ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు రేపు (ఆగస్టు 15) ఇండియాలో లాంచ్ కానున్నాయి. రేపు మధ్యాహ్నం 2 గంటలకు వీటిని భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేస్తామని చెప్పినప్పటి నుంచి వీటిపై బజ్ పెరిగిపోయింది. వినియోగదారులంతా వీటి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో 24 గంటల్లో ఇవి మన ముందుకు రానున్నాయి.


మొత్తం 10 కలర్ ఆపన్లతో ఈ స్కూటర్లు రేపే దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ద్విచక్ర వాహనాల్లో అరుదుగా ఉండే రివర్స్‌ మోడ్‌ ఫీచర్ ఈ స్కూటర్లలో ఉండనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ స్కూటర్లకు సంబంధించిన వివరాలను ఓలా సీఈవో భవిష్‌ అగర్వాల్ ఎప్పటికప్పుడు ట్వీట్ల రూపంలో పంచుకుంటున్నారు. 






రూ.85 వేల రేంజ్‌లో ధర..
ఓలా స్కూటర్ ఫీచర్లు, ధర మీద పలు లీకులు అందుతున్నాయి. ఇప్పటివరకు అందిన లీకుల ప్రకారం చూస్తే.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర రూ.80000 నుంచి రూ.85000 మధ్య ఉండే అవకాశం ఉంది. దీనిని ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే దాదాపు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లుగా ఉండే ఛాన్స్ ఉంది. మన ఇంట్లో ఉండే సాధారణ సాకెట్ ద్వారా కూడా ఈ స్కూటర్లకు చార్జింగ్ పెట్టవచ్చని తెలుస్తోంది. 



యాప్ ఆధారంగా పనిచేసే 'కీ'
ఓలా స్కూటర్లలో భారీ బూట్ స్పేస్ ఉండనుంది. దీంతో పాటు 'కీ' లేకుండా (కీలెస్) పనిచేసేలా దీనిని రూపొందించినట్లు సమాచారం. స్మార్ట్ ఫోన్ కనెక్టవిటీతో అంటే యాప్ ఆధారంగా పనిచేసే 'కీ'తో ఇవి పరుగులు పెట్టనున్నాయి. ఈ స్కూటర్లు ఎర్గోనామిక్ సీటింగ్‌తో వస్తాయని ఓలా ఇప్పటికే ప్రకటించింది. ఓలా కొత్త స్కూటర్లు ఎస్, ఎస్ 1, ఎస్ 1 ప్రో అనే మూడు వేరియంట్లలో రానున్నట్లుగా సమాచారం.



డీలర్‌షిప్ నెట్‌వర్క్ లేకుండానే..
ఓలా ఈ స్కూటర్లను హోండెలివరీ చేయనుంది. అంటే నేరుగా వినియోగదారుల ఇళ్లకే ఇవి చేరతాయి. దీనిని డైరెక్ట్ టు కన్స్యూమర్ సేల్స్ అంటారు. కొనుగోలు వ్యవస్థ అంతా తయారీదారుడికి, వినియోగదారుడికి మధ్యే జరుగుతుంది. ఇందులో సాంప్రదాయక డీలర్‌షిప్ నెట్‌వర్క్ ఉండదు. 



బజాజ్ చేతక్‌కు పోటి..
ఓలా స్కూటర్లు బజాజ్ చేతక్ బైక్స్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. బజాజ్ చేతక్ బైక్స్ రెండు వేరియంట్లలో లభిస్తున్నాయి. వీటి ధర రూ.లక్షగా ఉంది. 3 కేడబ్ల్యూహెచ్ కెపాసిటీ కలిగిన బ్యాటరీతో ఇవి పనిచేస్తాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు 5.36 BHP పవర్, 16 NM టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే ఎకో మోడ్‌లో 95 కిలోమీటర్లు, స్పోర్ట్ మోడ్‌లో 85 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.


Also Read: Tata EV Sedan Tigor: టాటా నుంచి టైగోర్ కారు.. వచ్చే వారంలో రిలీజ్.. ధర ఇంత ఉంటుందా?