Nagula Chavithi 2021:నాగ పూజ మూఢనమ్మకమా- సర్పాలు, నాగులు, పాములు వీటి మధ్య వ్యత్యాసం ఏంటి, వేటిని పూజించాలి

నాగుల చవితి, నాగపంచమి రోజు పుట్టలో పాలు పోయకూడదా… పోస్తే ఏమవుతుంది… అసలు మనం ఎవర్ని ఆరాధించాలి…ఎవర్ని ఆరాధిస్తున్నాం … ఇదంతా మూఢనమ్మకమా-అవగాహనా లోపమా…వాస్తవం ఏంటి.. పురాణాలు ఏం చెబుతున్నాయి.

Continues below advertisement

నాగపంచమి, నాగుల చవితి వస్తోందంటే చాలు మూఢనమ్మకాలు అనుసరిస్తున్నారని , పాములు పాలు తాగుతాయా అసలు? పాములను హింసిస్తున్నారని…రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి. అయితే వాస్తవానికి ఈ ఆచారం ఎందుకు వచ్చింది? ఆచరణలో వచ్చిన మార్పుల కారణంగా తప్పుగా అర్థం చేసుకున్నారా?   పురాణాల్లో ఏం చెప్పారన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు పండితులు. విషయంలోకి వస్తే... ఆంగ్లేయులు ప్రభావం మనపై ఏ రేంజ్ లో ఉందంటే…సంస్కృతం నుంచి వచ్చిన భారతీయ భాషలలోని పదాలకు ఇంగ్లీష్‌లో అర్దం వెతుక్కునే స్థితికి చేరిపోయాం. ఆ అర్థాలను సంస్కృత పదాలకు అంటగట్టి వాటి అసలు అర్ధాన్ని చెరిపేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళకు Snake అనే పదం ఒక్కటే ఉంది. కానీ హిందూ ధర్మంలో నాగులు, సర్పాలని రెండు ఉన్నాయి. నాగులు వేరు, సర్పాలు వేరు. భగవద్గీత 10 వ అధ్యాయంలో శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడంటే....

Continues below advertisement

ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్|
ప్రజనశ్చాస్మి కన్దర్పః సర్పాణామస్మి వాసుకిః
నేను ఆయుధాల్లో వజ్రాన్ని. గోవుల్లో కామధేనువుని. పుట్టించేవాళ్ళల్లో మన్మధుడిని, సర్పాల్లో వాసుకిని అని అర్థం. వాసుకి శివుడిని ఆశ్రయించి ఆయనకు అలంకారంగా ఉంటుంది. ఈ వాసుకినే తాడుగా చేసుకుని సాగర మధనం చేశారు దేవదానవులు. వాసుకి కద్రువ తనయుడు.
అనన్తశ్చాస్మి నాగానాం
వరుణో యాదసామహమ్|
పితౄణామర్యమా చాస్మి
యమః సంయమతామహమ్||
నేను నాగులలో అనంతుడిని, జలచరాలలో వరుణుడిని, పిత్రులలో ఆర్యముడిని, సంయమవంతుల్లో నిగ్రహాన్ని. అంటూ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తాను నాగుల్లో అనంతుడనని చెబుతాడు.
అనంతుడు అంటే ఆదిశేషుడు. అనంతుడు కద్రువకు పెద్ద కొడుకు, రెండవ వాడు వాసుకి. కద్రువ.... వినతకు చేసిన అన్యాయానికి చింతించి విష్ణువు గురించి ఘోర తపమాచరించి ఆయనను తనమీద విశ్రాంతి తీసుకునేలా వరం పొందుతాడు అనంతుడు. బ్రహ్మ అతడి బలాన్ని చూసి భూభారాన్ని మోయమని చెబుతాడు. పురాణాల ప్రకారం అనంతుడు అదృశ్యంగా ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు. ఈ అనంతుడే వివిధ అవతారాల్లో స్వామివారిని అనుసరిస్తాడు. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా, వేంకటేశ్వర అవతారంలో గోవిందరాజులుగా, భక్తి మార్గాన్ని తెలపడానికి భగవద్ రామానుజులుగా అనుసరించాడని పురాణాలు చెబుతున్నాయి.
Also Read: ఉపవాసం దేవుడి కోసం మాత్రమే కాదు… ప్రకృతి వైద్యులు చెప్పిన విషయాలు మీరు తెలుసుకోండి

