Pushpagiri Temples: హరిహరులు ఒకే దగ్గర కొలువైన క్షేత్రం పుష్పగిరి. దక్షిణకాశిగా పిలిచే, భక్తులు కొలిచే ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉంది. రాష్ట్రంలో ఏకైక అద్వైత పీఠంగా గుర్తింపు పొందిన ఆ ఆలయం పినాకిని నది ఎదురుగా పుష్పగిరిలో కొలువైంది. శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు చెన్నకేశ్వరస్వామిగా, శివుడు చంద్రమౌళీశ్వరుడిగా పూజలందుకుంటున్నారు. ఏడో శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని.. పల్లవులు, చోళులు, చాళుక్యులు, విజయనగర రాజులు దర్శించుకుని తరించారని చెబుతారు.
ఈ ప్రాంతానికి పుష్పగిరి అనే పేరెలా వచ్చిందో వివరిస్తూ బ్రహ్మాండ పురాణంలో ఓ కథ ఉంది..
కశ్యప మహర్షి భార్యలైన వినత,కద్రువ ఇద్దరూ పందెం వేసుకుని ఓడిన వారు గెలిచినవారికి దాస్యం చేయాలనే నిబంధన విధించుకుంటారు. అలా వినత ఓడి కద్రువకు దాసిగా పనిచేసింది. వినతకు జన్మించిన గరత్మంతుడి నుంచి ఆమెకు శాపవిముక్తి కలిగింది. తన తల్లికి బానిసత్వం నుంచి విముక్తి కల్పించమని కద్రువను కోరితే..తనకు అమృతం కావాలని అడిగిందట. అలా దేవేంద్రుడి దగ్గరున్న అమృత భాండాన్ని గరుత్మంతుడు తీసుకొచ్చే క్రమంలో కడప ప్రాంతంలో ఉండే పినాకిని నదిలో రెండు చుక్కలు పడ్డాయట. అప్పటి నుంచి ఆ నదిలో స్నానమాచరించిన వారంతా యుక్తవయస్కులుగా మారిపోయారు. అది చూసిన దేవతలంతా విష్ణువు దగ్గరకు అసలు విషయం చేరవేశారట. వెంటనే త్రిమూర్తులు ముగ్గురూ కలసి కైలాశ పర్వతంలో ఓ చిన్న ముక్కను తీసుకొచ్చి అక్కడ నీటిలో వేసారు. అమృతం ప్రభావం వల్ల ఆ రాయి నీటిలో తేలడంతో.. త్రిమూర్తులు కాలితో నీటిలోనే ఉండిపోయేలా తొక్కేశారని స్థలపురాణం. ఇప్పటికీ పుష్పగిరిపై త్రిమూర్తుల పాదముద్రలు ఉన్నాయని చెబుతారు.
Also Read: శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడు .. శివాలయాలు శ్మసానంతో సమానమా!
నీటిలో వేసి రాయి పూవులా తేలడంతో...ఈ ప్రాంతానికి పుష్పగిరి అనే పేరొచ్చిందని చెబుతారు. ఈ ఆలయాన్ని విద్యారణ్యస్వామి నెలకొల్పారని చెబుతారు. ఇక్కడున్న పినాకిని నదియ..ఉత్తరం నుంచి దక్షిణ దిశగా ప్రవహిస్తుంది అందుకే దక్షిణకాశిగా పిలుస్తారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు కూడా చెన్నకేశ్వరస్వామే. ఇక్కడున్న స్వామి నిలువెత్తు విగ్రహం తిరుమల శ్రీవారి విగ్రహం కన్నా ఎత్తుగా ఉంటుంది. ఏడాది మొత్తం పూజలు జరుగుతాయి...ధనుర్మాసం, కార్తీమాసంలో అత్యంత వైభవంగా పూజలు జరుగుతాయి.
పుష్పగిరిలో ఉన్న చెన్నకేశ్వర స్వామి ఆలయంలో మరో ప్రత్యేక ఆలయం ఏంటంటే కోర్కెల మల్లేశ్వరస్వామి. ఇది ఓ మూలన ఉండే చిన్న ఆలయం. ఇక్కడ భక్తులు భారీగా గుమిగూడి ఉంటారు. ఈ ఆలయం ద్వారం దగ్గర పైన ఓ కన్నం ..కింద మరో కన్నం ఉంటుంది. ఓ చిన్న రాయి తీసుకుని పైన కన్నం దగ్గర పెట్టి వదిలితే కింద కన్నంలో పడాలి. అలా అయితే కోరిన కోర్కె తీరుతుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు మనసులో ఓ కోర్కె కోరుకుని ఇక్కడ రాళ్లు వేస్తుంటారు. రాయి పడితే కోరిన కోర్కె నెరవేరుతుందని భావిస్తారు.
Also Read: అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే
కొండమీదున్న చెన్నకేశ్వర స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, కోర్కెల మల్లేశ్వరస్వామితో పాటూ రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ ఉపాలయాలూ చూడొచ్చు. ఈ ఆలయానికి వెళ్లాలి అనుకుంటే కడప వరకూ రైలు మార్గం, రోడ్డు మార్గం రెండూ ఉన్నాయి. కర్నూలు మీదుగా వెళ్లాలి అనుకుంటే ఉప్పరపల్లె మీదుగా 16 కిలమీటర్లు ప్రయాణిస్తే చెన్నకేశ్వర ఆలయం చేరుకోవచ్చు
Also Read: శివ మంత్రమే ఎందుకు 'మృత్యుంజయ' స్త్రోత్రం అయింది