అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందిస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు విషెస్ చెబుతున్నారు. అలానే ట్విట్టర్ లో 'తగ్గేదేలే' అనే ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. బన్నీ ఫ్యాన్స్ వేస్తున్న ట్వీట్లను, పోస్ట్ లను చూసిన 'పుష్ప' టీమ్ వెంటనే రియాక్ట్ అవుతూ.. ఈరోజు అప్డేట్ ఉండబోతుందంటూ సంకేతాలు ఇచ్చింది. 


దీంతో ఫస్ట్ సింగిల్ అప్డేట్ రాబోతున్నట్లు ప్రేక్షకులు ఊహించారు. దానికి తగ్గట్లే చిత్రబృందం చిన్నపాటి టీజర్ ను విడుదల చేసింది. ఇందులో దేవిశ్రీప్రసాద్ తో పాటు ఐదు భాషలకు చెందిన సింగర్స్ కనిపించారు. శివమ్, బెన్నీ డయల్, విజయ్ ప్రకాష్, రాహుల్ నంబియార్, విశాల్ దద్లాని లాంటి టాలెంటెడ్ సింగర్స్ తో మొత్తం ఐదు భాషల్లో పాటను పాడించారు. ''దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక'' అంటూ సాగే ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ ను ఆగస్టు 13న విడుదల చేయనున్నారు. 



దీంతో ఫ్యాన్స్ ఆరోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో పాటలు కొన్నేళ్ల పాటు మనల్ని వెంటాడుతూనే ఉంటాయని.. ప్రతీ పాట అద్భుతంగా వచ్చిందని చెబుతున్నారు. ఈ సినిమా తరువాత దేవిశ్రీప్రసాద్ హవా మళ్లీ మొదలవుతుందని అంటున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ను ఇటీవల తిరిగి మొదలుపెట్టారు. కానీ దర్శకుడు సుకుమార్ అనారోగ్యం పాలవ్వడంతో షూటింగ్ వాయిదా పడింది. 


నిజానికి ఇప్పటికే ఫస్ట్ పార్ట్ కి కావాల్సిన ఫుటేజ్ మొత్తాన్ని చిత్రీకరించేశారు. దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలానే రెండో పార్ట్ కి కావాల్సిన ఫుటేజ్ ను కూడా చిత్రీకరించే పనిలో పడ్డారు. ఈ ఏడాదికల్లా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేస్తే వచ్చే ఏడాది సమ్మర్ నాటికి సినిమాను విడుదల చేసుకోవచ్చని భావిస్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఫస్ట్ పార్ట్ తరువాత కొత్త సినిమా చేయాలనుకుంటున్నారు. ఆ తరువాత సుకుమార్ కి కాల్షీట్స్ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ సుకుమార్ మాత్రం దానికి అంగీకరించడం లేదు. 
మరి ఈ విషయంలో హీరో, దర్శకుడు ఒక మాట మీదకు వస్తారేమో చూడాలి. ఈ సినిమాను ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.