Donald Trump Inauguration: రిపబ్లిక్ పార్టీ నేత డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మునుపెన్నడూ లేనంతగా, చరిత్రలో నిలిచిపోయేలా హై లెవల్ సెలబ్రేషన్స్‌ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఈవెంట్‌కు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అమెరికాలో మూడు రోజుల పాటు సాగనున్న ఈ వేడుకల్లో అనేక మంది ప్రముఖులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారు. అందులో భాగంగా 2005లో అమెరికన్ ఐడల్ గెలిచి, కెరీర్ ప్రారంభించిన కేరీ అండర్‌వుడ్.. ట్రంప్ ప్రమాణానికి ముందు ప్రదర్శన ఇవ్వనున్నారని ఈవెంట్ నిర్వాహకుల కమిటీ తెలిపింది. ఈ వేడుక ముగింపులో ఒపెరా సింగర్ క్రిస్టోఫర్ మచియో జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. సింగర్-గేయ రచయిత లీ గ్రీన్‌వుడ్, యూనివర్శిటీ ఆఫ్ నెబ్రాస్కా-లింకన్, యునైటెడ్ స్టేట్స్ మెరైన్ బ్యాండ్‌కు చెందిన గాయకులు కూడా ఈ కార్యక్రమంలో పలు పర్ఫార్మెన్స్‌లతో భాగం కానున్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదవీ కాలం జనవరి 20, 2025తో ముగుస్తుందని అక్కడి రాజ్యాంగంలోని 20వ సవరణ చెబుతోంది. దీని ప్రకారం వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనం లోపల రోటుండాలో ట్రంప్ సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేస్తారు. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్డ్స్ ట్రంప్ తో ప్రమాణం చేయించనున్నారు. ఈ సందర్భంగా రోటుండా సముదాయం లోపల పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మిలిటరీ రెజిమెంట్లు, స్కూల్ బ్యాండ్స్ ప్రదర్శన తో పాటు అమెరికన్ మ్యూజికల్ ఐకాన్ కేరీ అండర్ వుడ్ సంగీత కచేరీ చేయనున్నారు. "అమెరికా ది బ్యూటిఫుల్" ను ఆలపించనున్నారు. ట్రంప్ ప్రసంగం తర్వాత ఈ పర్ఫార్మెన్స్ ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే వేడుకల్లో జాసన్ ఆల్డియన్, రాస్కల్ ఫ్లాట్స్, పార్కర్ మెక్‌కొల్లమ్, గవిన్ డెగ్రా ప్రదర్శనలు ఉంటాయి. ఇది వేడుకకు హాజరైన అతిథులకు ఉత్సాహాన్ని, ఆనందమైన సాయంత్రాన్ని అందించనుంది. ఆ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించనున్నారు. ఇకపోతే ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలను అమెరికా సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వీటికి సెనెటర్ అమీ క్లోబుచర్ సారథ్యం వహిస్తున్నారు.
అట్టహాసంగా మ్యూజికల్ నైట్
దాదాపుగా అయిదు దశాబ్దాలుగా అమెరికన్లను ఉర్రూతలూగిస్తూ వస్తోన్న 1970ల నాటి క్లాసిక్ డిస్కో సాంగ్ వైఎఎంసీఏ (YMCA) పాటకు ట్రంప్ స్టెప్పులేశారు. ఆదివారం రాత్రి కాపిటల్ వన్ అరీనాలో జరిగిన ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ ర్యాలీ.. డిస్కో గ్రూప్, విలేజ్ పీపుల్ పాట ప్రదర్శనతో ముగిసింది. ఈ ఈవెంట్ లో కాబోయే అధ్యక్షుడితో కలిసి డ్యాన్స్ చేయడమే కాకుండా, బ్యాండ్‌లోని పలువురు సభ్యులు కూడా ఆయనకు కరచాలనం చేశారు.
Also Read : Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్