Radhastami Date Time Puja Vidhi 2024: సెప్టెంబరు 11 బుధవారం రాధాష్టమి...


రాధ భక్తి, ప్రేమ లేకుండా కృష్ణుడు అసంపూర్ణం. ఈ రోజు రాధాదేవిని ఆరాధించే వారు శ్రీ కృష్ణుడి ఆశీస్సులు పొందుతారని పండితులు చెబుతారు...ఎందుకంటే.. ప్రేమ-భక్తి ఈ రెండు విషయాల్లోనూ రాధాకృష్ణుల బంధం విడదీయలేనిది. అందుకే ఈ రోజు రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు చేస్తారు.. 


రాధ జన్మదినం అంటే శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఇంతకు మించి నచ్చే రోజు ఏముంటుంది. పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పే రాధాకృష్ణులను ఈ రోజు పూజించేవారికి సంసారసుఖం లభిస్తుంది..భార్య భర్త మధ్య అనురాగం పెరుగుతుంది. రాధాకృష్ణుల విగ్రహాలకు అభిషేకం చేసి.. ధూప దీప నైవేద్యాలు సమర్పించి గులాబీలతో రాధాకృష్ణులను పూజించాలి.


Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, దసరా నవరాత్రులు సందర్భంగా ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే!


"ఓం రాధాయై విద్మహే కృష్ణప్రియాయై ధీమహి తన్నో రాధ ప్రచోదయాత్" 
  
రాధాకృష్ణుల విగ్రహాలను అభరణాలు, నూతన వస్త్రాలతో విశేషంగా అలంకరిస్తారు. బృందావనంలో ముఖ్యమైన ప్రదేశాలను భక్తులకు వివరిస్తూ  సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.. భక్తి గీతాలు ఆలపిస్తారు. రాథాకృష్ణులకు విశేష హారతి నిర్వహించిన అనంతరం పవళింపు సేవ  చేస్తారు. 
 
ఉత్తర భారతదేశంలో రాధాష్టమి పండుగను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. అమ్మవారికి కుంకుమార్చలను నిర్వహిస్తారు. షోడశోపచార పూజలు  చేస్తారు.. రంగులు చల్లుకుంటారు..ఈ రోజు కూడా కృష్ణాష్టమి లానే ఉట్టి కొడతారు. రాధా అష్టమి రోజు పేదలకు  అన్నదానం, వస్త్రదానం   చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయని సానుకూల శక్తి నిండి ఉంటుందని భావిస్తారు.  


Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!


సమస్త సిరిసంపదలకు, ఐశ్వర్యానికి అధిదేవత రాధాదేవి అని చెబుతారు సప్తరుషులు. పూజామందిరంలో రాధాకృష్ణుల ఫొటోని ఉంచి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.  యోగశక్తికి, అష్టసిద్ధిలకు అధిపతి అయిన రాధాదేవిని పరమాత్ముడి  హృదయేశ్వరిగా వర్ణించారు వ్యాసమహర్షి.. 


దేవీ భాగవతం ప్రకారం రాధాదేవి.. సకల చరాచర జగత్తుకు తల్లి. సృష్టి, స్తితి, లయములకు కారణం. త్రిమూర్తులు ఆమెను స్తుతించిన గొప్ప గొప్ప స్తుతులు బ్రహ్మ వైవర్త పురాణంలో ఉన్నాయి.. అవి నిత్యం పారాయణం చేయాల్సిన శక్తివంతమైన స్తోత్రాలు. జాతకరీత్యా వెంటాడే ఎలాంటి దోషాలను అయినా తొలగించే స్తుతులు అవి అని దేవీ భాగవతంలో ఉంది. 
 
రాధామాధవం ఎంతో రమణీయం.. స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం.. తనని తాను ప్రేమించుకునేందుకు మాధవుడు తన నుంచి తాను వేరుపడి రాధగా జన్మించాడని చెబుతారు. ఇద్దరి ఆలోచన, ఆచరణ అలా ఉంటుంది మరి.  


లోకంలో పవిత్రమైన ప్రేమకు ప్రతిరూపాలుగా  రాధాకృష్ణులనే మొదటగా చెబుతారు. రాధ అంటే ఎవరో కాదు సాక్షాత్తు శ్రీకృష్ణుని ఆంతరంగిక శక్తి స్వరూపం. శ్రీకృష్ణ భగవానుడిని చేరుకోవాలంటే ఆయన హృదయాంశ అయిన రాధ అనుగ్రహం పొందడమే సరైన మార్గం అని చెబుతారు పండితులు.


Also Read: దసరా నవరాత్రుల్లో పూజించాల్సిన నవ దుర్గలు - దేవీ కవచంలో ఉన్న అలంకారాలివి!


హరేకృష్ణ మంత్రంలో హరే అనే పదాన్ని కూడా రాధ సూచించినదే..అందుకే హరే అనే మంత్రాన్ని జపించడం కూడా రాధాకృష్ణులు ఇద్దర్నీ కలసి ఆరాధిస్తున్నట్టే. 


హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే