జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్షణికావేశానికి గురైన ఓ తల్లి ఇద్దరు కన్న కొడుకులను బావిలో వేసింది. తాను సైతం బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పెద్దపులిని చూపిస్తానని మాయమాటలు చెప్పి ఆ తల్లి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటనలో చిన్న కుమారుడు బతికిపోగా తల్లి, పెద్ద కుమారుడు చనిపోయారు. జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలం కిష్టంపేటలో ఈ ఘటన జరిగింది. కూలీనాలి చేసుకునే ఈ కుటుంబంలో ఉన్నట్టుండి అలజడి రేగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం కిష్టంపేటలో కస్తూరి సంపత్, లావణ్య(25) అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి గణేశ్‌(8), హర్షవర్ధన్‌ (6) ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరు పదేళ్ల క్రితం స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి ఉపాధి కోసం కిష్టంపేట గ్రామానికి వలస వచ్చారు. ఇక్కడే కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కూలీనాలీ చేసుకుంటూ కాలం గడుపుతున్న ఆ కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా తగాదాలు ఉన్నాయని స్థానికులు చెప్పారు. 


Also Read: Weather Updates: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఏపీలో కూడా ఈ ప్రాంతాల్లో.. వాతావరణశాఖ హెచ్చరిక


అయితే, శుక్రవారం భార్యాభర్తలు ఇద్దరూ అల్లీపూర్‌ గ్రామంలోని ఓ మేస్త్రీ వద్ద తాపీ పని చేసి ఇంటికి తిరిగి వచ్చారు. కొద్దిసేపటి తర్వాత భార్య లావణ్య, తన ఇద్దరు పిల్లల్ని పెద్దపులి చూపిస్తానంటూ తీసుకెళ్లింది. గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావివద్దకు వారిద్దరినీ తీసుకొని వెళ్లింది. తర్వాత ఇద్దరు కుమారులను పట్టుకుని బావిలో దూకేసింది. అయితే, ఈ ప్రయత్నంలో తల్లి, పెద్ద కుమారుడు మాత్రమే బావిలో పడిపోయారు. చిన్న కుమారుడు హర్షవర్ధన్‌ బావి గట్టుపైనే ఉండిపోయాడు. వెంటనే బాలుడు భయంతో కేకలు వేసి చుట్టుపక్కల ఉన్నవారిని పిలిచాడు. అక్కడ ఉన్నవారికి ఈ విషయం చెప్పగా అందరూ కలిసి లావణ్య, గణేశ్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. 


ముందు రోజే కేక్ కటింగ్
కానీ, అప్పటికే వారు నీటిలో మునిగి చనిపోయారు. చివరికి మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టం కోసం జగిత్యాలలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కుటుంబంలో గొడవల వల్లే భార్య లావణ్య ఈ దారుణానికి పాల్పడినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత చిన్న కొడుకు హర్షవర్థన్ విలేకరులతో మాట్లాడుతూ.. నిన్న తన పుట్టిన రోజు ఉందని, అమ్మానాన్నలతో కలిసి కేక్ కూడా కట్ చేశానని చెప్పుకొచ్చాడు. రాత్రి కూడా అందరం బాగానే ఉన్నట్లు చెప్పాడు. ఉదయాన్నే అమ్మానాన్నలు పనికిపోయారని.. తిరిగొచ్చాక తమకు పెద్దపులిని చూపిస్తానని అమ్మ ఇద్దర్నీ బావి దగ్గరికి తీసుకుపోయిందని బాలుడు చెప్పాడు. అన్నను తీసుకుని బావిలో దూకిందని... తాను మాత్రం బావిగట్టు వద్దే ఉండిపోయానని చెప్పుకొచ్చాడు.


Also Read: Gold-Silver Price: రూ.100 పెరిగిన పసిడి ధర.. వెండి కూడా అదే దారిలో.. తాజా ధరలివే..