Trump Sworn In As 47th President Of US: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు స్వీకరించారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిథుల సమక్షంలో వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్‌లోని రోటుండా ఇండోర్‌లో భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:30 గంటలకు రెండోసారి ఆయన అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్ కంటే ముందుగా అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ (JD Vans) బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వేదిక వద్దకు ట్రంప్, జేడీ వాన్స్, జో బైడెన్, కమలా హారిస్ చేరుకున్నారు. ఈ వేడుకకు భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దంపతులు, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్ బర్గ్, టిమ్ కుక్, సుందర్ పిచాయ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచ దేశాలకు చెందిన పలువురు అగ్రనేతలు, పారిశ్రామిక టెక్ దిగ్గజాలు, అతిరథ మహారథులు ఈ కార్యయక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించేందుకు యూఎస్ క్యాపిటల్ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.
గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు. ఆయనతో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. 1861లో అబ్రహాం లింకన్ ప్రమాణ స్వీకారం చేయించడానికి ఉపయోగించిన బైబిల్, తన బైబిల్‌ను చేతిలో పట్టుకొని ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
కాగా, ప్రమాణ స్వీకారానికి ముందు జో బైడెన్‌ను కలిసేందుకు ట్రంప్ శ్వేత సౌధానికి వెళ్లగా.. ఆయనకు బైడెన్ దంపతులు సాదర స్వాగతం పలికారు. అనంతరం క్యాపిటల్ హిల్‌లోని రోటుండా ఇండోర్‌లో జరిగే కార్యక్రమానికి బైడెన్, ట్రంప్ ఒకే వాహనంలో వెళ్లారు. ప్రపంచంలోని టెక్ దిగ్గజాలు, పారిశ్రామిక వేత్తలు సహా అమెరికా సుప్రీంకోర్టుకు చెందిన 9 మంది జడ్జిలు ఈ వేడుకకు హాజరయ్యారు.
'అమెరికా ఫస్ట్' నినాదంతో..
అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం అనంతరం ట్రంప్ తన తొలి ప్రసంగం చేశారు. 'అమెరికా ఫస్ట్' నినాదంతో ముందుకు వెళ్తామని చెప్పారు. అమెరికా అనేక ఆటుపోట్లను, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడిందని.. దేశ సరిహద్దుల రక్షణ తమకు చాలా కీలకమని అన్నారు. 'శాంతి భద్రతల విషయంలో మరింత కఠినంగా ఉండాలి. అమెరికా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి. అమెరికా పేరు నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకురావాలి. అమెరికాలో స్వర్ణయుగం ప్రారంభమైంది.' అని ట్రంప్ పేర్కొన్నారు.