Astadasha Shakti Peethas - sri chamundeshwari temple chamundi hill mysuru
లంకాయాం శాంకరీదేవి
కామాక్షీ కాంచికాపురే!
ప్రద్యుమ్నే శృంఖలాదేవీ
చాముండీ క్రౌంచపట్టణే!!
అష్టాదశ శక్తిపీఠాల్లో చాముండేశ్వరి పీఠం ఒకటి. దక్షయజ్ఞానికి వెళ్లి అవామానం ఎదుర్కొన్న సతీదేవి తనని తాను అగ్నికి ఆహుతి చేసుకుంది. ఆ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండిపోయిన శివుడు తన కర్తవ్యాన్ని వదిలేస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా ఆ శరీరం ముక్కలుగా 18 ప్రదేశాల్లో పడింది. అవే అష్టాదశ శక్తి పీఠాలుగా వెలుగుతున్నాయి. వాటిలో సతీదేవి శిరోజాలు పడిన ప్రదేశం చాముండి కొండలు. ఆమె చాముండేశ్వరిగా పూజలందుకుంటోంది. చాముండి కొండలపై కొలువైన శక్తిని దర్శించుకునేందుకు దాదాపు 1000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. కొండపై కొలువైన అమ్మవారితో పాటూ శివాలయాన్ని దర్శించుకోవచ్చు.
Also Read: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!
అఖిలాండేశ్వరి..చాముండేశ్వరి..జగజ్జనని..దుర్గ.. మహిషాసురమర్దిని...ఏ పేరుతో పిలిచినా భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది మైసూర్ లో కొలువుతీరిన చాముండేశ్వరి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ఈ క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. మైసూర్ మహారాజుల ఇలవేల్పుగా, కర్ణాటక ప్రజలను కాపాడే శక్తిగా పూజలందుకుంటోంది. ఇక్కడ కొలువైన అమ్మవారి వైభవం మైసూర్ మహారాజులు వచ్చిన తర్వాత మరింత పెరిగింది.
చాముండేశ్వరి సన్నిధిలో జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఏడాదంతా జగన్మాత దర్శన ఓ లెక్క.. కేవలం నవరాత్రుల్లో చివరి మూడు రోజులు మరో లెక్క. నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా జగన్మాతను నవరత్నఖచిత ఆభరణాలతో అలంకరించి ఏనుగు అంబారీపైన ఊరేగిస్తుంటే ఆ వైభోగం చూడని కన్నులెందుకు అనిపిస్తుంది.
మహిషాసురుడితో భీకరయుద్ధం తర్వాత ఆ రాక్షసుడిని చంపిన తర్వాత అమ్మవారు ఇక్కడే కొలువుతీరిందని అందుకే మహిషాసురమర్దిని అంటారు. చండ-ముండ అనే మరో ఇద్దరు రాక్షసులను సంహరించడంలో చాముండేశ్వరి అంటారని దేవీపురాణంలో ఉంది. శక్తి స్వరూపిణి అత్యంత ఉగ్రరూపంలో కనిపిస్తుందిక్కడ. ఈ వేడుకలు చూసేందుకు కర్ణాటక నుంచే కాదు..చుట్టుపక్కల రాష్ట్రాలనుంచి భారీగా భక్తులు తరలివస్తారు.
Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే
శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ఎన్నో సాంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా దుర్గాష్టమి, మహర్నవమి, విజయ దశమి రోజు చాముండి వైభోగం చూసితీరాల్సిందే. ఉత్సవాల్లో ఆఖరి రోజైన దశమి రోజు చాముండేశ్వరి విగ్రహాన్ని బంగారు పల్లకిలో ఊరేగించే దృశ్యాలను ఒక్కసారి చూస్తే జీవితాంతం కళ్లలో నిలిచిపోతాయి.
చాముండేశ్వరికి సమర్పించే స్వర్ణాభరణాలకు ఓ చరిత్ర ఉంది..
అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించే ముస్లిం రాజైన హైదర్‌అలీ చాముండేశ్వరికి ఆభరణాలూ పట్టువస్త్రాలూ సమర్పించాడు. ఇదే సంప్రదాయాన్ని ఆ తర్వాత పాలకులు కూడా కొనసాగించారు. టిప్పు సుల్తాన్ తర్వాత మైసూర్ మహారాజులు ఈ సంప్రదాయాన్ని అనుసరించడం ప్రారంభించారు. అమ్మవారికి మైసూర్ మహారాజులు భారీగా ఆభణాలు చేయించారు.
ఏడాదిలో ఆ మూడు రోజులు...
ఏడాది మొత్తం శక్తి స్వరూపిణి దర్శనం ఓ లెక్క అయితే..దసరాల్లో చివరి మూడు రోజులు మరో లెక్క. ఈ మూడు రోజులు అమ్మవారిని సకల ఆభరణాలతో అలంకరిస్తారు. ఇందులో భాగంగా నవరాత్రి ఏడో రోజు పోలీసు బందోబస్తు మధ్య ఆభరణాలను దేవస్థానానికి తీసుకొచ్చి మూడు రోజుల పాటూ అమ్మవారికి అలంకరించి..అంబారీ అనంతరం..మళ్లీ పోలీసు బందోబస్తు మధ్య తిరిగి భద్రపరుస్తారు. ఈ ఆభరణాల్లో రత్నఖచిత త్రిశూలం, పాశుపతాస్త్రం, ఖడ్, పచ్చల హారాలూ, ముత్యాలనగల...ఇంకా ఎన్నో ఉన్నాయి. ఏడాదికి ఓసారి మాత్రమే అమ్మవారు మొత్తం ఆభరణాలతో దర్శనమిస్తుంది. శరన్నవరాత్రులతో పాటూ ఆషాఢమాసంలో వచ్చే శుక్రవారాల్లోనూ చాముండేశ్వరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం