ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే పోర్న్ కేసులో రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారో ఈ ఎఫెక్ట్ శిల్పాశెట్టిపై పడుతుందని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్లే జరుగుతోంది. రాజ్ కుంద్రా అరెస్ట్ తో శిల్పాశెట్టి కోట్లలో ఆర్ధిక నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ప్రస్తుతం సూపర్ డాన్సర్ 4కి జడ్జిగా వ్యవహరిస్తోంది శిల్పాశెట్టి. ఈ షో కోసం ఒక్కో ఎపిసోడ్ కి ఆమె 18 నుండి 22 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఎప్పుడైతే రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారో అప్పటినుండి ఆమె ఈ షోకి సంబంధించిన షూటింగ్ కు వెళ్లడం మానేసింది. 


అలా చూసుకుంటే ఈ బ్యూటీ మొత్తం రూ.2 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి శిల్పాశెట్టి స్థానంలో ఓ ఎపిసోడ్ కు కరిష్మా కపూర్ ను తీసుకొచ్చారు. రీసెంట్ గా జెనీలియా-రితేష్ దేశ్ ముఖ్ లు గెస్ట్ లుగా వచ్చారు. భారీ రెమ్యునరేషన్లు ఆఫర్ చేస్తూ పేరున్న సెలబ్రిటీలను గెస్ట్ జడ్జిలుగా తీసుకొస్తున్నారు. అయితే ఎక్కువ రోజులు ఇలా షోను నడిపించడం కష్టం. అందుకే ఛానెల్ యాజమాన్యం ఈ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. 


Also Read : Shilpa Shetty Statement: తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి.. శిల్పాశెట్టి ఫైర్


పర్మనంట్ గా శిల్పాశెట్టిని షో నుండి తప్పించాలని అనుకుంటుందట. ఆమె స్థానంలో మరో సెలబ్రిటీను రంగంలోకి దించాలని చూస్తున్నారు. అదే జరిగితే శిల్పాకు ఆర్థికంగా మరింత నష్టం కలుగుతుంది. శిల్పాశెట్టి షోకి రావాలంటే రాజ్ కుంద్రా కేసు ఓ కొలిక్కి రావాలి. లేకపోతే ఆమె మరిన్ని ఎపిసోడ్లను స్కిప్ చేయడం ఖాయం. అశ్లీల చిత్రాల రూపొందిస్తున్నారనే కేసులో రాజ్ కుంద్రాను గత నెల 19న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 


ఈ కేసులో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే ఇప్పటికే ఈ కేసు కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. మరోపక్క ఈ కేసుకి, శిల్పాశెట్టికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ విషయంలో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేసుతో శిల్పాశెట్టికి సంబంధం లేకపోయినప్పటికీ.. ఆమె కెరీర్ పై ఈ కేసు ఎఫెక్ట్ చూపించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. 


ఇప్పటికే సోషల్ మీడియాలో ఆమెను ఉద్దేశిస్తూ చాలా మంది నెగెటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేస్తున్నారు. మీడియా కూడా పలు కథనాలు ప్రచురిస్తోంది. ఈ విషయంలో శిల్పాశెట్టి ఓ స్టేట్మెంట్ ను రిలీజ్ చేసింది. ముంబై పోలీసులు, భారత వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని.. దయచేసి తన గురించి తప్పుడు ప్రచారాలు చేయొద్దని.. ఒక తల్లిగా తన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని అడుగుతున్నానని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.