Mauni Amavasya 2025 Date and Time:  ఏటా పుష్యమాసం ఆఖరి రోజు వచ్చే అమావాస్యను  చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని పిలుస్తారు.  ఏడాది పొడవునా మొత్తం 12 అమావాస్యలు వస్తాయి. వాటిలో చొల్లంగి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉందని చెబుతారు పండితులు. ముఖ్యంగా పితృదోషాలు తొలగిపోయి వారి ఆశీస్సులు లభించాలంటే ఈ అమావాస్య చాలా ప్రత్యేకం అని చెబుతారు. 


సాధారణంగా ప్రతి అమావాస్య రోజు పితృదేవతల ఆశీర్వచనం కోసం  తర్పణాలు విడుస్తారు, పిండప్రదానాలు చేస్తారు..దాన ధర్మాలు అన్నదానాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలకు అన్ని అమావాస్యల కన్నా మౌని అమావాస్య అత్యంత విశేషమైనది. 


2025 లో జనవరి 29 బుధవారం మౌని అమావాస్య వచ్చింది. ఈ రోజు శ్రీమహా విష్ణు ఆరాధన చేయడం, భాగవత పారాయణం చేయడం శుభకరం. ఈ రోజు ఆచరించే దాన ధర్మాలు అంతులేని ఫలితాన్నిస్తాయి. ఈ రోజు చేసే పూజ, ఉపవాసం..కుటుంబం అభివృద్ధికి దోహదం చేస్తాయి.  


Also Read: జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు తేదీలివే!


మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం విశేష పుణ్యఫలం. మౌని అమావాస్య రోజు సముద్రస్నానం ఆచిరిస్తే సకల దోషాలు నశిస్తాయని చెబుతారు. సముద్రస్నానం కుదరనివారు నదీస్నానం చేసినా అత్తుత్తమం. అయితే ఈ ఏడాది కుంభమేళా సందర్భంగా అక్కడ స్నానమాచరిస్తే మరింత పుణ్యం. 


పితృ దోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజు మీ పూర్వీకులను స్మరించుకుని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. రాగిపాత్రలో ఎర్రటి పూలను నీటిలో కలిపి ఈ నీటితో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి.  


మౌని అమావాస్య రోజు రావిచెట్టును పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. రావి చెట్టు త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు..ఈ రోజు రావి చెట్టుకి నీటిని సమర్పించి అక్కడ దీపం వెలిగించాలి. చెట్టు చుట్టూ దారాలు చుడుతూ 108 ప్రదక్షిణలు చేయాలి 


Also Read: ఫిబ్రవరి 26 or 27.. మహా శివరాత్రి ఎప్పుడు - మిగిలిన దేవుళ్ల కన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం!
 
మౌని అమావాస్య రోజు నువ్వులు కానీ, నువ్వులతో చేసిన వస్తువులను కానీ దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది.  దుప్పటి, ఉసిరి కాయలు, నల్లని వస్త్రాలను దానం ఇస్తే పితృదోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. 


చొల్లంగి అమావాస్య రోజు ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుంది. చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి.అమావాస్య రోజు పూర్వీకులు తమ వంశస్థులను కలిసేందుకు వస్తారని గరుడపురాణంలో ఉంది
 
ఈ రోజు ఆకలితో మీ ఇంటిముందుకి వచ్చిన వారిని ఖాళీచేతులతో పంపించకండి. ఆహారం పెట్టంది..అవకాశం ఉంటే వస్త్రదానం చేయండి.  
 
అమావాస్య రోజు మాత్రమే కాదు ఏ రోజూ మూగజీవాలను హింసించవద్దు. వాటికి ఆహారం ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు కానీ హింసకు పాల్పడవద్దు.  ఆవులు, కుక్కలు, కాకులకు ఆహారం అందించండి. 


Also Read: జ్యోతిర్లింగాలను ఒకే ట్రిప్​లో ఎలా కవర్​ చేయొచ్చో తెలుసా? హైదరాబాద్​ నుంచి ఇలా స్టార్ట్ అయిపోండి


మౌని అమావాస్య రోజు చీమలకు పంచదార వేస్తే గ్రహదోషాలు నశిస్తాయి. చీమలు ఐకమత్యానికి నిదర్శనం..ఒకే పుట్టలో కలసి ఉండడమే కాదు శ్రమైక జీవనానికి నిదర్శనం. అందుకే వాటికి ఆహారం అందిస్తే మంచిదంటారు.


గమనిక: మత గ్రంధాల్లో పేర్కొన్నవి, పండితులు సూచించిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది.. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...