Spiritual City Ayodhya: మన దేశంలో అత్యంత ప్రాచీనమైన ఏడు క్షేత్రాలున్నాయి. వీటినే  సప్త మోక్షదాయక క్షేత్రాలని పిలుస్తారు. 


అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ।
పురీ ద్వారావతీ చైవ సప్తైతే మోక్ష దాయకాః ।।


ఈ ఏడు క్షేత్రాలను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని చెబుతారు. పాండవులు కూడా మహాభారత యుద్ధం తర్వాత బ్రహ్మణ, గురువు, బంధు పరివారం హత్యదోష నివారణార్థం ఏడు పుణ్యక్షేత్రాలను సందర్శించాకే స్వర్గానికి ప్రయాణమయ్యారని చెబుతారు. ఈ ఏడు క్షేత్రాల్లో  వైష్ణవ, శైవ క్షేత్రాలు రెండూ ఉన్నాయి.  వీటిని జీవితకాలంలో ఒక్కసారి దర్శించుకున్నా సకల పాపాలు నశించి స్వర్గానికి వెళతారని భక్తుల విశ్వాసం. ఈ ఏడు నగరాల్లో మొదటిది రామజన్మభూమి అయోధ్య...


Also Read: అయోధ్య 'రామయ్య' విగ్రహం ఇదే - 'రామ్ లల్లా'ను చెక్కిన శిల్పి ఎవరో తెలుసా.?


భగవంతుడు నిర్మించిన నగరం
మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం అయోధ్య. ఉత్తర ప్రదేశ్ ఫైజాబాద్ జిల్లాలో  ఉన్న ఈ క్షేత్రానికి రామజన్మ భూమి అని ప్రసిద్ధి. స్కంధ పురాణంలో అయోధ్యను ఏడు పవిత్ర నగరాల్లో ఒకటిగా పేర్కొన్నారు. అధర్వణ వేదంలో కూడా అయోధ్యను సాక్షాత్తు ఆ భగవంతుడు నిర్మించిన నగరంగా పేర్కొన్నారు. దేవుడు నిర్మించిన నగరం కాబట్టి ధార్మికంగా ఈ నగరం అత్యంత ప్రాధాన్యత కలిగిఉందని  భక్తుల విశ్వాసం. 


Also Read: రాశి మారుతున్న గ్రహాల రాకుమారుడు - ఈ రాశులవారికి శుభసమయం!


మహోన్నత విలువల పుట్టినిల్లు 


అయోధ్య కేవలం హిందువుల పుణ్యక్షేత్రం అనుకుంటే భౌగోళిక సత్యాన్ని తెలుసుకోవడం మాత్రమే అవుతుంది. వాస్తవానికి అయోధ్య అంటే భారతీయ ఆత్మకు ఆనవాలు. యుగయుగాలుగా భారతీయులను నడిపిస్తున్న మహోన్నత విలువల పుట్టిల్లు. మానవ సంబంధాలకి,  కుటుంబ జీవనానికి, గురుశిష్య బంధానికి, భార్యాభర్తల అనురాగానికి స్ఫూర్తి కేంద్రం. రాజ్యానికీ, ప్రభుత్వానికీ, నడవడికకీ, ధర్మనిరతికీ నిర్వచనం. అయోధ్య అంటే  వేల ఏళ్లుగా ఆధ్యాత్మిక వెలుగులు పంచుతున్న రామాయణ మహాకావ్యానికి మూలం అయిన దివ్యక్షేత్రం. గిరిపుత్రి శబరినీ, పడవ నడిపే గుహుడినీ, పక్షి అయినప్పటీ ధర్మంవైపు నిలబడిన జటాయువుని సమానంగా చూసిన శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం.


Also Read: ఆత్మలు మాత్రమే ప్రవేశించే ఆలయం - పొరపాటున కూడా ఎవ్వరూ లోపల అడుగుపెట్టరు!


అయోధ్య అంటే


అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్ధం. గౌతమబుద్ధుని కాలంలో ఈ నగరం పాళీ భాష లో అయోజిహాగా పేర్కొన్నారు. అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్ధాన్నిస్తుంది. జైన ఆధ్యాతిక కేంద్రంగానూ అయోధ్య విలసిల్లింది. జైనమతానికి ఆద్యుడు రిషబదేవుడు ఇక్కడే పుట్టాడంటుంది చరిత్ర. మహావీరుడు, గౌతమబుద్ధుడు ఈ నగరం వచ్చి వెళ్లారనీ చెబుతోంది. 


Also Read: త్రిగ్రాహి యోగం, ఈ 4 రాశులవారికి ధనలాభం - ఉద్యోగంలో ప్రమోషన్!


అయోధ్య అసలు పేరు


రామాయణ కాలం కన్నా ముందే సాకేత పురం అనే పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ధర్మశాస్త్ర కర్త మనువు అయోధ్యను నిర్మించాడంటారు. మనువు కుమారుడే ఇక్ష్వాకు. వీరిది సూర్యవంశం. ఆ వంశీకుడు ఆయుధ్‌ను కూడా అయోధ్య నిర్మాతగా పురాణాలు ప్రస్తావించాయి.  ఇక్ష్వాక పాలకుల రాజధాని. ఈ వంశంలో 31వ రాజు హరిశ్చంద్రుడు. సాగరం అనే పేరుకు మూలమైన సగరుడు, రఘు మహారాజు కూడా ఆ వంశీకులే. రఘుమహారాజు.. ఈయన మనవడు, కోసలను పాలించిన 63వ చక్రవర్తి దశరథుడు. ఆయన కుమారుడు శ్రీరామచంద్రుడు. 


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం