ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో జూలై 19న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఎట్టకేలకు తన భర్త అరెస్ట్ పై శిల్పాశెట్టి స్పందించారు. నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు సృష్టించవద్దని ఆమె అన్నారు. భారత న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆమె తెలిపారు. ఈ క్రమంలో సోమవారం నాడు ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. 


గత కొన్నిరోజులుగా ప్రతి విషయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నామని.. రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యహారంపై ఎన్నో పుకార్లు.. ఊహాగానాలు వస్తున్నాయని.. మీడియాతో పాటు తన సన్నిహితులు కూడా తనను.. తన కుటుంబాన్ని నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటివరకు తను ఎక్కడా మాట్లాడలేదని.. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉన్న కారణంగా ఆ విషయంపై మాట్లాడదలచుకోలేదని చెప్పారు. 


ముంబై పోలీసులు, భారత వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. దయచేసి తన గురించి తప్పుడు ప్రచారాలు చేయొద్దని.. ఒక తల్లిగా తన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని అడుగుతున్నానని పేర్కొన్నారు. అధికారికంగా పూర్తి సమాచారం లేకుండా కామెంట్స్ చేయొద్దని శిల్పాశెట్టి కోరారు. 



రాజ్ కుంద్రా అరెస్ట్ కేసులో పోలీసులు ఇటీవల శిల్పాశెట్టిని సైతం విచారించారు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన రాజ్ కుంద్రాను చూసి శిల్పాశెట్టి ఎమోషనల్ అయిందని కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. అలానే రాజ్ కుంద్రాకు సినీ ఇండస్ట్రీతో సంబంధం లేదని.. శిల్పాశెట్టి కారణంగానే అతడు కాంటాక్ట్స్ సంపాదించి ఈ వ్యాపారం మొదలుపెట్టారని అంటున్నారు. ఈ వ్యాపారంలో శిల్పాశెట్టి ప్రమేయం కూడా ఉండే ఉంటుందని కొందరు సోషల్ మీడియాలో వాదిస్తున్నారు. ఇవన్నీ చూసి విసిగిపోయిన శిల్పాశెట్టి ఇలా ట్విట్టర్ లో స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఉంటుంది. ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే వరకు శిల్పాశెట్టిపై ఈ తరహా వార్తలు వస్తూనే ఉంటాయి. 


రాజ్ కుంద్రాపై నేరం రుజువైతే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. సొసైటీలో పేరున్న వ్యక్తి, పైగా శిల్పా శెట్టి భర్త ఇలాంటి పనులు చేసి ఉంటాడా..? ఇవన్నీ తప్పుడు ఆరోపణలేమోనని సందేహించే వాళ్లు కూడా ఉన్నారు. కానీ రాజ్ ఒక ప్రణాళిక ప్రకారమే పోర్నోగ్రఫీ రాకెట్ నడిపిస్తున్నాడని.. దీని వెనుక పెద్ద తతంగమే ఉందని ముంబయి పోలీసులు అంటున్నారు.