ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||


 నవగ్రహాల స్థానాన్ని బట్టి ఓ వ్యక్తి జాతకం నిర్ణయిస్తారు. అవి మంచి పొజిషన్లో ఉంటే పర్వాలేదు కానీ నీఛ స్థితిలో ఉంటే మాత్రం జీవితంలో లెక్కలు మారిపోతాయి. ఆరోగ్యం, ఉద్యోగం, బంధాలు, బంధుత్వాలు, ఆర్థిక పరిస్థితి, ఆయుష్షు అన్నీ వీటి సంచారంపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే నవగ్రహాల్లో ఏ గ్రహ సంచారం బాగోపోయినా వాటిని శాంతింపచేసేందుకు దోష నివారణ పూజలు చేస్తుంటారు. ఇప్పుడంటే భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఉండేందుకు వైష్ణవ ఆలయాల్లో, ప్రత్యేక ఆలయాల్లోనూ  నవగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు కానీ గతంలో ఎక్కువగా శివాలయాల్లోనే ఉండేవి. 


Also Read: తలకిందులుగా ఉండే ఈ శివయ్య దీర్ఘకాలిక రోగాలు నయం చేస్తాడట
అసలు నవగ్రహాలకి-శివుడికి ఉన్న సంబంధం ఏంటి
నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో అధిష్టాన దేవతను నియమించినది శివుడే. గ్రహాలకు మూలమైన సూర్యుడికి అధిదేవత శివుడు. ఈ కారణంగానే గ్రహాలన్నీ కూడా శివుడి ఆదేశానుసారమే సంచరిస్తూ ఉంటాయి. అందుకే శివాలయాల్లో నవగ్రహాలు ఎక్కువగా దర్శనమిస్తూ వుంటాయి. ఆదిదేవుడైన పరమశివుడి అనుగ్రహం ఉంటే నవగ్రహ దోషాలుండవని పండితులు చెబుతారు. అందుకే మిగిలిన ఆలయాల్లో కన్నా శివాలయాల్లో ఉండే నవగ్రహాలు పవర్ ఫుల్ అంటారు.
 
ముఖ్యంగా శనివారం, త్రయోదశి కలిసొచ్చిందంటే ఆ రోజు ఎంత పవర్ ఫుల్ అంటే. శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన రోజు. శివకేశవులతో పాటూ శని జన్మించిన తిధి కూడా త్రయోదశి. అందుకే  శని త్రయోదశికి అంత విశిష్టత. ఈ రోజు పరమేశ్వరుడికి, శనికి ప్రత్యేక పూజ చేస్తే ఏలినాటి శని, అష్టమ శని దోషాలు తొలగిపోతాయని చెబుతారు. 


Also Read:అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే



  • నవగ్రహాలకు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. 

  • నవగ్రహాలను, చేతితో తాకుతూ ప్రదక్షిణలు చేయరాదు

  • నవగ్రహాల దగ్గరకు వెళ్లేటప్పుడు సూర్యుడి భగవానుని చూస్తూ లోపలికి ప్రవేశించాలి

  • చంద్రుడి నుంచి కుడివైపుగా నడుస్తూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి

  • నవ గ్రహాల పేర్లు మనసులో తలుచుకుంటూ మండపం నుంచి బయటకి రావాలి

  • నవగ్రహాలకు మన వీపు చూపకుండా బయటకు రావాల్సి ఉంటుంది


నవగ్రహ స్తోత్రం
శ్లోకం
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
రవి
జపాకుసుమ సంకాశం | కాశ్యపేయం మహాద్యుతిమ్
తమో రిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరం ||
చంద్ర 
దధి శంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సంభవమ్
నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం ||
కుజ 
ధరణీగర్భ సంభూతం | విద్యుత్కాంతి సమప్రభమ్
కుమారం శక్తిహస్తం | తం మంగళం ప్రణమామ్యహం ||
బుధ 
ప్రియంగు కలికాశ్యామం | రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం | తం బుధం ప్రణమామ్యహం ||
గురు
దేవానాంచ ఋషీణాంచ | గురుం కాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిం ||
శుక్ర 
హిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహం ||
శని 
నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం ||
రాహు 
అర్ధకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం | తం రాహుం ప్రణమామ్యహం ||
కేతు 
ఫలాశ పుష్ప సంకాశం | తారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం | తం కేతుం ప్రణమామ్యహం ||