సర్పాలు-నాగులు ఒకటికాదా?
కృష్ణుడు సర్పాల్లో వాసుకి అన్నాడు… నాగుల్లో అనంతుడు అన్నాడు. అంటే సర్పాలు- నాగులు ఒకటి కాదా ? ఏంటి తేడా అంటారేమో… నిజమే…కొంతమంది పండితులు సర్పాలంటే విషపూరితాలు అని , నాగులు అంటే విషరహిత పాములు అని ప్రతిపాదించారు. కానీ పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదర సమానులైనా రెంటికీ చాలా వ్యత్యాసం వుంది. నాగులు కామరూపధారులు. అవి కావాలనుకున్నప్పుడు మానవ రూపంలో కనబడగలవు. మానవరూపాన్నే కాదు, ఏ రూపాన్నైనా ధరించగలవు. సర్పాలు అలా కావు, అవి నేలను అంటిపెట్టుకుని పాకుతాయి, భూమి మీద తిరుగాడుతాయి. నాగులకు ఒక విశిష్ట లోకం వుంది. నాగులకు వాయువు ఆహారం….అంటే కేవలం గాలిని పీల్చి మాత్రమే బతుకుతాయి. సర్పాలకు జీవరాశులు ఆహారం.
సర్పాల్లో దేవతా సర్పాలు వేరా?
సర్పాల్లో దేవతాసర్పాలు ప్రత్యేకంగా ఉంటాయి. దేవతాసర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూల వాసన వస్తుందట. ఇవి మానవజాడలకు దూరంగా ఉంటాయి. మనిషికి గానీ, పాములు పట్టేవాళ్ళకు గాని చిక్కవు.  వాటిని పట్టుకోవడం కేవలం సినిమాల్లోనే జరుగుతాయి.
పాములు పాలతాగవన్నది నిజమేకానీ....!
పాములు పాలు త్రాగవన్నమాట నిజం. అవి సరిసృపాలు కనుక వాటికి జీర్ణవ్యవస్థ ఉండదు. కానీ నాగులు, దేవతాసర్పాలు అందుకు భిన్నంగా ఉంటాయి. భక్తికి మెచ్చిన నాగదేవతలు అనేకరూపాల్లో దర్శనమిచ్చి పూజలు అందుకుంటాయి. ఆరోగ్యాన్ని, సంతనాన్ని అనుగ్రహిస్తాయి. దేవతాసర్పాలకు కూడా శక్తులు ఉంటాయి, అవి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాల్లో ఇప్పటికి ఉన్నాయని హిందువుల విశ్వాసం.
Also Read: కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ధి ద్వాదశి... కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులివే...

