Ayodhaya Ram Mandir Opening


పుట్టుక - చావు మన చేతిలో ఉన్నాయా? ఉన్నాయని అనుకుంటున్నామా?


దేవుడిని విశ్వశించేవారంతా..మన పుట్టుక చావుకు కూడా దైవనిర్ణయమే అని అనుకోవాలి కదా...!


మరి ఏంటిదంతా..ముహూర్తం పెట్టుకుని పిల్లలను కంటే వారి రాతలు మారిపోతాయా? 


అయోధ్యలో రామయ్య కొలువుతీరే సమయంలోనే బిడ్డకు జన్మనివ్వాలన్న కొందరు గర్భిణుల ఆలోచనలను ఏమనుకోవాలి..


ఇప్పటికే నెలలు నిండినవారు ప్రసవాన్ని వాయిదా వేసుకుంటుంటే.. తొమ్మిదినెలలు పూర్తిగా నిండకపోయినా ఆపరేషన్లు చేయించుకునేందుకు మరికొందరు పోటీపడుతున్నారంటే దీన్ని భక్తి అనే  అనుకోవాలా..!


రాముడి విగ్రహ ప్రతిష్టాపన సమయంలో జన్మించే పిల్లలు అందరకీ రాముడి జాతకమే వచ్చేస్తుందా?


జనవరి 22న శ్రీరాముడి నక్షత్రం అయిన 'పునర్వసు' ఉందా అంటే అదీ లేదు..ఆ రోజు మృగశిర 


శ్రీ రామచంద్రుడి జన్మతిథి అయిన 'నవమి' కలిసొచ్చిందా అంటే...లేదు..ఆ రోజు ద్వాదశి 


జనవరి 22 తిథి,వార, నక్షత్రాలు ఇవే ( ప్రాంతం మారితే ఈ టైమ్ లో రెండు మూడు నిముషాలు వ్యత్యాసం ఉంటుంది)



  • జనవరి 22 - సోమవారం

  • తిథి - ద్వాదశి సోమవారం రాత్రి 8.46 వరకు

  • నక్షత్రం - మృగశిర తెల్లవారు జామున 5.50 వరకు..తదుపరి ఆరుద్ర

  • అమృత ఘడియలు- రాత్రి  8.53 నుంచి 10.30

  • వర్జ్యం - ఉదయం 11.07 నుంచి 12.44 వరకు

  • దుర్మహూర్తం - మధ్యాహ్నం 12.34 నుంచి 1.18 వరకు తిరిగి మధ్యాహ్నం 2.47 నుంచి 3.32


Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి! 


బిడ్డకు ఆ రోజే జన్మనివ్వాలనే ఆరాటం


అయోధ్యలో జనవరి 22 వ తేదీన మధ్యాహ్నం శ్రీరామచంద్రుడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ అద్భుత క్షణాల కోసం యావత్ భారత దేశం ఎదురు చూస్తోంది. రాయి, రప్ప, ఇసుక, సున్నం, ఇటుక మొదలు గర్భగుడిలో కొలువుతీరే విగ్రహం వరకూ ప్రతీదీ అద్భుతమే అంటూ పరవశించిపోతున్నారు. అయితే ఇదే సమయాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు ఉత్తరప్రదేశ్ లోని గర్భిణిలు కొందరు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సం రోజే తాము ప్రసవించాలని భావిస్తున్నారు. ఆ రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్స్ కి వెళ్లి తమకు  జనవరి 22వ తేదీనే ఆపరేషన్లు చేసి బిడ్డను బయటికి తీయాలని ప్రత్యేకంగా అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. 


