Telangana News | రాజకీయంగా వ్యూహత్మకంగా మౌనంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ  ఏం మాట్లడనున్నారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇవాళ  తెలంగాణ భవన్ లో  ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం  కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఏం చేయనుంది.  పార్టీ శ్రేణులకు కేసీఆర్  ఏం చెప్పనున్నారు అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లోను, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లోను నెలకొంది.  పార్టీ రాష్ట్ర కార్యవర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జులు, జిల్లా అధ్యక్షులు,  పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులుఈ సమావేశంలో పాల్గొననున్నారు.


  కారు రూట్ మ్యాప్ రచన కోసమేనా.....


సాధారణ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడు  కేసీఆర్ పార్టీ శ్రేణులతోను, ముఖ్య నేతలతోను కొంత వరకు ఓటమిపై సమీక్ష జరిపారు. ఆ తర్వాత  తన ఇంటికి వచ్చిన పార్టీ నేతలు,  కార్యకర్తలతో సమావేశం అయ్యారు. గత బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు పాల్గొన్న కేసీఆర్ ఆ తర్వాత రాజకీయ మౌన వ్రతంలో ఉన్నారు.  ఇటీవలే తనను కలిసి పార్టీ కార్యకర్తల సమావేశంలో తాను కొడితే దెబ్బ మాములుగా ఉండదు, చాలా గట్టిగా ఉంటుందని కాంగ్రెస్ సర్కార్ ను, సీఎం రేవంత్ రెడ్డిని  కేసీఆర్ హెచ్చరించారు.


ఇక పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్ రావు  ప్రభుత్వ హమీల అమలుపైన,  పార్టీ నేతల అరెస్టులపైన  కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు.   పార్టీలో మరో కీలక నేత  కవిత బీసీ సమస్యలు, రిజర్వేషన్లపై  రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి పార్టీ కార్యకర్తల్లో కొంత  చర్చ జరిగేలా చేశారు. ఇలా  పార్టీలో ముఖ్య నేతలు  ఏదో కార్యక్రమాలు చేస్తుంటే, కేసీఆర్ మాత్రం పూర్తి స్థాయిలో తన కార్యాచరమ ఏంటి, పార్టీ నేతలు, శ్రేణులకు తదుపరి రూట్ మ్యాప్ ఏంటి  అన్న విషయాల్లో స్పష్టత ఇవ్వలేదు. ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ  ఏం చేయనుందో చెప్పే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


 ఘనంగా పార్టీ జూబ్లీ వేడుకల నిర్వహణ....


 తెలంగాణ భవన్ లో జరిగే ఈ సమావేశంలో  పార్టీ  ఏప్రిల్ 27, 2001 లో ఏర్పడింది.  ఈ క్రమంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం.  ఆయా రాష్ట్రాల నుంచి  జాతీయ నేతలను  ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 400మందిప్రత్యేక అతిధులను ఆహ్వానించనున్నట్లు సమాచారం.  ఈ వేడుకల్లోనే పార్టీ భవిష్యత్తు కార్యాచరణను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర, జాతీయ అంశాలపై తీర్మనాలు  ఈ జూబ్లీ వేడుకల్లో ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా 25 ఏళ్ల ప్రస్తానం, జయాలు - అపజాయలపై సమీక్ష జరపనున్నట్లు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అంతే కాకుండా  పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు కొత్త కమిటీలు వేసే అవకాశం ఉందని, గ్రామ స్థాయి వరకు కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేసే అంశంపై ఇవాళ్టి విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం.  దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను  సంసిద్ధం చేసేలా కేసీఆర్ రోడ్ మ్యాప్ ఇవ్వనున్నట్లు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి.


 రాష్ట్ర, జాతీయ పరిణామాలపై కేసీఆర్...


ఈ సమావేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్  పాలన, రేవంత్ రెడ్డి తీరు,  హమీల  అమలు తీరు తెన్నులపై  కేసీఆర్ స్పందించే అవకాశం ఉన్నట్లు గులాబీ నేతలు చెబుతున్నారు.  రానున్న రోజుల్లో రేవంత్ సర్కార్ ను చెక్ పెట్టే వ్యూహాలను ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.  అంతేకాకుండా ఈ ఏడాది కాలంలో క్షేత్ర స్థాయిలో ప్రస్తుత ప్రభుత్వ పాలన పై ప్రజలు ఏం అనుకుంటున్నారు అన్న  విషయాన్ని  నేతల నుండి అడిగి తెలుసుకోవచ్చని కారు పార్టీ నేతలు చెబుతున్నారు.


అంతే కాకుండా ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం,  కేంద్ర పాలన తీరు వంటి అంశాలపైన కేసీఆర్ పెదవి విప్పే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.  ఈ సమావేశం ద్వారా రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై ఆయన స్పందన తెలియజేసే అవకాశం ఉందంటున్నారు. అంతేకాకుండా పార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకల సమాచారం తో పాటు,  పార్టీ క్యాడర్ లో జోష్ నింపేలా  దిశా నిర్దేశం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.