Makar Sankranti 2024: నెలరోజులకో రాశిలో సంచరించే సూర్యుడు... ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి అడుగుపెట్టినప్పుడు జరుపుకునే పండుగే మకర సంక్రాంతి. మకర రాశికి అధిపతి శని...శని ఎవరో కాదు సాక్షాత్తూ ఆ సూర్య భగవానుడి కుమారుడు. అందుకే సంక్రాంతి రోజు కొన్ని నియమాలు పాటించడం ద్వారా జాతకంలో శని ప్రభావం తగ్గుతుందంటారు..


శని ప్రభావం మసకబారే సమయం


సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు తన దిశ మార్చుకున్నప్పుడు తన కుమారుడైన శనితో కలసి దాదాపు నెలరోజులు ఉంటాడని పండితులు చెబుతారు. ఆ నెల రోజులు సూర్యుడి తేజస్సు మందు శని తేజస్సు మసకబారుతుంది..అంటే శని ప్రభావం తగ్గుతుంది. 


 Also Read: మకర సంక్రాంతి ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగులు నింపుతోంది, జనవరి 15 రాశిఫలాలు


నువ్వులు ప్రత్యేకం


పురాణాల్లో చెప్పిన విషయాల ప్రకారం సంక్రాంతి రోజున తన ఇంటికి వచ్చిన తండ్రి సూర్య భగవానుడికి శని..తనకు ఇష్టమైన నల్ల నువ్వులతో స్వాగతం పలుకుతాడు. సంతోషించిన సూర్యుడు..ఈ రోజు ఎవరైతే తనకు నల్ల నువ్వులు సమర్పిస్తారో వారికి శని బాధలు తొలగి, సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో వర్థిల్లుతారని చెప్పాడట. అందుకే ఏటా మరక సంక్రాంతి రోజు సూర్యుడి పూజలో నల్ల నువ్వులు ఉపయోగిస్తారని చెబుతారు. సూర్యుడికి, శనికి ప్రీతికరమైన నల్లనువ్వులను సంక్రాంతి రోజు ధారపోసినా, దానమిచ్చినా శని బాధల నుంచి ఉపశమనం లభించి వారి జీవితంలో వెలుగులు ప్రసరిస్తాయని చెబుతారు.


దానం - పూజ


మకర సంక్రాంతి రోజు చేసే దానం, పూజకు రెట్టింపు ఫలితం ఉంటుందని చెబుతారు. అందుకే సంక్రాంతి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి నల్లనువ్వులు కలిపిన నీటిని సూర్యుడికి సమర్పించాలి. ఆ తర్వాత శనిని తలుచుకుని నువ్వులు సమర్పించాలి. పూజ పూర్తైన తర్వాత  ఆవనూనె, నల్ల నువ్వులు, నువ్వుల లడ్డూ.. ఎవరికైనా దానం ఇచ్చినా శని బాధలనుంచి విముక్తి లభిస్తుంది.


Also Read: సూర్యుడు మకర రాశిలోకి మారినప్పుడే ఎందుకు ప్రత్యేకం, సంక్రాంతి పెద్దపండుగ ఎలా అయింది!


శని అంటే ఏంటి..ఒకటి నుంచి 12 వరకూ ఏ స్థానాల్లో సంచరిస్తే శనిదోషం ఉన్నట్టు...


శని... 12,1,2 స్థానాల్లో సంచారిస్తే ఏలినాటి శని అంటారు. జన్మరాశికి 4,8,10 స్థానాల్లో శని సంచరిస్తున్న శనిని అర్ధాష్టమ, అష్టమ, దశమ శని సంచారం అంటారు. ఇవి కూడా దోషమే.


ఏలినాటి శని


శని 12వ స్థానంలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, మందులు వాడకం, తరచూ ప్రయాణాలు ఉంటాయి. జన్మరాశిలో అంటే శని ఒకటో స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, నీలపనిందలు, భాగస్వాములతో వివాదాలు, మనశ్సాంతి ఉండకపోవడం, ధనవ్యయం, రుణబాధలు,వృత్తి-ఉద్యోగం-వ్యాపారంలో చికాకులు తప్పవు. శని రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు అన్ని పనులు పూర్తవుతున్నట్టే అనిపిస్తాయి కానీ ఏదీ పూర్తికాదు. అంటే ఆశకల్పించి నిరాశపరుస్తాడు. ఇంకా అప్పుల బాధలు, అనారోగ్యం, మానసిక ఆందోళన ఉంటుంది. 


Also Read: సంక్రాంతికి అందరూ ఊరెళ్లిపోవాలి అనుకుంటారెందుకు!


అర్ధాష్టమ శని


జన్మరాశి నుంచి నాలగవ రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు. ఈ సమయంలో రాజకీయ, వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబసమస్యలు, అశాంతి, ఆకస్మిక బదిలీలు. వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి.స్ధాన చలనం,స్ధిరాస్తి సమస్యలు,వాహన ప్రమాదాలు,తల్లికి అనారోగ్యం ఉంటుంది.


అష్టమ శని


జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు. ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, అశాంతి, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.శత్రు బాధలు,ఊహించని నష్టాలు వస్తాయి.


దశమ శని


జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు. దీనివల్ల కోర్టు కేసులు, సాంఘిక, రాజకీయంగా అపవాదులు, అధికారులతో విభేదాలు, ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి.


Also Read: మకర సంక్రాంతి శుభాకాంక్షలు - మీ బంధుమిత్రులకు చెప్పేయండిలా!


ఈ దోషాల నుంచి విముక్తి లభించాలంటే..సంక్రాంతి రోజు నువ్వులను సూర్యుడికి సమర్పించడం, దానం, పూజ ప్రధానం...


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం