మహారాష్ట్ర మాజీ ఐటీ మంత్రి, శివ‌సేన ఎమ్మెల్యే ఆదిత్య థాక‌రే నేడు (ఏప్రిల్ 11) హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. నేడు ఆయన హైద‌రాబాద్‌ హైటెక్ సిటీలోని టీ హ‌బ్‌ను సంద‌ర్శించారు. అక్కడే మంత్రి కేటీఆర్‌ ను కూడా కలిశారు. ఇరువురు, వారి వెంట ఉన్న అధికారులు చ‌ర్చలు నిర్వహించారు. ఈ క్రమంలో తన హైదరాబాద్ పర్యటన గురించి ఆదిత్య ఠాకరే త‌న ట్విటర్‌లో స్పందించారు. మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన ప్రతిసారి అద్భుతంగా ఉంటుందని, స్ఫూర్తికరంగా ఎంక‌రేజింగ్ ఫీల‌వుతాన‌ని అన్నారు. సుస్థిర‌త‌, ప‌ట్టణీక‌ర‌ణ‌, సాంకేతిక‌త లాంటి అంశాల‌పై తాము ఇద్దరం చ‌ర్చించుకున్నామ‌ని ట్వీట్ చేశారు. భార‌త దేశ ప్రగ‌తిలో ఆ అంశాలు కీల‌క‌మైనవ‌ని, ఆ విషయాల గురించి ప్రస్తావించుకున్నామని ఆదిత్య థాక‌రే తెలిపారు. 


టీ హ‌బ్‌లో జ‌రిగిన వ‌ర్క్ గురించి ఆదిత్య థాక‌రే ఆశ్చర్యానికి గురి అయ్యారు. టీ హ‌బ్ ఒక నూతన ఆవిష్కరణ అని అభినందించారు. అంకుర సంస్థలు (స్టార్టప్‌), ఆవిష్కర్తలు, ఆలోచ‌నాప‌రుల‌కు టీ హ‌బ్ మంచి ఊతం ఇస్తున్నట్లు ఆదిత్య థాకరే పేర్కొన్నారు.


ఆదిత్య థాక‌రే చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. గ‌త ఏడాది దావోస్‌లో జ‌రిగిన స‌ద‌స్సులో క‌లిశామ‌ని గుర్తు చేసుకున్నారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆదిత్య థాకరేను క‌ల‌వ‌డం సంతోషంగా ఉంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. భ‌విష్యత్తులో మ‌రింత‌గా చ‌ర్చించుకుందామ‌ని మంత్రి కేటీఆర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.