Best Places to Visit in Ayodhya: ఈ నెల 22న అత్యంత ప్రతిష్టాత్మకంగా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ అపురూపమైన వేడుకకు రామజన్మభూమి ముస్తాబవుతోంది. ఈ సమయంలో భారీగా భక్తులు అయోధ్యకు తరలివెళుతున్నారు. రామమందిరంలో కొలువుతీరనున్న శ్రారాముడిన కళ్లారా దర్శించి తరించేందుకు పోటీపడతారు. అయితే కేవలం రామమందిరం మాత్రమే కాదు అయోధ్యలో సందర్శించాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయి..అవేంటో చూద్దాం..
గుప్తర్ ఘాట్..
ఇది రామజన్మభూమికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకృతి అందాల మధ్య సరయూ నది ఆరో ఘాట్ ఇది. శ్రీరాముడు తన సర్వోన్నత నివాసానికి ఈ ఘాట్ నుంచే వెళ్లాడంటోంది వాల్మీకి రామాయణం.
మణి పర్వత్
అయోధ్యలోని కామి గంజ్ ప్రాంతంలో ఉన్న మణి పర్వత్ కి ఓ ప్రాముఖ్యత ఉంది. రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు ఆంజనేయుడు సంజీవని పర్వతం తీసుకొచ్చాడు. ఆ సమయంలో పర్వతంలో కొంత భాగం ఇక్కడ పడిందని చెబుతారు.
Also Read: 100 ప్రాంతాల మట్టి, 7 కోట్ల వ్యయం - అయోధ్యలో వెలగనున్న అతి పెద్ద దీపం ప్రత్యేకతలివే!
నాగేశ్వరనాథ్ ఆలయం
శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించించిన ఆలయమే నాగేశ్వరనాథ్ ఆలయం. ఈ ఆలయంలోని శివలింగానికి భక్తులు సరయూనది నుంచి నీటిని తీసుకువచ్చి అభిషేకం చేస్తారు.
హనుమాన్ గర్హి
శ్రీరాముడి గొప్ప భక్తులు హనుమంతుడు. ఆ భక్తులు వెలసిన ఆలయమే హనుమాన్ గర్హి. అయోధ్యకు రక్షకుడిగా భావించే వాయుపుత్రుడిని తప్పనిసరిగా దర్శించుకోవాలంటారు పండితులు
కనక భవన్
అయోధ్యలో ఉన్న ఈ భవన్ అధ్భుతమైన శిల్పకళా వైభవానికి సంకేతం. దశరథుడు తన మూడో భార్య కైకేయికి బహుమతిగా ఇచ్చిన రాజభవనం అని చెబుతారు. కైకైయి ఈ భవనాన్ని సీతాదేవికి ఇచ్చిందంటారు. ఇందులో సీతారాముల విగ్రహాలుంటాయి.
Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి!
దేవకాళి దేవాలయం
అయోధ్య సమీపం ఫైజాబాద్ లో ఉంది దేవకాళి దేవాలయం. ఈ ఆలయంలో గిరిజా దేవి కొలువై ఉంటుంది. వివాహం అనంతరం అయోధ్యకు వచ్చినప్పుడు సీతాదేవి తనవెంట తీసుకొచ్చిన విగ్రహం ఇది అని..స్వయంగా దశరథ మహారాజు ఆలయాన్ని నిర్మించి ఆ విగ్రహాన్ని ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి.
సీతా కి రసోయి
అయోధ్య వెళ్ళేవారు సీతా కి రసోయి పేరు తప్పకుండా వింటారు. ఇది సీతాదేవి వంటగది. ఇప్పుడిది దేవాలయంగా రూపాంతరం చెందింది. నాటికాలం వంటపాత్రలు, వంట సామగ్రిని ఇక్కడ చూడొచ్చు.
రామ్ కథా పార్క్
అయోధ్యలో రామ్ కథా పార్కు ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ రామ మందిరానికి సంబంధించి సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రార్ధనా సమావేశాలు, అనేక ఇతర కార్యక్రమాలు ఉంటాయి. ఈ ప్రదేశం కూడా చూడదగినది.
Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!
అయోధ్య రాజ మందిరం
అయోధ్యలో రాజమందిరం కూడా చూడాల్సిన ప్రదేశం. నాటి కాలం విగ్రహాలు, దేవళ్లు - దేవతలకు సంబంధించిన ఎన్నో విగ్రహాలు ఇక్కడ ఉంటాయి.
అయోధ్య ఘాట్
అయోధ్య ఘాట్ లో బోట్ రైడ్ అద్భుతం. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో సరయు నదిలో బోట్ ప్రయాణం మంచి ఆనందాన్నిస్తుంది.
గులాబ్ బారీ
నవాబులు అయోధ్యలో నిర్మించిన అందమైన భవనాలలో ముఖ్యమైనవి గులాబ్ బారీ, మోతీ మహల్, బహు బేగం సమాధి . వీటిలో గులాబ్ బారిలో శిల్పకళ చూపుతిప్పుకోనివ్వదు.