మారిన కాలమాన పరిస్థితుల్లో జీవితం చాలా వేగవంతంగా మారింది. వేగం పెరగడం వల్ల ఒత్తిడి కూడా పెరిగింది. ఎప్పుడైతే ఒత్తిడి పెరుగుతుందో అప్పుడు కచ్చితంగా ఆనందం దూరమవుతుంది. గరుఢ పురాణంలో చెప్పిన కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటే ప్రశాంతమైన, సుసంపన్న జీవితం గడపవచ్చు.
గరుఢపురాణం గురించి దాదాపు అందరూ వినే ఉంటారు కానీ అందులోని వివరాలు చాలా మందికి తెలియవు. ఇది అష్టాదశ పురాణాల్లో ఒకటి. కానీ చాలా మంది దీన్ని పాప పుణ్యాలు, స్వర్గ నరకాలు, మరణం, పునర్జన్మలకు సంబంధించిన సాహిత్యంగా భావిస్తారు. వీటితో పాటు విజ్ఞానం, శాస్త్రం, జీవనం, నియమాలు వంటి అనేక విషయాలు ఇందులో చర్చించారు. గరుఢపురాణంలో చెప్పిన కొన్ని విషయాలు గుర్తు పెట్టుకుని ఆచరిస్తే జీవితంలో ఆనందం చెరిగిపోకుండా ఉంటుంది. కేవలం మరణం మాత్రమే కాదు జీవితాన్ని గురించి కూడా వివరణలు ఇచ్చింది. ఇప్పుడు జీవితం కేవలం పొట్టతిప్పలుగా మారింది. రోటీన్ మారకుండా ఒకే విధంగా బతుకు గడపడం ఒకరకమైన ఒత్తిడికి కారణమవుతుంది. గరుఢ పురాణం గురించి తెలుసుకుంటే సంతోషకరమైన జీవితం గడిపే మార్గాలు తెలుస్తాయి. ఒత్తిడి లేని జీవితం ఎలా సాధ్యమవుతుందో, గరుఢ పురాణంలో దీని గురించిన ఎలాంటి వివరాలు ఉన్నాయో తెలుసుకుందాం.
దుస్తులు ఎలా ఉండాలి?
ప్రతి వారికి బాగా సంపాదించి సంపన్నమైన జీవితం గడపాలనే ఆశ ఉంటుంది. అలా గడిపేందుకు చాలా అదృష్టం ఉండాలి. కాలం కలిసి రావాలి. గరుఢ పురాణం ప్రకారం మురికిగా, దర్వాసన వేస్తున్న బట్టలు ధరించే వారిని దురదృష్టం వెంటాడుతుంది. అలాంటి వారికి లక్ష్మీ కటాక్షం కూడా దొరకదు. ఇలాంటి వారి జీవితం విజయానికి ఆమడ దూరంలోనే ఉంటుంది. అందుకే ప్రతి రోజూ స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించాలి. శుభ్రమైన సువాసనతో ఉన్న దుస్తులనే సర్వదా ధరించాలని గరుఢ పురాణం చెబుతోంది.
స్నానం
ప్రతి రోజూ స్నానం చెయ్యాలి. రోజు స్నానం చెయ్యని వారిలోకి త్వరగా ప్రతికూల శక్తులు ఆకర్షితమవుతాయి. దేహం దేవాలయంతో సమానం. దైవ నిలయమైన దేహాన్ని శుభ్రంగా ఉంచుకోకపోతే దైవ కృప దొరకదు. ప్రతి రోజూ స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి భగవంతుడిని పూజించే వారికి జీవితంలో ఎలాంటి లోటు రాదు.
తులసి
తులసి మొక్క గురించి గరుఢ పురాణంలో ప్రత్యేకంగా వివరించారు. పచ్చని తులసి మొక్క ఆ ఇంటి ఐశ్వర్యానికి గుర్తుగా భావించాలి. కళకళలాడే తులసి ఉండే ఇల్లు సమృద్ధిగా ఉంటుందని గరుఢ పురాణం వివరిస్తుంది. ఆ ఇంట్లో నివసించే వారికి ఆయురారోగ్యాలు వృధ్ధి చెందుతాయని నమ్మకం. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన తులసిని రోజూ ఆరాధిస్తే విష్ణుమూర్తి కరుణకు కూడా పాత్రులు కావచ్చని గరుఢ పురాణం చెబుతోంది.