Makar Sankranti 2024:  పండుగ అంటే శుచి, శుభ్రతకే మొదటి స్థానం. పైగా సంక్రాంతి అంటే దాదాపు నెల రోజుల ముందునుంచీ సందడి మొదలవుతుంది. ఇల్లంతా దుమ్ము ధూళి దులిపేసి.. పండుగ సమయానికి ఇంటిని అద్దంలా మార్చేసే పనిలో ఉంటారు. మరోవైపు పండుగ మూడు రోజులు కొత్త బట్టలు, పిండివంటలు...ఆటలు పాటలు..ప్రతిక్షణం సంతోషంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అయితే ఎంతో ప్రత్యేకం అయిన పండుగలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా అంతా శుభం జరుగుతుందని సూచిస్తున్నారు పండితులు.


స్నానం చేయకుండా ఏమీ తినొద్దు


కొందరికి బెడ్ పై ఉండగానే కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. ఇంకొందరైతే లేచి బ్రష్ చేయగానే స్నానంతో సంబంధం లేకుండా టిఫిన్ లాగించేస్తారు. అడిగితే రకరకాల కారణాలు చెబుతారు. మరీ కదల్లేకుండా మంచానికే పరిమితమైతే వేరు...కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా కారణాలుగా చూపించి స్నానం చేయకుండానే లాగించేస్తారు. అయితే పండుగ రోజు ప్రత్యేక పూజ పునస్కారం మాట దేవుడెరుగు..కనీసం స్నానం ఆచరించి సూర్యుడికి నమస్కారం చేసి తింటే...ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. 


Also Read: ఇంటి ముందు ముగ్గు లేకపోతే అంత అపచారమా - సంక్రాంతికి మరింత ప్రత్యేకం ఎందుకు!


మొక్కలు నాటకపోయినా పర్వాలేదు చెట్లు కొట్టొద్దు


చెట్టు, పుట్ట, ప్రకృతి ఇలా అన్నీ పూజనీయమే అని భావిస్తారు. రావిచెట్టు లాంటివాటికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే మకర సంక్రాంతి అంటేనే ప్రకృతి పండుగ. ఈ రోజు పంట చేతికి రావడంతో ప్రకృతికి, పశువులకు కృతజ్ఞతలు చెబుతూ వాటికి పుసుపు, కుంకుమ అందిస్తాం. అలాంటప్పుడు చెట్లు నరికేయడం లాంటి ప్రకృతి విరుద్ధమైన పనులు చేయవద్దు. ఇప్పటికే తాగేనీళ్లు కొనుక్కుంటున్న మనం.. కరోనా సమయంలో గాలి కూడా కొనుక్కున్నాం. అందుకే చెట్లను దైవ స్వరూపాలుగా భావించకపోయినా పర్వాలేదు కానీ మనకు ప్రాణవాయువు అందించే వాటిని నాశనం చేయొద్దు.


Also Read: సంక్రాంతి పండుగ వెనుక ఎన్ని కథలున్నాయో తెలుసా!


మద్యం-మాంసం వద్దు


మకర సంక్రాంతి రోజు ఆటలు, కోడి పందాలు, కొత్త అల్లుళ్లు సందళ్లలో పడి మత్తు పదార్థాలపై మొగ్గుచూపుతారు. కానీ ఇది చాలా తప్పు అంటారు పండితులు. భోగి, సంక్రాంతి రోజు మద్యం తీసుకోవడం, మసాలా ఆహారం తినడం రెండూ మంచిది కాదంటారు. సూర్యుడు, శని అనుగ్రహంతో లభించాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా  నువ్వులు, చిక్కీ,  ఖిచ్డి, కొత్త బియ్యంతో చేసిన పిండి వంటలు తినొచ్చు. 


Also Read: సంక్రాంతికి ముగ్గులో 'సిరులు పొంగే కుండ' తప్పనిసరిగా వేస్తారెందుకు!
 
చేయి చాచి ఆకలి అన్నవారిని ఖాళీగా పంపొద్దు


పండుగ వేళ మీ ఇంటి ముందు నిల్చున్న బిచ్చగాడిని ఖాలీ చేతులతో పంపవద్దు. మీకు తోచినంత దానం చేయండి. కడుపునిండా అన్నం పెట్టండి 


Also Read: సంక్రాంతికి మీరు పాటించాల్సిన 5 విషయాలు!


 ఆవేశం వద్దు


సూర్యుడు దిశ మార్చుకున్నట్టే.. ఇప్పటి వరకూ మిమ్మల్ని పట్టి పీడించే ఆగ్రహం, ఆవేశం, కోపాన్ని వదిలిపెట్టి సరికొత్త వెలుగును మీ జీవితంలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నించండి. అనవసరంగా ఎవ్వరితోనూ వివాదం పెట్టుకోవద్దు, సరదా అలకలు-బుజ్జగింపులు పండుగ సందడిని పెంచుతాయి కానీ ఎవ్వరి మనసు బాధపెట్టేలా ప్రవర్తించవద్దు. 


పండుగ సమయంలో ఆనందాన్ని రెట్టింపుచేసే చిన్న చిన్న మార్పులు పాటిస్తే ఏమవుతుంది..మహా అయితే మంచి జరుగుతుంది..


Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!