వైసీపీ ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల రుణం కోసం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా వెళ్తోందని పీఏసీ ఛైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ రుణ వ్యవహారాలపై కేంద్రం కాగ్‌తో విచారణ జరిపించాలని కోరారు. రూ.25 వేల కోట్ల రుణం కోసం దేశంలో ఏ రాష్ట్రం చేయని చర్యకు ఏపీ ప్రభుత్వం పాల్పడిందన్నారు. శాసనసభకు తెలియకుండా, గవర్నర్ కార్యాలయాన్ని దారి మళ్లించి మరీ రుణాల కోసం అడ్డదారులు తొక్కారని విమర్శించారు. పత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా కేంద్రం స్పందించే వరకు గవర్నర్ కార్యాలయ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాలు నడపడానికి అప్పులు చేయడమనేది సాధారణమేనన్న పయ్యావుల.. కానీ ఎడాపెడా, నిబంధనలు, రాజ్యాంగ సూత్రాలు పట్టించుకోకుండా వ్యవస్థలను తుంగలో తొక్కేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు.
బ్యాంకుల లీగల్ సలహా విభాగాలు ప్రభుత్వం చెప్పింది గుడ్డిగా ఎలా నమ్ముతాయని ప్రశ్నించారు. ఎవరు ఎవరిని మోసగించే ప్రయత్నం చేశారో తేలాలన్నారు. రాష్ట్రప్రభుత్వం ఖజానాకు రావాల్సిన నిధిని నేరుగా బ్యాంకులకే ఇస్తామని సంతకాలు చేశారని ఆరోపించారు. ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సంస్థ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం పెద్దతప్పు చేసిందన్నారు. వ్యవస్థలు బలోపేతం కావాలనే తాము కోరుకుంటున్నాము తప్ప, ప్రభుత్వాన్ని తప్పుపట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు.
41 వేల కోట్ల చెల్లింపులకు బిల్లులు లేవు
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవతవలకు సంబంధించిన అనేక విషయాలను ఇప్పటికే బహిర్గతంచేశామని, గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని టీడీపీ సీనియర్ నేత స్పష్టంచేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 'రూ.41వేల కోట్ల చెల్లింపులకు బిల్లులు లేకపోవడం, రూ.17 వేల కోట్లు అదనంగా విత్‌డ్రా చేయడం, రూ.25 వేల కోట్ల రుణాలకు సంబంధించిన వ్యవహారం కానీ ఏదీ సరిగాలేదని చెప్పాము. భవిష్యత్ తరాలకు సంబంధించిన ఆదాయాన్ని చూపించి అప్పులు తేవడం తప్పని తాము చెప్పాము. కేంద్రం కూడా అది తప్పని దానిలో కుట్ర ఉందని చెప్పింది. ఆర్టికల్ 266 ప్రకారం, రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుతో ఇష్టానుసారం అప్పులు తెస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా, ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మరీ తప్పుచేసింది. రాజ్యాంగ మౌలికసూత్రాలను కూడా పక్కన పెట్టి, అప్పుల కోసం ఈ విధమైన చట్టాలు ఎలా చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై సీఏజీ (కాగ్) తో విచారణ జరిపించాలని' పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.
రుణాల కోసం రాజ్యాంగ ఉల్లంఘన
రుణాలిచ్చిన బ్యాంకులపై కూడా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత సంస్థతో విచారణ జరిపించాలని పయ్యావుల కేశవ్ కోరారు. కేంద్రం కేవలం రెండు, మూడు అంశాలను మాత్రమే ప్రస్తావించిందన్న ఆయన.. ఇంకా పెద్ద ఎత్తున అనేక ఆర్థిక అంశాలలో అవకతవకలు జరిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అప్పులు చేసిందని ఆరోపించారు. బడ్జెట్‌కు సంబంధించిన అవసరాలను ప్రభుత్వం బడ్జెట్‌లో చూపాలి, కానీ హాప్ బడ్జెట్ బారోయింగ్స్ పేరుతో చేస్తున్న అప్పులను ఏ రకంగా సమర్థించుకుంటారని పయ్యావుల ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకువచ్చి, ఆచట్టం ఆధారంగా అనేక సంస్థలు ప్రభుత్వానికి అప్పులిచ్చాయన్నారు. ప్రభుత్వానికి ఇప్పుడు చట్ట సవరణ చేయడం తప్ప మరోమార్గం లేదన్న ఆయన... అదే గానీ చేస్తే ప్రభుత్వం చేసు కున్న రహస్య ఒప్పందాలు చెల్లుబాటు అవుతాయా? బ్యాంకులు వాటిని కొనసాగిస్తాయా? అని ప్రశ్నించారు. రుణాల కోసం ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వెళుతున్నారని తాము తొలి నుంచీ చెబుతున్నామన్నారు.
గవర్నర్ పేరుతో సంతకాలు
ఈ వ్యవహారాన్ని మరింత విచారణ జరిపితే మరిన్ని తప్పులు కనిపిస్తాయని, బ్యాంకులు మరింత చిక్కుల్లో మునిగిపోతాయన్నారు. ప్రభుత్వమిచ్చిన జీవోలకు, ఒప్పందాలకు మధ్య తేడాలున్నాయన్న పయ్యావుల.... ఎవరు ఎవరిని మోసంచేశారో తేలాలన్నారు. ఇదంతా ముఖ్యమంత్రికి తెలుసా.. మంత్రికి తెలుసా అనేది సైతం తేలాల్సి ఉందన్నారు. రుణాల కోసం తప్పుడు నివేదికలు ఇవ్వడం ఈ ప్రభుత్వానికి కొత్తకాదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పులు చేస్తున్నామని ఆరోపించి, అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం చేస్తున్నదేంటని ప్రశ్నించారు. గవర్నర్ పేరుతో సంతకాలు పెట్టడమేంటని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన చట్టాన్ని గవర్నర్ కార్యాలయానికి పంపినప్పుడు, ఆ చట్టంపై గవర్నర్ తన కార్యాలయ సిబ్బందితో అధ్యయనం చేయించారా లేదా అనేది తెలియాల్సిఉందన్నారు. ఇటువంటి ప్రతిపాదనలను తిప్పి పంపే అధికారం గవర్నర్‌కు ఉందన్నారు. కానీ ప్రభుత్వం పంపే ప్రతీ చట్టాన్ని ఎలా ఆమోదిస్తారని పయ్యావుల ప్రశ్నించారు.