Ashtadasa Shakti Peethas: హిందువులకు ఆరాధ్య పుణ్యక్షేత్రం , సప్తమోక్ష పురాణాలలో ఒకటిగా కాశికి విశిష్ట స్థానం ఉంది. వేల సంవత్సరాలక్రితమే కాశీ ఉండేదని  చెప్పేందుకు గుర్తుగా వేదాల్లోనూ, ఇతిహాసాల్లోనీ ఈ నగరం ప్రస్తావవ ఉంది. అసలు కాశీలో తొలి నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. మనిషి శరీరంలో ఉన్న నాడులతో సమానంగా ఇక్కడ 72వేల గుడులు ఉండేవట. ఈ క్షేత్రంలో కొలువుదీరిన విశ్వేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యుడు. అవిముక్త క్షేత్రంగా  పేరుపొందింది.కాశీ విశ్వనాథుడి ఆలయానికి కొంత దూరంలోనే విశాలాక్షి అమ్మ కొలువైంది. ఈ శక్తిపీఠంలో విశాలాక్షి  గర్భగుడిలో రెండు రూపాల్లో దర్శనమిస్తుంటుంది. ఓ రూపం స్వయంభువు, మరో రూపం అర్చామూర్తి. ఆలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా అర్చామూర్తిని దర్శించుకుని ఆ తర్వాత స్వయంభుని దర్శించుకోవాలి. ఇక్కడ కొలువైన విశాలాక్షి అమ్మవారి గుడి చాలా చిన్నది. బంగారు తొడుగుతో అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో దక్షిణాది సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. శక్తి ఆగమ శాస్త్రంలో తమిళ బాహ్మణులు పూజలు నిర్వహిస్తారు. ఆదిశంకరాచార్యాలు శ్రీ చక్రం ప్రతిష్టించినప్పటి నుంచి అక్కడ దక్షిణాది సంప్రదాయాలు పాటించడం ప్రారంభించారు. ఆలయంలో నలుగురు శిష్యులతో ఉన్న శంకరాచార్యుల ఫొటో కనిపిస్తుంది.  అమ్మవారి గుడి చుట్టూ శివలింగాలు ప్రతిష్టించి ఉంటాయి. అమ్మవారి ఎదురుగా ఉన్న  శ్రీ చక్రం భక్తులు తాకి నమస్కరించుకోవచ్చు. 


Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే


శక్తి పీఠం విశిష్టత
ఇక్కడ సతీదేవి మణికర్ణిక పడిన ప్రదేశంగా చెబుతారు. పురాణాలలో విశాలాక్షిని ఈ విశ్వాన్ని పరిపాలించే దేవతంగా వర్ణించారు. తాంత్రిక శాస్త్రంలో మహాకాళి రూపంగా చెబుతారు.  కాశీలో మరణించిన వారికి ఈమె కర్మబంధాలను తొలగిస్తుందని..కాశీ విశ్వనాథుడు మహాకాళుడి రూపంలో మారి చనిపోయిన వారి చెవిలో తారకమంత్రం ఉపదేశించి మోక్షాన్ని అనుగ్రహిస్తాడని చెబుతారు.


అన్నపూర్ణాదేవి
స్కాంద పురాణంలో ఉన్న ఓ కథ ప్రకారం వారణాసిలో వ్యాసభగవానునికి, ఆయన శిష్యులకు ఏడు రోజుల పాటు భిక్ష దొరకలేదు. ఆగ్రహంతో వ్యాసుడు కాశీ నగరాన్ని శపించాడట. అప్పుడు అన్నపూర్ణగా అవతరించిన విశాలాక్షి వ్యాసుడిని, తన శిష్యులను ఆహ్వానించి భోజనం వడ్డించింది.   అయితే కాశీపై ఆగ్రహం చూపిన వ్యాసుడిని పరమేశ్వరుడు కాశీ నుంచి బరిష్కరించడం..తప్పు క్షమించమని వ్యాసుడు వేడుకోవడంతో ... తిరిగి కాశీలోకి అనుమతిస్తానని శివుడు చెప్పాడు. అదుకే అన్నపూర్ణ, విశాలాక్షి ఒకరే అన్నది భక్తుల భావన. అయితే కాలక్రమంలో రెండు ఆలయాలు ఏర్పడ్డాయి. విశ్వనాధుని గుడికి దగ్గరలో అన్న పూర్ణ ఆలయం ...దీనికి కొద్ది దూరం లో విశాలాక్షి ఆలయం ఉంది. వివాహం కాని అమ్మాయిలు ఇక్కడ గంగలో స్నానమాచరించి విశాలాక్షిని దర్శించుకుంటే అనుకూలుడైన భర్త లభిస్తాడని విశ్వాసం. ఈ సమీపంలో ఉన్న మణి కర్ణికా ఘాట్ లో వేలమంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. 


Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!


స్వర్గాన్ని మించిన కాశీ
కాశివిశాలక్షి అమ్మవారి ఆలయం చుట్టూ శివలింగాలు ప్రతిష్టించి ఉన్నాయి. కాశీలో ఏడు ఆవరణలలో 56 గణపతులున్నారు. అందులో డుంఢిరాజగణపతి ప్రసిద్ది. మార్కండేయ మాధవ్ ఆలయం, భరతమాత మందిర్,  కాలభైరవ టెంపుల్, అన్నపూర్ణ టెంపుల్, దుర్గగుడి, బిర్లా టెంపుల్, వ్యాస టెంపుల్, తిలభణ్డేశ్వర్ ఆలయం సహా ఇక్కడ దర్శించుకోవాల్సి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కాశీ ముందు స్వర్గం సరితూగదన్నాడు శ్రీనాథుడు. పరమేశ్వరుడికి మొగటి నగరం కాబట్టి...కాశీకి అంత విశిష్టత. ప్రళయం వచ్చి సమస్త విశ్వం నీటమునిగినప్పుడు కూడా కాశీ నగరం మిగిలిపోతుందని చెబుతోంది స్కంద పురాణం.