చోటుచేసుకుందని.. తమకు పుత్రశోకం మిగిలిందని మృతిచెందిన బాలుడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. 



ఏపీలో అధికారుల నిర్లక్ష్యానికి రెండేళ్ల బాలుడు బలి 
అధికారుల నిర్లక్ష్యానికి రెండేళ్ల బాలుడు చనిపోయాడని వైసీపీ ఆరోపించింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో కుక్కల బెడదపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. కానీ గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోని కారణంగా పసివాడు బలయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుబయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేయడం దారుణం అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యానికి ఇంకెంత మంది బిడ్డలు ఇలా బలి అవ్వాలి అని వైసీపీ ఎక్స్ ఖాతాలో ప్రశ్నిస్తూ పోస్ట్ చేశారు.


Also Read: Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే