అరసవిల్లి దేవస్థానం వసతి గృహాలు, అన్నదాన సత్రం, క్యూలైన్ల బారికేడ్లు, కళావేదిక నిర్మాణాల్లో దాతల భాగస్వామ్యం చాలానే ఉంది. ఆలయం ముందు ఏర్పాటు చేసిన షెడ్డులు,క్యూలైన్లు వారి విరాళాలతో నిర్మించారు. నేడు అన్నదాన సత్రం, రేకుల షెడ్లు అంతా తొలగించారు. అభివృద్ధిలో భాగస్వామ్యులైన దాతలు దగాపడ్డారు. ఆలయానికి వచ్చే భక్తులకి దేవాదాయశాఖ పరంగా ఏర్పాట్లు చేయకపోగా దాతల విరాళాల ద్వారా చేపట్టిన పనులను అర్థాంతరంగా తొలగించారు. దీంతో దాతల సొమ్ములు నేలపాలయ్యాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అసలేంటీ మాస్టర్ ప్లాన్
మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పి ఉన్న వసతులను దేవాదాయ శాఖ అధికారులు ఆగమేగాల మీద తొలగించారు. రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న వేళ భక్తులకు అవసరమైన వసతులు మెరుగుపడేలా చేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా ఆలయానికి సంబందించిన నిర్మాణాలను నేలమట్టం చేసేస్తున్నారు. శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధికి ఆమడదూరంలో నిలుస్తూ వచ్చింది. ఆలయానికి వచ్చే భక్తులకు కనీసం క్యూలైన్లు కూడా సరిగ్గా లేని పరిస్థితులలో ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ ఆలయ అధికారులతో సంప్రదింపులు చేసి దేవస్థానంలో వసతుల కల్పన కోసం తన వంతు కృషి చేశారు. పాలకులు, అధికారుల సహకారంతో ఆయన తనకు ఉన్న పరిచయాలతో విరాళాలను సేకరించి అనేక నిర్మాణాలను ఆలయ పరిసరాల్లో చేపట్టేలా చొరవ తీసుకున్నారు. ఈ క్రతువులో ఆదిత్యుని భక్తులు కూడా విరివిగా పాల్గొన్నారు. తమకి తోచిన విధంగా దేవస్థానానికి విరాళాలను అందజేసారు.
ఆలయ పరిసరాలలో రేకుల షెడ్లు, క్యూలైన్ల కోసం బారికేడ్లను లక్షలకు లక్షల రూపాయలను అందించారు. అలాగే వసతిగృహాలు, అన్నదాన సత్రం, కళా వేదిక వంటి వాటిని నిర్మించారు. భక్తుల కోసం ఈ పనులన్నింటిని కూడా పూర్తి చేసారు. అలాగే ఆదిత్యుని అలంకరణ కోసం బంగారు మకరతోరణం చేయించేందుకు అనేక మంది దాతలు విరాళాలను అందించారు. ఆదిత్యుని భక్తులైన మండవిల్లి రవి, పెద్దిన కాళీ తదితరులు వారికి పరిచయం ఉన్న వ్యాపారులు, ప్రముఖులను సంప్రదించి ఆలయ అభివృద్ధి కోసం,మకరతోరణం తయారీ ఇతరత్ర పనుల కోసం విరాళాలను సేకరించి ఆలయానికి అందజేశారు.
ఇదికాకుండా శ్రీ సూర్యనారాయణ స్వామిపై నమ్మకం, విశ్వాసం ఉన్న భక్తులు నేరుగా దేవస్థానం అధికారులను సంప్రదించి విరాళాలను నగదు రూపంలో వస్తు రూపంలో అందజేసారు. ఆదిత్యుని ఆలయం ఆ మాత్రం అభివృద్ధి చెందిందంటే దాతల విరాళాల వల్లనే లేదంటే స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి. అరసవల్లి అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలకి ప్రతి ఏడాది రథసప్తమి ఉత్సవాల సందర్భంగా ఆదిత్యుని నిజరూపం దర్శించుకునేందుకు డోనర్ పాస్ లను అందజేశారు.
