Hyderabad Crime : హైదరాబాద్ అత్తాపూర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తనకు దేవుడు చెప్పాడంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లో శివాని(35) అనే మహిళ బిచ్చమెత్తుకుని జీవనం సాగిస్తుంది. మంగళవారం ఉదయం ఒక్కసారిగా నడిరోడ్డుపైకి వచ్చిన శివాని ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. మహిళను గమనించిన స్థానికులు వెంటనే మంటలు ఆర్పివేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై శ్వేత సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం బాధితురాలు శివానిని 108 వాహనంలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శివాని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దేవుడు చెప్పాడంటూ శివాని ఆత్మహత్యాయత్నం చేసినట్లు  పోలీసులు తెలిపారు. మహిళ మానసిక పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. 


అసలేం జరిగింది? 


రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ ఫిల్లర్ నెంబర్ 133 వద్ద ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటికుంది. స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేసి  పోలీసులకు తెలియజేశారు. రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. అయితే విచారణలో మహిళ విస్తుపోయే విషయాలు చెప్పింది. తనకు దుర్గమాత కలలో కనిపించి చనిపోమని చెప్పిందని మహిళ తెలిపింది. అందుకే తాను నిప్పంటించుకున్నానని బాధిత మహిళ తెలిపింది. దుర్గమ్మ కోరిక మేరకే తాను కిరోసిన్ పోసుకున్నానని మహిళ పోలీసుల ఎదుట తెలిపింది.  


ఎవరో నిప్పుపెట్టారని ప్రచారం


మంగళవారం ఉదయం 10.40 గంటల టైంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందని రాజేంద్రనగర్ ఎస్సై శ్వేత తెలిపారు. అత్తాపూర్ 133 ఫిల్లర్ వద్ద గుర్తు తెలియని మహిళ నిప్పంటించుకుందని ఫోన్ కాల్ వచ్చిందన్నారు. తాను వెంటనే సిబ్బందితో అక్కడికి వెళ్లి పరిశీలించామన్నారు. తన పేరు శివాని(38) అని, తనకు కూతురు, తల్లి ఉందని బాధితురాలు తెలిపిందన్నారు. స్థానికంగా ఉన్న సాయిబాబా గుడి వద్ద బిచ్చమెత్తుకుని జీవనం కొనసాగిస్తున్నామని తెలిపింద్నారు. తన భర్త చనిపోయాడని తెలిపిందని ఎస్సై వెల్లడించారు. అయితే తనకు దుర్గమాత కలలోకి వచ్చి చనిపోమని చెప్పటంతో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నానని బాధితురాలు చెప్పిందన్నారు. శివానిని చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని రాజేంద్రనగర్ ఎస్‌ఐ శ్వేత వెల్లడించారు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టారని ప్రచారం జరిగింది. కానీ అది అవాస్తమని ఎస్సై తెలిపారు. కలలో దుర్గమాత చెప్పిందని ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.