Joe Biden Last Minutes Pardens Shiled Trump Critics: అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు జో బైడెన్ (Joe Biden), కమల హారిస్ (Kamala Haris) వీడ్కోలు చెప్పారు. అమెరికా ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కినందుకు ఎంతో గౌరవంగా ఉందని ఈ మేరకు వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో వైట్ హౌస్‌కు వచ్చిన కాబోయే అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump), ఆయన సతీమణి మెలానియాకు.. బైడెన్ దంపతులు ఘన స్వాగతం పలికారు. అందరూ కలిసి టీ పార్టీలో పాల్గొన్నారు. కాగా, అధ్యక్ష పీఠం దిగే ముందు చివరి నిమిషాల్లో బైడెన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ట్రంప్‌ను విమర్శించిన అమెరికా వైద్య నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లె తదితరులకు ముందస్తు క్షమాభిక్ష (Preemptive Pardons) ప్రసాదించారు. వీరితో పాటు క్యాపిటల్ హిల్ దాడులపై విచారణ జరిపిన హౌస్ కమిటీ సభ్యులకు సైతం ఉపశమనం కలిగించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రతీకార చర్యలు తీసుకునేందుకు వీలు లేకుండా చర్యలు చేపట్టినట్లు బైడెన్ వెల్లడించారు.
కోలాహలంగా యూఎస్ క్యాపిటల్
మరోవైపు, అమెరికా 47వ అధ్యక్షుడిగా భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:30 గంటలకు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్‌లోని రోటుండా ఇండోర్‌లో ఈ వేడుక సాగనుంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం వేళ యూఎస్ క్యాపిటల్ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఈ చరిత్రాత్మక సన్నివేశాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులతో పాటు భారీగా ప్రజలు తరలివచ్చారు. కాగా, ట్రంప్ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిరోజే సుమారు 100కు పైగా కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసేలా ఆయన బృందం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.