మానవజాతితో కలిసి తిరిగే నాగదేవతలు
నాగపంచమి, నాగుల చవితి లాంటి నాగదేవతారాధన తిధుల సమయంలో నాగులు కూడా మానవజాతితో కలిసి సంచరించేవట. ఎందుకంటే అప్పట్లో మానవులకు శౌచం ఉండేది. ధర్మనిష్ఠ, సత్యనిష్ఠ, దైవభక్తి ఉండేది. ఆ రోజులు వేరు. కనుక అప్పట్లో నాగజాతికి పాలు, పండ్లు సమర్పించి, పసుపుకుంకుమలు, సారెలతో పూజించి, వారిని సంతోషపెట్టేవారు. క్రమక్రమంగా ప్రజల్లో శౌచం తగ్గిపోవడం, ధర్మంపై శ్రద్ధ తగ్గి, ఆచరణ తగ్గిపోయిన కారణంగా నాగులు ఇంతకముందులా మనుషుల వలే శరీరంతో సంచరించడం మానేశాయని చెబుతారు. అందుకే  విగ్రహాల్లో వారిని ఆవాహన చేసి, పూజించినవారికి సత్ఫలితాలు ఇస్తాయంటారు. అందుకే దేవతా సర్పాలు కూడా జనసంచారం ఉన్న ప్రాంతాల్లో తిరగడం మానేశాయి. 75 ఏళ్ళ క్రితం వరకు దేవతసర్పాలను చూసి, పూజించి, వరాలను పొందిన కుటుంబాలు ఉన్నాయని చెబుతారు. కానీ ఇప్పడు సదాచారం, శౌచం, ధర్మం వంటి మంచి విషయాలను జనం వదిలేశారని…  ఎక్కడైనా ఉన్నా వాటిని సంక్రమంగా పాటించడం లేదని…అందుకే దేవతాసర్పాలు జనావాసాలకు దూరంగా వెళ్లిపోయాయని చెబుతారు.
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!

ఇప్పుడు పుట్టల్లో కనిపించేవి ఏంటి..వాటికి పూజచేయొచ్చా లేదా...!
ఇప్పుడు బయట కనిపించే పుట్టల్లో ఉండేవి దేవతాసర్పాలని చెప్పలేం. చాలావరకూ మామూలు పాములే. నాగపంచమి, నాగులచవితి కి నాగదేవతలకు పూజలు చేయాలి. కానీ పైన చెప్పుకున్న విషయాలు తెలియకపోవడం వల్ల ప్రజలంతా మామూలు పాములకు పూజలు చేస్తున్నారు. మామూలు పాములు పాలు త్రాగవు, వాటికి పసుపుకుంకుమలు పడవు. అందుకే నాగదేవతలను పూజించవలసి వచ్చినప్పుడు నాగప్రతిష్ట, నాగబంధం, నాగశిలలను మాత్రమే పూజించమని ధార్మిక గ్రంధాలు పేర్కొంటున్నాయి.


ఈశ్వర సృష్టిలో ప్రతి జీవికి ప్రాధాన్యత ఉంది. సాధారణ సర్పాలు జీవవైవిధ్యంలో, ఆహారచక్రంలో తమవంతు పాత్ర పోషిస్తాయి. వాటి మనుగడతోనే మానవమనుగడ సాధ్యమవుతుంది. మామూలు పాముల జోలికి వెళ్ళకుండా ఉండడం, వాటి మానాన వాటిని వదిలేయడం, వాటిని ఎవరైనా హింసిస్తుంటే రక్షించడం వల్ల కూడా దేవతాసర్పాలు, నాగజాతి అనుగ్రహం పొందవచ్చు. సంప్రదాయం మొదలైనప్పుడు అందులో మూఢనమ్మకమేమీ లేదు. కాలక్రమంలో మారిన అలవాట్ల కారణంగా, వచ్చిన మార్పులను ప్రజలు అర్దం చేసుకోపోవడం వల్ల మూఢనమ్మకంగా మారిందని చెబుతారు…

ఎవరి విశ్వాసాలు, నమ్మకాలు వారివి...కానీ పురాణాల్లో ప్రస్తావించిన వాస్తవాలివి అని చెబుతున్నారు పండితులు....


Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: కేదార్ నాథ్ లో మోదీ ఆవిష్కరించిన శంకరాచార్య విగ్రహం ప్రత్యేకతలివే...
Also Read: ఈ నంది లేచి రంకెలేస్తే కలియుగాంతమే… ఏటా పెరిగే బసవన్న, కాకులే కనిపించని క్షేత్రం
Also Read: తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం… భక్తులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement