దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చే వారం భారత మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. దీని పేరు టాటా ఈవీ సెడాన్ టైగోర్ (Tata EV Sedan Tigor). ఈ కారు ఆగస్టు 17న ఇండియాలో విడుదల కానున్నట్లు సంస్థ ధ్రువీకరించింది. దీనికి సంబంధించి అధికారిక టీజర్ విడుదల చేసింది. ఈ కార్లలో జిప్ట్రాన్ (Ziptron) టెక్నాలజీని ఉపయోగించినట్లు సంస్థ తెలిపింది.
టాటా ఈవీ సెడాన్ టైగోర్.. హై వోల్టేజ్ 300 ప్లస్ వోల్ట్ పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటారుతో రానుంది. టాటా నుంచి గతంలో విడుదలైన టైగోర్ ఈవీ కార్లలో ఉపయోగించిన 72 వోల్ట్ ఏసీ ఇండక్షన్ టైప్ మోటార్ కంటే ఇది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. సెడాన్ టైగోర్ కేవలం ఐదు సెకన్లలోనే 0 నుంచి 60 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకోగలదని కంపెనీ చెబుతోంది.
దీని బ్యాటరీకి ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ పెడితే 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. కాగా, ఈ కారు ధర రూ.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుందని లీకుల ద్వారా తెలుస్తోంది. టాటా టైగోర్ ఈవీలలో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, బంపర్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, బ్లూ యాసెంట్‌లతో కూడిన అల్లాయ్ వీల్స్ అందించనున్నారు. అలాగే ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ అందించే అవకాశం ఉంది.
ప్రస్తుతం టాటా నుంచి రెండు ఎలక్ట్రిక్ కార్లు దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒకటి టాటా నెక్సన్ కాగా, మరొకటి టాటా టైగోర్ ఈవీ. టైగోర్ ఈవీని ట్యాక్సీ సర్వీసులకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. త్వరలోనే వీటికి టాటా ఈవీ సెడాన్ టైగోర్ కారు జతచేరనుంది.