Stories Behind The Makar Sankranti: నాలుగు రోజుల పండుగైన సంక్రాంతి వెనుక 5 కథలను ప్రత్యేకంగా చెబుతారు. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ, నాలుగో రోజు ముక్కనుమ....ఈ నాలుగు రోజుల పాటూ పాటించే ప్రతి సంప్రదాయం వెనుక ఓ కథ ఉంది. అవేంటో తెలుసుకుందాం...


గంగమ్మ నేలకు దిగిన రోజు


పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ వారి ఆత్మశాంతించదని తెసుకుని ఆ వంశంలో వారంతా గంగను ప్రార్థిస్తారు కానీ  తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీదకు వచ్చిందని చెబుతారు.


Also Read: సంక్రాంతికి ముగ్గులో 'సిరులు పొంగే కుండ' తప్పనిసరిగా వేస్తారెందుకు!


గంగిరెద్దుల సంప్రదాయం ఎలా మొదలైంది!


సంక్రాంతి పండగొస్తే వాడవాడలా గంగిరెద్దులు కనిపిస్తాయి. అసలీ సంప్రదాయం ఎలా మొదలైందంటే.. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడి కోసం తపస్సు చేసి పరమేశ్వరుడిని తన ఉదరంలో ఉండేలా వరం కోరుకుంటాడు. ఇచ్చిన వరం మేరకు శివుడు గజాసురుడి ఉదరంలో ఉండిపోయాడు. అప్పుడు శివుడిని బయటకు రప్పంచేందుకు ఉపాయం ఆలోచించిన దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో వాయిద్యాన్ని పట్టుకుని, నందికితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకోమని అడిగాడు. తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగాడు శ్రీ మహావిష్ణువు. అలా ఆనాడు శివుడిని తిరిగి కైలాశానికి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నమే..ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు. ఈ కథను వినాయకచవితి సందర్భంగా కూడా చెప్పుకుంటాం...


Also Read: సంక్రాంతికి మీరు పాటించాల్సిన 5 విషయాలు!


హరిదాసుని ఎవరనుకుంటున్నారు!


సంక్రాంతి సందర్భంగా ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో  ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తై ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. 


పశువులను పూజించడం వెనుక!


కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ చెబుతారు. ఓ సారి శివుడు నందిని పిలిచి ‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి తలకు స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’ అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పాడు. కోపం వచ్చిన శివుడు. ‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’ అన్నాడు. అప్పటి నుంచి ఎద్దులు, వ్యవసాయంలో సాయపడుతున్నాయట. స్వయంగా నందీశ్వరుడే భువికి దిగొచ్చి ఆహారాన్ని అందిస్తున్నాడన్న నమ్మకంతో పశువులను నందీశ్వరుడిగా భావించి కనుమ రోజు పూజిస్తారు.


Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!


దేవతలకు స్వాగతం పలికే పతంగులు


తెలంగాణలో సంక్రాంతి అంటే పతంగుల పండుగులు చాలా ప్రధానం. దీని వెనుక కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. అంటే దేవతలకు ఇది పగటి కాలం. ఈ సమయంలో దేవతలంతా ఆకాశంలో విహరిస్తారట. వారికి స్వాగతం పలికేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.


ఇంకా చెప్పుకుంటే గొబ్బెమ్మల నుంచి భోగిపళ్లు, బొమ్మల కొలువు వరకూ సంక్రాంతి సందర్భంగా పాటించే ప్రతి ఆచారానికి, సంప్రదాయం వెనుకా ఓ కథ ప్రచారంలో ఉంది...


Also Read: ఆ రోజే బిడ్డను కంటాం - రామచంద్రా దీనిని భక్తి అంటారా!