Ratha Saptami Significance 2024: భగవంతుడు లేడు అనేవారుంటారు కానీ వెలుగు, వేడి లేదు అనేవారుండరు. జీవుల చావు పుట్టుకకు, పోషణకు, కాలనియమానికీ, ఆరోగ్యానికీ, వికాసానికీ అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు లేదు..ఆ స్థితిని ఊహించడం కూడా సాధ్యంకాదు. అందుకే సూర్యుడిని ప్రత్యక్షదైవం అంటారు. 


మాఘశుద్ధ సప్తమి రథసప్తమి


ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడిని భక్తిభావంతో, కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించేవారెందరో.  ముఖ్యంగా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో రెండు పర్వదినాలు ఘనంగా జరుపుకుంటాం. అందులో మొదటిది సంక్రాంతి కాగా.. రెండోది రథసప్తమి. సప్తమి సూర్యుడి జన్మతిథి, ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్యసంబంధమైన పర్వదినాల్లో అత్యంత ముఖ్యమైనది. ఈ ఏడాది 2024 లో రథసప్తమి ఫిబ్రవరి 16 న వచ్చింది. 


Also Read: మీ కెరీర్ కి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు, జనవరి 30 రాశిఫలాలు


విధినిర్వహణలో ఆదర్శం 


విధినిర్వహణలో సూర్యుడిని మించిన ఆదర్శం ఎవరుంటారు..ఉదయం, సాయంత్రం ఏ సమయంలోనూ తన విధినిర్వహణ వేళను అతిక్రమించడు. 


సంపదకు మూలం


సృష్టిలో సంపదకు, ఆహారానికి కూడా ఆదిత్యుడే మూలపురుషుడు. సూర్యుడి వల్లే సంపదలు కలుగుతోంది అనేందుకు ఎన్నో పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. మునులకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మ రాజు సూర్యుడిని ప్రార్థిస్తే..అక్షయ పాత్ర ప్రసాదించింది సూర్యుడే.  సత్రాజిత్తు అనేరాజు సూర్యుని ప్రార్థించి శ్యమంతక మణిని పొందుతాడు. ఆ మణి నిత్యం బంగారాన్ని ప్రసాదిస్తుంది. 


Also Read: అమావాస్య అర్థరాత్రి ప్రారంభమయ్యే అద్భుతమైన జాతర - నాగోబా నమోనమః!


విజ్ఞానానికి మూలం 


విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించేదే సూర్యభగవానుడు . సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసించాడు. బుద్ధిని ప్రేరేపించే వాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రీమంత్రం. ఇహానికీ, పరానికీ కావలసినవన్నీ అందిస్తున్నది సూర్యుడే. జీవుల పుట్టుకకు, పోషణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే లభిస్తున్నాయి. 


సూర్య గాయత్రి మంత్రం
ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహే 
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్


Also Read: మకరంలో 3 గ్రహాలు - ఈ 3 రాశులవారికి ఊహించనంత ప్రయోజనం!


శరీరంలో 24 తత్వాలను మేల్కొలిపే సూర్యకాంతి


శరీరంలో 24 తత్వాలుంటాయి..సూర్య కాంతి ప్రసారంతో ఇవి మేల్కొని జ్ఞానం సిద్ధిస్తుందని మునులు చెబుతారు. పంచ భూతాల్లో ఆకాశం, అగ్ని ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి. మన శరీరంలో ఉన్న ఆరుచక్రాలను....  వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కిందినుంచిపైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. కాంతి ప్రసారానికి ఎలాంటి మాధ్యమం అవసరం లేదు..వెలుగు అన్నిటికన్నా వేగవంతమైనది. ముఖ్యంగా సూర్య నమస్కారాలు.. ఆసనాలవల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది. శరీర, ప్రాణ, మనస్సులను  విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది. అందుకే  ప్రత్యక్ష నారాయణుడిని పూజిస్తే సకల సమస్యలు తీరడంతో పాటూ..ఆయుష్షు,  ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు పండితులు.


Also Read: మరణం తర్వాత కొన్ని గంటలపాటూ గుండె కొట్టుకోవడం వెనుక కారణం ఇదే!