రాష్ట్ర పండుగగా రథసప్తమి ఉత్సవాలు
ఈ ఏడాది రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నారు. కొన్నేళ్ళ క్రితం వరకూ ఆలయానికి రూ 50 వేల నగదు ఇచ్చే వారికి వాటిని అందజేసేవారు. తర్వాత ఆ మొత్తాన్ని రూ 1లక్షకి పెంచారు. అధికారులు నిర్ణయించిన మేరకు ఆలయ అభివృద్ధి కోసం, అన్నప్రసాద వితరణ కోసం శాస్వత అన్నదాన కార్యక్రమం క్రింద నగదును విరాళాలుగా అనేక మంది అందజేసారు. శ్రీకాకుళం నగరానికి చెందిన వారితో పాటు దేశంలోని వివిద ప్రాంతాలకి చెందినవారు కూడా ఆ జాబితాలో ఉన్నారు. అరసవల్లి ఆలయానికి డోనేషన్ ఇచ్చే భక్తుల సంఖ్య సుమారు 1150మంది వరకూ ఉంది. వారికి ప్రతి ఏడాది కూడా డోనర్ పాస్ లను అందజేసారు. దాతలుగాని వారి సంబంధీకులుగాని వాటిని ఆలయ అధికారుల వద్ద నుంచి తీసుకుని రథసప్తమి రోజున దర్శనాలకు వస్తుంటారు.
ఒక్కోసారి ఉత్సవాల సమయంలో దాతలను పట్టించుకునే నాధుడే కరువవుతుంటారు. సాదారణ భక్తులకు అయినట్లుగా కూడా వారికి దర్శన ఏర్పాట్లు చేయరు. వారి లైన్లలోకి ఎవరెవ్వరో వచ్చేస్తుంటారు. తోపులాటలు చోటు చేసుకునే సందర్భాలు కూడా నెలకొంటూ ఉంటాయి. అయినా కూడా స్వామి వారి దర్శన భాగ్యం లభిస్తే చాలని ఏడాదికి ఒక సారి దాతలు వస్తుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరసవల్లి అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఎన్నాళ్ళ నుంచో శ్రీకాకుళం ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ఏడాది రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ ఎదురుగా పరిసర ప్రాంతాలలో దాతల విరాళాలలో చేపట్టిన నిర్మాణాలను ఆకస్మికంగా కూల్చివేసారు. అభివృద్ధి పేరుతో ఉన్న నిర్మాణాలను ముందుగానే నేలమట్టం చేసారు. ఇదికాకుండా దాతలకు డోనర్ పాస్ లు జారీ చేసేందుకు కూడా ఈ సంవత్సరం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రూల్ పెట్టారు. దాతలు డోనేషన్ ఇచ్చినప్పుడు దేవస్థానం జారీ చేసిన రిసిప్ట్ తో పాటు ఆధార్ కార్డును ఆలయానికి తీసుకువచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే డోనర్ పాస్ లు జారీ చేయనున్నారు.
అరసవల్లికి విరాళాలు ఇచ్చిన దాతలు ఎక్కడెక్కడో ఉన్నారు. వారు ఆలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కష్టమే. రిజిస్ట్రేషన్ కోసం ఒక సారి దర్శనం కోసం మరోసారి ఆలయానికి వచ్చే పరిస్థితి ఉండదు. ఈ నెల 20వ తేదిలోగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆలయ అధికారులు ప్రకటించడంతో ఇప్పటి వరకూ 250 మంది వరకే అధికారుల వద్ద నమోదు చేసుకున్నారు. కొంతమంది వద్ద విరాళం అందజేసిన రసీదులు లేవు. రికార్డులలో వారి పేర్లు దాతలుగా నమోదై ఉన్నాయి. వారు నెంబర్ చెబితే పాస్ లు గతంలో ఇచ్చే వారు ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని వారు గగ్గోలు పెడుతున్నారు. విరాళాలు సేకరణలో కీలక పాత్ర పోషించిన వారు తర్జనభర్జనలు పడుతున్నారు. రథసప్తమి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏడాది లోటుపాట్లు కనిపిస్తునే ఉంటున్నాయి. వాటిని సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని ఏ ఏడాదికాఏడాది సమీక్షలు నిర్వహించినా షరామాములుగానే భక్తులకు చుక్కలు కనిపిస్తుంటున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర పండుగగా ప్రకటించిన వేళ ప్రజాప్రతినిధులు, అధికారులు వరుస సమీక్షలు నిర్వహిస్తూ హడావుడి చేసేస్తున్నారు. కూల్చివేతలు, బ్యూటిఫికేషన్ పనులు నిర్వహిస్తున్నారు. ఆలయంపై రాజకీయ పెత్తనం కూడా పెరిగిపోయింది. ఈ అత్యుత్సాహం ఎటుదారి తీస్తుందోనన్న ఆందోళన స్థానికులలో నెలకొంది. దాతలు ఇచ్చిన విరాళాలు నేలపాలైన నేపధ్యంలో భవిష్యత్ లో విరాళాలు ఇచ్చేందుకు భక్తులు ముందుకు రాని పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.