Sankranthi Bhogi Kunda Muggu : ప్రతి పండుగకు పిండివంటలు ప్రత్యేకమే అయినా సంక్రాంతికి చేసే పిండివంటలు మరింత ప్రత్యేకం. నువ్వులు, కొత్త బెల్లం, చెరకు, రేగుపళ్ళు, కొత్త బియ్యం ( ప్రాంతాన్ని బట్టి కొన్ని రకాల వంటలు మారుతాయి)తో వంటకాలు చేస్తారు. వీటితో పాటూ వారి వారి ఆర్థికస్థితిని బట్టి భక్ష్యాలు, గారెలు, బూరెలు, కుడుములు, పులిహోర, పాయసం ఊరంతా ఘుమఘుమలే. అన్ని పండుగల్లో సంప్రదాయ వంటలు ఉన్నప్పటికీ సంక్రాంతికి రోజు కొత్త కుండలో పొంగలి ప్రత్యేకం. అందులో పొంగలి అంటే కేవలం స్వీట్ కాదు..ఇల్లంతా సంతోషాన్ని పంచి, శుభం కలిగించే కమ్మని కుండ.
భోగి 'కుండ' ఎందుకు!
సంక్రాంతి పండుగ సమయానికి పంట చేతికొచ్చి ధాన్యలక్ష్మి నిండుగా ఇంటికి చేరుతుంది. చెరకు కూడా విరివిగా కాస్తుంది. రేగుచెట్లు పళ్లతో కళకళలాడతాయి. చెరకు పంట ఫ్యాక్టరీలకు చేరి బట్టిల్లో బెల్లం తయారవుతుంది. ఈ రోజు కొత్త కుండలో ఆవుపాలు, కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి, చెరుకును ఉంచి పాలు పొంగిస్తే ఏడాదంతా ఆ ఇంట్లో సిరులు, ఆనందం పొంగిపొర్లుతుందని నమ్ముతారు.
Also Read: సంక్రాంతికి మీరు పాటించాల్సిన 5 విషయాలు!
ఇదే అసలైన నూతన సంవత్సరం
తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాదితో మొదలైనప్పటికీ...పంట ఇంటికి చేరి రైతుల కళ్లలో ఆనందాన్ని నింపే పండుగ మాత్రం సంక్రాంతి. ఆర్థికంగా కూడా ఆశాజనకంగా ఉండే సమయం. చలిగాలులు తగ్గి సూర్యుడి కిరణాల్లో వేడి పెరిగే కాలం .. అందుకే సంక్రాంతి అంతులేని సంబరాన్ని మోసుకొస్తుంది. అందుకే ప్రతిలోగిలిలో పొంగే కుండ ముగ్గు వేస్తారు. ఇంట్లో పాలు పొంగిస్తారు.
సంబరమంతా ముగ్గులోనే
ఆడపిల్లల సంబరమంతా ఇంటి ముంగిట్లో ముగ్గులోనే కనబడుతుంది. ఎంతో సృజనాత్మకతను వెలికి తీసే పండుగగా చెప్పుకునే సంక్రాంతి వేళ ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులతో సంక్రాంతి లక్ష్మికి స్వచ్ఛంగా ఆహ్వానం పలుకుతారు. ముగ్గు మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు వాటి మీద గుమ్మడి పూలు, బంతిపూలు, చామంతి పూలతో అలంకరిస్తారు. గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ దుస్తుల్లో ఆడపిల్లల ఆటపాటలు కన్నులపండువగా ఉంటాయి.
Also Read: ఈ రాశులవారిపై దేవగురువు అనుగ్రహం, అప్పులుండవ్ ఇక ఆదాయమే!
కుండలు పంచుకునే సంప్రదాయం
కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి పండుగలో కుండలు పంచుకునే సంప్రదాయం కూడా పాటిస్తారు. ఆ కుండలో పొట్లకాయ, చెరకు, నువ్వులు, బెల్లం, శనగపప్పు, పసుపు, కుంకుమ నింపి గిన్నె రూపంలో బహుమతిగా ఇస్తారు. మకర సంక్రాంతి నుంచి రథ సప్తమి వరకు ఇంటింటికి వెళ్ళి, పెద్దలు, ముత్తైదువులను పిలిచి పసుపు, కుంకుమలతో తాంబూలాన్ని ఇచ్చే ఆచారం కూడా ఉంది. పండుక వేళ ఇంటికి వచ్చిన ముత్తైదువుల పాదాలకు పసుపు రాసి నుదిటిన బొట్టుపెట్టి తాంబూలం ఇచ్చి పంపించాలని చెబుతారు. ఆనందాల సిరులు కురిపించే పొంగలి కుండ ఇంటి ముందు వేయడం ద్వారా ఆ ఇంట సిరులు పొంగుతాయని, ఇల్లంతా ఆనందాలు వెల్లివిరుస్తాయని విశ్వాసం.
Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!
మట్టికుండలో పెరుగు నింపి దానం ఇస్తారు
సంక్రాంతి రోజు కొన్ని ప్రాంతాల్లో... బ్రహ్మణులని ఆహ్వానించి ఇంటిలో ఆసనం వేసి కాళ్లుకడిగి నువ్వులతో నిండిన కంచుపాత్రలను దానం చేస్తారు . ఈ పాత్రకు తిలా పాత్ర అని పేరు. వీలైతే రాగి పాత్రలు, ఇత్తడి కుందులు, గొడుగులు ఇవ్వవచ్చు. ఈ మకర సంక్రాంతి రోజు మట్టి కుండలలో పెరుగును నింపి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి, దీని వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారు దానం చేస్తే ఆ సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారని నమ్మకం. నందుని భార్య యశోద పెరుగు దానం చేసినందువలనే శ్రీ కృష్ణుడు కొడుకుగా లభించాడు. ద్రోణాచార్యుని భార్య కృపి దుర్వాసమహామునికి ఈ విధంగా కుండలో నింపిన పెరుగును దానం చేసినందువల్ల ఆమెకు అశ్వత్థాముడు జన్మించాడని చెబుతారు.
Also Read: ధనస్సులోకి శుక్రుడు, 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి!