Madikeri Dasara: కర్ణాటకలోని మడకేరి ఏరియాలో జరిగే దసరా ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అక్కడ నివసించే కొడుగు జాతి ప్రజలు తమ సొంత ఖర్చులతో దసరాను వైభవంగా జరుపుతారు. అయితే ఏదో ఒక్క రాక్షసుడుపై సాధించిన విజయంగా కాకుండా అసురులపై దేవతలు సాధించిన విజయానికి నిదర్శనంగా మడకేరి దసరా జరుగుతుంది.
10 మంటపాలు తో ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణ
మడకేరి దసరాకు ప్రత్యేక ఆకర్షణ 8 నుండి 15 అడుగుల ఎత్తున తయారుచేసే మంటపాలు. వీటి తయారీ మూడు నెలల ముందు నుంచే ప్రారంభమవుతుంది. ఒక్కో మంటపం కమిటీ బృందం లో 50 నుంచి 100 మంది ఉంటారు. ఇలాంటి మంటపాలు మొత్తం 10 ఉంటాయి. ఒక్కో మంటపం కోసం 20 లక్షల వరకు వెచ్చిస్తారు. ఒక్కో మంటపంలో చిన్న చిన్న వేరు వేరు రకాల దేవతల విగ్రహాలు ఉంచుతారు. ప్రతి మంటపానికి ప్రత్యేకమైన పౌరాణిక కథల థీమ్ ఉంటుంది. దసరా ఉత్సవాల్లో 9వ రోజు సాయంత్రం నుంచి పదో రోజు (విజయదశమి ) ఉదయం వరకు ఈ మంటపాలను ప్రతి ఇంటి మీదుగా ఊరేగిస్తారు. అన్ని మంటపాల్లోనూ టాప్ త్రీ గా నిలిచిన మూడు మంటపాలను కమిటీ ఎంపిక చేసి వాటికి ప్రైజ్ మనీ అందజేస్తారు. రాత్రంతా జరిగే ఈ ఊరేగింపు చూసేందుకు ఎక్కడెక్కడి నుండో టూరిస్టులు మడకేరి చేరుకుంటారు. ఈ మడకేరి దసరా లో కన్నడ సంస్కృతీ తో మంటపాలు ఏర్పాటు చేస్తే తమిళనాడు నుండి లైటింగ్ బోర్డ్స్, కేరళ స్టైల్ బ్యాండ్ మేళాలు పాల్గొంటాయి.
నలుగురు దేవతలు - నాలుగు కరగలు
మడకేరి దసరా కు మరో ప్రత్యేక ఆకర్షణ కరగలు. ఈ ప్రాంతంలో మరియమ్మ పేరుగల దేవతకు నాలుగు ఆలయాలు ఉన్నాయి. దండిన మరియమ్మ,కంచి కామాక్షమ్మ, కుండూరుమొట్టె శ్రీ చౌటి మరియమ్మ, కోటె మరియమ్మ. ఈ నాలుగు ఆలయాలకు నాలుగు కరగలు ఉంటాయి. కరగ అంటే బియ్యం తో పాటు నవధాన్యాలు ఉంచే కుండ లాంటి పాత్ర. దీనిని దసరా సమయంలో మల్లి, కనకాంబరం, చామంతి మొదలైన పువ్వులతో అలంకరించి ఈ ఆలయాల పూజారులు తల గుండు కొట్టుకుని రంగురంగుల బట్టలు ధరించి తమ తలపై ఈ కరగలు పెట్టుకుని ఇంటింటికి తిరుగుతారు. అలా తిరుగుతూ అక్కడికి దగ్గర్లోని " పంపిన కర్రే " ప్రాంతానికి చేరుకుంటారు. వరుసగా 5 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కరగలను " శక్తి దేవతలు" గా ప్రజల భావిస్తారు. ఇలా పూజారులు తిరిగే సమయంలో ఒక చేతిలో "బెత్త " అని పిలిచే కర్ర, మరో చేతిలో " కత్తి " పట్టుకుంటారు. ఐదు రోజులు పూర్తయ్యాక వీటికి ఆయుధ పూజ చేస్తారు.
స్థల పురాణం
చాలా ఏళ్ల క్రితం అంతు బట్టని అంటు వ్యాధితో మడకేరి ప్రజలు ఇబ్బంది పడ్డారని, అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించే రాజు మరియమ్మ దేవతకు పూజలు, ఊరేగింపులు జరపడంతో ఆ వ్యాధి నయమైందని డానికి గుర్తుగా కరగలతో దసరా ఉత్సవాలు ప్రారంభయ్యాయని ఇక్కడి స్థలపురాణం. ప్రతీ యేటా మహాలయ అమావాస్య ముగిసిన రోజు నుండి దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
Also Read: దసరా ఉత్సవాలకు రారాజు మైసూరు దసరా - రాచరికం ఉట్టిపడేలా జంబూసవారి!
కన్నడ నాట రాజస్థానీ సంస్కృతి మేళ వింపు
రాజస్థాన్ నుంచి వచ్చి మడకేరిలో స్థిరపడిన భీమ్ సింగ్ అనే ఆయన మడకేరి దసరాలో మంటపాల ఊరేగింపు సంస్కృతి ప్రారంభించినట్టు చెబుతారు. రాజస్థాన్,మైసూర్ నుంచి చిన్న చిన్న బొమ్మలను తయారు చేసే వాళ్లను రప్పించి వాళ్లతో దేవతా విగ్రహాలు తయారు చేయించి ట్రాక్టర్ పై ఉంచి దసరా ఉత్సవాల్లో ఊరేగించేవారనీ తర్వాత అదే ఒక సంప్రదాయంగా మారిపోయిందని మడికేరి ప్రజలు చెబుతారు. భీమ్ సింగ్ కుటుంబీకులు ఆయన కాలంలో కేవలం 4 పంటపాలు ఉండేవని ఇప్పుడు వాటి సంఖ్య పదికి చేరిందని గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఏదేమైనా కన్నడ, రాజస్థానీ, తమిళ,కేరళ సంస్కృతులు కలిపిన మడకేరి దసరా ను చూడడానికి దేశం నలుమూలల నుండి టూరిస్టులు మడి కేరి పట్టణం వస్తూ ఉంటారు. కర్ణాటకలోని మడికేరికి బస్సు రూట్ లో మాత్రమే వెళ్లగలం. మైసూర్, మంగుళూరు,బెంగుళూరు,హుబ్బిలి, మధురై, కోయంబత్తూర్ ల నుండి డైరెక్ట్ బస్సులు ఉంటాయి
Also Read: అయోధ్య రాముడిని దొంగతనం చేసి జరుపుకునే " కుల్లు దసరా"