Makar Sankranti 2024: సూర్యుడి లేలేత కిరణాలు..మెరిసే మంచుబిందువులు..కోడి కూతలు..బంతి చామంతిల కమ్మని సువాసనలు..లోగిళ్లలో రంగవల్లులు.. గొబ్బిళ్లు.. భోగిమంటలు..గంగిరెద్దులు..హరిదాసులు.. పిండివంటలు సువాసనలు.. కొన్ని ప్రాంతాల్లో కోడిపందాలు, ఎడ్ల పందాలు, పశువుల పూజలు..ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే ఉంది. ఇవన్నీ సంక్రాంతి వేళ పల్లెటూర్లలో కనిపించే దృశ్యాలు..ఇన్ని ఆనందలు కాంక్రీట్ జంగిల్లో సాధ్యమవుతాయా?...అందుకే సంబరాల సంతోషాన్ని క్షణం క్షణం రెట్టింపు చేసే పల్లెటూర్లకి పరుగులుతీస్తారంతా.
Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి!
పల్లె మారిందా!
అప్పుడెప్పుడో పూర్వకాలం పల్లెటూర్లు ఇలా ఉండేవి కానీ ఇప్పుడు అక్కడ కూడా వాతావరణం మారిపోయింది అంటారేమో...
ఏం మారింది?
పచ్చని పంట పొలాలు అలానే ఉన్నాయి
రంగుముగ్గులు, గొబ్బిళ్ల సందడి అలాగే ఉంది
ఇంటింటికి నడుస్తూ తిరిగే హరిదాసులు, గంగిరెద్దుల సందడి అలానే ఉంది
పల్లెటూర్లలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇరుగు పొరుగు పలకరింపులు అలానే ఉన్నాయి
పిండివంటలు ఇచ్చిపుచ్చుకోవడాలు కొనసాగుతూనే ఉన్నాయి..
సంప్రదాయ దుస్తులు ట్రెండ్ కి తగ్గట్టు మారి మరింత మురిపిస్తున్నాయి ( లంగాఓణీలే ఇప్పుడు లెహంగాలు)
కొత్త అల్లుళ్ల సందడి ఉండనే ఉంటుంది...
Also Read: సూర్యుడు మకర రాశిలోకి మారినప్పుడే ఎందుకు ప్రత్యేకం, సంక్రాంతి పెద్దపండుగ ఎలా అయింది!
మరి నగరాల్లో!
ఏ ఇంట్లో ఎవరున్నారో కూడా తెలియదు. పండుగ రోజులకు మామూలు రోజులకు పెద్దగా వ్యత్యాసం ఉండదు. ప్రాంతాలు, మతాలు, కులాలు అంటూ కొన్ని అడ్డుగోడలు ఇంకా ఏ మూలో మిగిలే ఉన్నాయి. రంగు ముగ్గులు , ఆన్ లైన్ లో పేడ పిడకలు, మహా అయితే రెండు మూడు ఇళ్ల సభ్యులు కలుస్తారేమే. ఇలాంటి వాతావరణంలో ఉండి ఉండి ఒక్కసారిగా పల్లెటూర్లకు, పుట్టి పెరిగిన ఊర్లకు వెళితే వచ్చే ఆనందమే వేరు. అందుకే ఎంత కష్టమైనా, ఖర్చైనా, దూరమైనా సంక్రాంతి వేళ సొంతూర్లకు పరుగుతీస్తారు. ఊరుని తలుచుకోగానే వచ్చే ఆనందం ఒకెత్తైతే..పుట్టిన ఊరి మట్టివాసన తగలగానే ఆ ఉత్సాహమే వేరు. పంటపొలాల్లో ఆటలు, చెరువుల్లో ఈతలు, స్నేహితులతో ముచ్చట్లు ఇలా ఎన్నో తీపి గుర్తులను నెమరవేసుకుని మరిన్ని జ్ఞాపకాలను పోగుచేసుకునే పండుగే సంక్రాంతి. కాంక్రీట్ జంగిల్ లో పెరుగుతున్న ఈ జనరేషన్ పిల్లలకు పల్లెటూర్ల గురించి తెలిసింది చాలా తక్కువ..అందుకే ఇలాంటి ప్రత్యేక రోజుల్లోనే వారికి ఆ ఆనందాన్ని పరిచయం చేయాలంటారు పెద్దలు.
Also Read: రాశి మారుతున్న గ్రహాల రాకుమారుడు - ఈ రాశులవారికి శుభసమయం!
అన్నదాత ఆనందంగా ఉంటే ప్రతిరోజూ పండుగే
సంక్రాంతి వచ్చేనాటికి రైతులకు పంట చేతికందుతుంది. ఈ ఆనందం పండుగకు కొత్త కళ అద్దుతుంది. అన్నదాత ఆనందంగా ఉంటే ప్రతిరోజూ పండుగే అన్న మాట కూడా వాస్తవమే కదా. దుక్కు దున్నినప్పటి నుంచీ యజమానికి సహకరించే ఎద్దులు, పండిన పంటను బస్తాలకెత్తి ఇంటికి చేర్చేప్పుడు సంబరంగా పరుగులు తీస్తాయి. తనని పూజిస్తున్న యజమానికి వరాలిచ్చాం అన్నంత ఆనందం వాటిలో ఉరకలేస్తుంది. ఆ కృతజ్ఞత తోనే కనుమ రోజు పశువులతో పని చేయించకుండా వాటిని పూజిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే..పండుగకు ఊరెళ్లేది ఎందుకంటే పల్లెలకే పరిమితమైన సంబరాన్ని చూసేందుకు.
Also Read: ఆదిత్య మంగళ రాజయోగం, ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్స్!
2024 లో సంక్రాంతి తేదీలివే
జనవరి 14 ఆదివారం భోగి
జనవరి 15 సోమవారం సంక్రాంతి
జనవరి 16 మంగళవారం కనుమ
జనవరి 17 బుధవారం ముక్కనుమ