ప్రపంచంలోనే అతి పురాతన విశ్వవిద్యాలయాల్లో తక్షశిల ఒకటి. ప్రస్తుత విశ్వవిద్యాలయాలు నేర్పే విద్యతో పోల్చితే తక్షశిల విశ్వవిద్యాలయంలో నేర్పే విద్య ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆహా అనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఇలాంటి విశ్వవిద్యాలయాలు సాధ్యమా అనిపించకమానదు. ఇందులో చదివిన వారంతా గొప్పవారయ్యారు. ఆచార్య చాణక్యుడు కూడా తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించాడు. చదువు పూర్తయ్యాక అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా సేవలందించాడు. ఆ సమమంలో విద్యార్థులకు చెప్పిన ఓ నీతి కథ నేటి తరం కూడా తెలుసుకోవాలి. అదేంటంటే…
అడవిలో లేడి భారంగా అడుగులు వేస్తూ వెళుతోంది. నిండు గర్భిణి కావడంతో అప్పుడే నొప్పులు మొదలయ్యాయి. ప్రసవించేందుకు అనుకూల ప్రదేశం కోసం వెతుకుతోంది. ఓ మూల దట్టమైన గడ్డి కనపడింది…అటుగా నది కూడా ప్రవహిస్తోంది. అదే మంచి ప్రదేశం అనే ఆలోచనతో అటుగా అడుగులు వేస్తోంది. ఇంతలో దట్టమైన మబ్బులు కమ్మాయి. ఉరుములు, పిడుగులు మొదలయ్యాయి. ఏ గడ్డిచూసి అటువైపు వెళుతోంది…పిడుగుపడి ఆ గడ్డికి నిప్పంటుకుంది. మరోవైపు నుంచి సింహం వస్తోంది…ఇంకోవైపు వేటగాడు బాణం ఎక్కుపెట్టి ఉంచాడు…నాలుగో వైపు నది ఉంది. ఇప్పుడా లేడి ఏం చేస్తుంది? ఆ సమస్య నుంచి ఎలా తప్పించుకుంటుంది? బిడ్డకు జన్మ ఇస్తుందా ? ఇచ్చినా ఇద్దరూ బతుకుతారా? సింహం లేడిని తినేస్తుందా? వేటగాడు లేడిని చంపేస్తాడా ? గడ్డికి అంటుకున్న నిప్పులో లేడి దహనమవుతుందా? అసలేం జరగబోతోంది?
ఓ నిప్పు, రెండో వైపు నది, మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపంలో వేటగాడు, సింహం. కానీ లేడి ఇవేం పట్టించుకోలేదు. అప్పడు దాని దృష్టంతా కాసేపట్లో కళ్లముందుకి రాబోయే బిడ్డపైనే ఉంది. ప్రాణం పోతేపోనీ… బిడ్డను కనడంమీదే దృష్టి పెట్టింది. అప్పుడు పరిణామాలు ఎలా మారాయో తెలుసా….వర్షంతో పాటు పిడుగు పడింది.. ఆ పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చెదిరి బాణం గురి తప్పింది.. అది వెళ్లి సింహానికి తగిలింది. వర్షం పడి అడవిలో రాజుకున్న మంటలు ఆరిపోయాయి. అదే సమయంలో లేడి పిల్ల తల్లి గర్భం లో నుండి బయటకు వచ్చింది.
అదే లేడి తన ప్రాణం గురించి అలోచించి..చుట్టూ పరిస్థితులు చూసి బిడ్డకు జన్మ నివ్వడంపై దృష్టి పెట్టకుండా ఉండి ఉంటే…తప్పకుండా తప్పటడుగు వేసేది. అప్పుడేం జరిగేది? . మన జీవితాలు కూడా అంతే. జీవితం అన్నాక సమస్యలు రాకుండా ఉండవు. ఆ సమస్యలు చూసి కుంగిపోతే నెగటివ్ ఆలోచనలు మరింత పెరుగుతాయి. అప్పుడు ఆలోచనలు దారితప్పుతాయి. తప్పుడు ఫలితం పొందాల్సి వస్తుంది. అలాకాకుండా…మనపని మనం చేసుకుపోతుంటే… వచ్చే అడ్డంకులు ఎలా వచ్చాయో అలాగే పోతాయంటాడు చాణక్యుడు.