ఆధ్యాత్మిక సాధనకు అనువైన మాసాలలో వైశాఖ మాసం ఒకటి. ఆధ్యాత్మికంగా భగవంతుని అనుగ్రహం పొందడానికి ఈ మాసం అన్ని విధాలుగా అనుకూలమైనదిగా చెబుతారు. అందుకే దీనిని సాధన మాసంగా కూడా పిలుస్తుంటారు. వైశాఖం, మాఘం, కార్తికం.. ఈ మూడు మాసాలలో ఆధ్యాత్మిక సాధన తగినంతగా చేయాలని మన పెద్దలు చెప్పారు. కార్తిక పురాణం, మాఘ పురాణాల మాదిరిగానే వైశాఖ పురాణం కూడా ఉనికిలో ఉంది. దీనిని వేద‌వ్యాసుడు రచించాడు.


వసంత రుతువులో వైశాఖం రెండో మాసం. వైదికంగా దీనిని ‘మాధవ మాసం’ అని కూడా అంటారు. మధు అని చైత్ర మాసానికి, మాధవ అని వైశాఖ మాసానికి పేర్లు. వైశాఖ మాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకు చాలా ప్రసిద్ధమైనది. ఈ ఏడాది వైశాఖ మాసం మే 5వ తేదీ వరకు ఉంది. ఈ నెల చివరి రోజున అంటే పౌర్ణమి రోజున చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉంటాడు. అందుకే దీనిని వైశాఖ మాసం అంటారు. విశాఖ నక్షత్రానికి అధిపతి దేవగురువు బృహస్పతి, అధి దేవత ఇంద్రుడు.


అందుకే ఈ మాసంలో పుణ్యస్నానం, దానాలు, ఉపవాసం, పూజలు చేయడం వల్ల పుణ్య‌ ఫ‌లం పుష్క‌లంగా ల‌భిస్తుంది. ఈ పవిత్ర మాసంలో, పుణ్యస్నానాలు, దానాలు చేయడంతో పాటు, ముఖ్యంగా రెండు వ్ర‌తాలు ఆచరించాల‌ని పండితులు చెబుతారు. వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా నిత్యం నారాయణుడిని తులసి దళాలతో ఆరాధించాలి. ఆ తులసి కూడా కృష్ణ తులసి అయి ఉండాలి. దీనిని విష్ణువుకు సమర్పించడం శ్రేష్ఠమని ధర్మశాస్త్రం చెబుతోంది. ఫ‌లితంగా అనేక యాగాలు చేయడం ద్వారా ఎంత పుణ్యం లభిస్తుందో ఆ నారాయ‌ణుడు అంత పుణ్యాన్ని ఇస్తాడని చెబుతారు. విష్ణు సహస్ర నామ పారాయణకు వైశాఖ మాసం చాలా ప్ర‌స‌శ్త‌మైన‌ది. ఈ నెల‌ పొడవునా అశ్వత్థ వృక్షానికి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందని.. పితృదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్ర వచనం.


పురాణాల్లో వైశాఖ మాసం


స్కంద, పద్మ, విష్ణు ధర్మోత్తర పురాణాల్లో వైశాఖం విష్ణువుకు ఇష్టమైన మాసంగా పేర్కొన్నారు. ఈ మాసంలో విష్ణువు, సూర్యుడు, శివునికి ఉద‌కం సమర్పించడం వల్ల అనేక యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని గ్రంధాల్లో తెలిపారు. వైశాఖ మాసంలో శ్రీమహావిష్ణువును, సూర్యభగవానుని ఆరాధించడం ద్వారా, తెలిసి లేదా తెలియక చేసిన అన్ని రకాల పాపాలు తొల‌గిపోతాయ‌ని శాస్త్ర వ‌చ‌నం.


ఈ మాసంలో చేయవలసినవి


సూర్యోదయానికి ముందే స్నానం: వైశాఖ మాసంలో ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు స్నానం చేసే సంప్రదాయం ఉంది. ఈ మాసంలో పుణ్యక్షేత్రంలో స్నానానికి కూడా ప్రాముఖ్యత ఉంది. తీర్థయాత్రకు వెళ్లి స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల గంగాజలం వేసి ఇంట్లో స్నానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల తీర్థ స్నానం చేసినంత‌ పుణ్యం లభిస్తుంది.


విష్ణువుకు తులసి ద‌ళాల‌తో పూజ‌: వైశాఖం విష్ణువుకు ఇష్టమైన మాసం కాబట్టి, ఈ మాసంలో ఆయనను ఆరాధించడం అత్యంత‌ ప్రాముఖ్యత ఉంది. తులసి ద‌ళాల‌ను విష్ణువుకు సమర్పించాలి. దీనితో పాటు శివలింగాన్ని అభిషేకించి, అశ్వ‌త్థ వృక్షానికి నీరు పోయాలి.


తులసి పూజ: వైశాఖ మాసంలో తులసి మొక్కకు నీరు సమర్పించి పూజించే ఆచారం ఉంది. పురాణాల ప్రకారం, వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందు లేచి, తులసి మొక్కకు నీరు సమర్పించాలి. తులసి పూజ అనంతరం మొక్క కింద ఒక వైపు నెయ్యి దీపం వెలిగించాలి. అయితే సాయంత్రం పూట మాత్రమే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల తెలిసి, తెలియక చేసిన పాపాల‌న్నీ తొల‌గిపోతాయి.


అశ్వ‌త్థ వృక్షానికి నీరు పోయండి: శ్రీ మ‌హావిష్ణువు అశ్వ‌త్థ వృక్షంలో నివసిస్తాడని విశ్వ‌సిస్తారు. వైశాఖ మాసంలో వేకువజామున నీరు నైవేద్యంగా స‌మ‌ర్పించి నెయ్యి దీపం వెలిగించాలి. విష్ణువుతో పాటు శివుడిని, బ్రహ్మదేవుడిని కూడా పూజించాలి.


Also Read: గరుఢ పురాణం - రోజూ స్నానం చేయకుండా, మురికి దుస్తులు ధరిస్తే ఏం జరుగుతుంది?