నెలలు నిండిన వారు కూడా వెయిటింగ్


సాధారణంగా కడుపులో బిడ్డ నిండా తొమ్మిది నెలలు నిండి పదోనెల వచ్చిన తర్వాత భూమ్మీద పడితే ఆరోగ్యంగా ఉంటాడని వైద్యులు చెబుతారు. ఉమ్మనీరు పోయినా, బిడ్డ కదలికలు సరిగా లేకపోయినా, తల్లి ఆరోగ్య పరిస్థితి బాగోపోయినా కొన్ని ప్రసవాలు ముందస్తుగా చేయాల్సి ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో కడుపులో బిడ్డ సరిగా ఎదగకపోతే మరికొన్ని రోజులు ఉంచడమే మంచిదనే సలహా ఇస్తారు వైద్యులు. కానీ అయోధ్య మందిరం ప్రారంభోత్సవ సందర్భంగా కాబోయే తల్లుల ఆలోచనలు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికే నెలలు నిండి ప్రసవానికి సిద్ధంగా ఉన్న వారు తమ డెలివరీ తేదీని జనవరి 22 వ తేదీ వరకు ఆపాలని కోరుతున్నారు.  నెలలు పూర్తిగా నిండని వారు కూడా కొంత ముందస్తుగానే.. జనవరి 22 వ తేదీన తమకు ఆపరేషన్లు చేసి బిడ్డలను బయటికి తీయాలని వేడుకుంటున్నారు.


Also Read: 100 ప్రాంతాల మట్టి, 7 కోట్ల వ్యయం - అయోధ్యలో వెలగనున్న అతి పెద్ద దీపం ప్రత్యేకతలివే!


ఆ రోజు పుట్టే పిల్లలందరికీ రాముడి పేరే!


అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం రోజు పుట్టే పిల్లలకు రాముడి పేరు వచ్చేలా పేర్లు పెట్టాలని కూడా నిర్ణించుకున్నారట. అయోధ్యలో రాముడు కొలువుతీరనున్న సమయం అత్యంత శుభ సమయమని..ఆరోజు ఎంతో పవిత్రమైందని అక్కడి వారు భావిస్తున్నారు. 


తల్లి-బిడ్డకు ప్రమాదం అని చెప్పినా..!


సాధారణంగా హాస్పిటల్స్ లో రోజుకి 6 నుంచి 8 ప్రసవాలు నిర్వహిస్తామని..ఇలాంటి పరిస్థితుల్లో ప్రసవాల సంఖ్య పెరిగితే హాస్పిటల్స్ పై భారం పెరగడంతో పాటూ తల్లి బిడ్డకు ముప్పు కలగొచ్చు అంటున్నారు వైద్యులు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో వైద్యులు ఇందుకు అంగీకరించకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కి భారీగా వెచ్చింది మరీ ఆ రోజు బిడ్డను కనేందుకు సిద్ధమైపోతున్నారు. దీంతో ఆయా హాస్పిటల్స్ కూడా ఆ రోజు ఎక్కువ ప్రసవాలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు...


ఇక జనవరి 22 వ తేదీన రామ మందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 7 వేల మంది అతిథులకు ఆహ్వానాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పంపించింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు.. సాధువులు, స్వామీజీలు వేడుకలకు హాజరుకానున్నారు.ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జనవరి 16 నుంచి ప్రారంభమై జనవరి 22 వ తేదీన ప్రాణ ప్రతిష్ఠతో ముగుస్తాయి..


Also Read: అయోధ్యలో రామమందిరంతో పాటూ ఇవన్నీ సందర్శించాల్సిన ప్రదేశాలే!


గమనిక: ఎవరి మనోభావాలు కించపరచాలి అన్నది ఏబీపీ దేశం ముఖ్య ఉద్దేశం కాదు. తొమ్మిది నెలల పాటూ ప్రతిక్షణం బిడ్డ క్షేమం కోసమే ఆలోచించే తల్లి..సెంటిమెంట్ పేరుతో రిస్క్ చేయడం సరైన చర్యేనా? రాముడిపై భక్తి ఉంటే పుట్టిన బిడ్డను రాముడిలా పెంచండి.ఆ గుణగణాలు నేర్పించండి. జీవితంలో వేసే ప్రతి అడుగు గౌరవంగా ఎలా వేయాలో బోధించండి. నెలలు నిండి సహజంగా వచ్చే ప్రసవం అయితే పర్వాలేదు కానీ రాముడిని ప్రతిష్టించిన సమయంలో బిడ్డను కనాలి అనే ఆలోచన ఎంతవరకూ సమంజసమో ఆలోచించండి అని పండితులు సూచిస్తున్నారు..