బుద్ధి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి విశాలమైనది, మరొకటి సంకుచితమైనది. సంకుచితమైన బుద్ధి అంటే, "ఇది (ఫలానా విషయం) ఈ  విధంగా ఉంది. నాకు తెలుసు, ఇది ఇంతే." అని చెప్పేది. ఆ అభిప్రాయంలోనే మొండిగా ఉండిపోతుంది. విశాలబుద్ధి అంటే.. "ఓహో, అలాగా. బహుశా కావచ్చు.. ఏమో నాకు పెద్దగా తెలియదు!" అని చెబుతుంది. పరిమితమైన జ్ఞానం ఉండటం, నీకు తెలిసిన జ్ఞానాన్ని మాత్రమే పట్టుకుని ఉండిపోవటం- ఇవి బుద్ధిని చాలా కఠినంగా మారుస్తాయి. ఏదైనా పరిస్థితి నీకు అర్థమైనట్టు అనిపించి.. ఇదింతే అనే ఆలోచనకు ఫిక్సయ్యారంటే సమస్య మొదలైనట్లు లెక్క. వాస్తవానికి సమస్యలన్నీ ‘తెలియడం’ నుంచే మొదలవుతాయి.. ‘తెలియక పోవడం’ నుంచి కాదు. తెలియకపోవడం అంటే అది ఫలానా అని ముద్ర వేయలేం.. మీకేదో అన్యాయం జరిగిందని, మీరు బాధ పడుతున్నారని, దోషిగా మిమ్మల్ని మీరే భావించుకుంటూ ఉన్నా, మీకేదైనా చెడు జరిగిందని అనుకుంటున్నా.. అవన్నీ కూడా, "ఇది నాకు తెలుసు, ఇవి ఇలాగే ఉంటాయి." అనే లక్షణం కిందకే వస్తాయి. బాధలు పడడం అనేది పరిమితమైన జ్ఞానం వల్ల కలిగే ఫలితం. ‘ఇది మంచిది కాదని.. ఒక ముద్ర ఎప్పుడైతే వేశారో, ఆ ముద్ర పరిమితమైన జ్ఞానం నుంచి వచ్చిందని గ్రహించండి. ఎక్కడైతే ఆశ్చర్యం, ఓర్పు, ఆనందం ఉంటాయో అప్పుడు మీరు “నాకు తెలీదు….ఓహో, అలాగా, అదేంటి?" అనే స్థితిలో ఉన్నారన్నమాట.


Also Read: నువ్వే రాజు - నువ్వే మంత్రి… ఎవరికోసం నువ్వు మారవద్దు: శ్రీశ్రీ రవిశంకర్.


ఈ ప్రపంచం మీకు తెలుసని అనుకుంటారు. అదే అన్నిటికంటే పెద్ద సమస్య. ఒక సంఘటన జరిగినప్పుడు ఆది అలా జరగడానికి అనేక కారణాలు, మార్గాలు ఉంటాయి. పైకి కనిపించే కారణాలే కాకుండా సూక్ష్మమైన ఇతరకారణాలు కూడా ఉంటాయి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే....మీరు మీ గదికి వెళ్లేసరికి మీ మిత్రుడు ఆ గదిని చిందరవందరగా చేసి ఉంచాడనుకుందాం. అది మీకు కోపం తెప్పిస్తుంది. మీరేదో నిశ్శబ్దంగా పని చేసుకుందామని అనుకుంటూ గదికి వచ్చారు. ఇప్పుడు కోపంతో పళ్లు నూరుతున్నారు. మీ కోపానికి ఆ స్నేహితుడిని కారణంగా చూపిస్తారు. కానీ సూక్ష్మస్థాయిలో మరేదో జరుగుతోంది. కోపంతో కూడిన స్పందనలు ఆ సమయంలో మీలో ఉండి ఉండవచ్చు. కానీ మీరు మాత్రం గది చెత్తగా ఉండటం మాత్రమే చూసి, దాన్ని అలా ఉంచిన మిత్రుడివల్లనే మీకు కోపం వచ్చిందని భావిస్తారు. పరిమితమైన జ్ఞానం ఉండటంవల్ల ఇలా జరుగుతుంది.


Also Read: ఒంటరితనం పోగొట్టుకోవాలంటే ఒంటరిగానే ఉండాలి: గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్



"చీకట్లో చూసుకుంటూ వెళ్ళి, పట్టపగలు గోతిలో పడినట్లు" అనే ఓ సామెత ఉంది. రాత్రి చీకట్లో వెళ్తున్నప్పుడు అక్కడ గొయ్యి ఉందని తెలుసుకుని జాగ్రత్తగా వెళ్ళావు. కానీ పట్టపగలు అదే గోతిలో పడ్డావు. అంటే నువ్వు కళ్ళు తెరిచి చూడటం లేదని, చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించేంత సున్నితంగా లేవని అర్థం. సంఘటనలు, భావావేశాలను... వ్యక్తులకు ఆపాదించి చూస్తున్నంత కాలం ఈ చక్రం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పటికీ దీని నుంచి స్వేచ్ఛను పొందలేరు. అందుకే మొదట బంధాన్ని విడదీయండి. ఒక సంఘటన లేదా ఒక భావావేశం వంటి వాటిని ఆ మనిషి నుంచి, ఆ ప్రదేశం నుంచి, ఆ కాలం నుంచి విడదీసి చూడండి. నీ చేతికి ముల్లు గుచ్చుకుంటే దాని అనుభవం మీ శరీరం అంతటా కలుగుతుంది. కాబట్టి శరీరంలోని ప్రతి కణం మొత్తం ‘నీతో’ సంబంధం కలిగి ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ సమస్త విశ్వంతో, ప్రతీ ఒక్కరితోనూ సంబంధం కలిగి ఉన్నారు. ఎందుకంటే, బయటకు అనేకంగా కనిపిస్తున్నా, అత్యంత సూక్ష్మమైన స్థాయిలో ఒకటే ప్రాణం ఉంది. మరింత లోతుగా వెళ్లి పరిశీలించినప్పుడు ఇదంతా ఒకటే ఉనికి, ఒకటే దివ్యత్వం.


Also Read: సమస్యల వలయంలో ఉన్నారా… బయపడే మార్గాలను ఇలా అన్వేషించండి




ఎదుటి వ్యక్తి చేసే తప్పుల వెనుక కారణాలు వెతకడం, వారి వల్లనే తప్పులు జరిగాయని అనుకోవడం వారిపై పగబట్టడం లాంటివి చేయకూడదు. అది ఏ ఒక్కరివల్లనో జరిగిన తప్పు కాదని అర్థం చేసుకున్నప్పుడుమన..మన ఆలోచనలో మార్పు వస్తుంది. ప్రపంచం మారుతుంది...ఆత్మ మారదు. అంటే... మీరు మారకుండా ఉండే ఆత్మపై ఆధారపడి...మారుతున్న ప్రపంచాన్ని అంగీకరించాలన్నమాట.


Also Read: శత్రువు ఎంత బలహీనంగా ఉంటే... విజయం అంత కష్టమవుతుంది...చాణక్యుడు చెప్పే కేటగిరిలో మీరు ఎక్కడ ఉన్నారు