Kali Vs Kalki : ద్వాపరయుగాంతంలో శ్రీ కృష్ణుడు అవతారం చాలించి శ్రీ మహావిష్ణువుగా వైకుంఠానికి వెళ్లిపోయాడు. సరిగ్గా అదే క్షణం భూమ్మీద ఉద్భవించాడు కలి. కలిపుట్టుకే వేద విరుద్ధం. నాలుగు తరాల అన్నా చెల్లెళ్లు చేసిన తప్పిదానికి ఫలితమే కలి పుట్టుక..


బ్రహ్మదేవుడి వెనుక భాగం నుంచి ఉద్భవించిన స్వీయపాతకం అనే శక్తికి అధర్ముడు అని పేరు పెట్టారు..అంటే ధర్మానికి విరుద్ధంగా పుట్టినవాడు అని అర్థం. తనకి మిధ్య అనే ఆమెనిచ్చి వివాహం చేశారు. వారికి పుట్టిన సంతానమే దంబుడు - మాయ. వీళ్లిద్దరూ అన్నా చెల్లెళ్లు అయినప్పటికీ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి పుట్టిన సంతానం లోభుడు-నికృతి. తల్లిదండ్రులను చూసి వీళ్లిద్దరూ కూడా పెళ్లిచేసుకుంటే పుట్టినవారే క్రోధుడు-హింస. వీళ్లు మూడోతరానికి చెందిన అన్నాచెల్లెళ్లు. వీరి సంతానమే కలి పురుషుడు. 


Also Read: అశ్వత్థామ మంచివాడా - చెడ్డవాడా..అత్యంత శక్తిమంతుడైన బ్రాహ్మణ పుత్రుడికి ఎందుకీ శాపం!


ఎడమ చేత్తో అంగాన్ని - కుడిచేత్తో నాలుకను పట్టుకుని ఉద్భవించాడు కలి...
అంటే ఈ యుగంలో ప్రజలందర్నీ కామానికి బానిస చేస్తానని..జిహ్వ కేవలం రుచులకోసమే కానీ మంచి వాక్కులు చెప్పేందుకే  కాదని చెప్పడమే కలి ఉద్దేశం. అందుకే కలియుగంలో రాను రాను యజ్ఞం, యాగం, దానం, ధర్మం పూర్తిగా నశిస్తాయి. మనుషులంతా కామం, భోగం వైపు ఆకర్షితులవుతారు. తలచిన వెంటనే చెడు కార్యక్రమాలు చేసేస్తారు కానీ ఎన్ని నెలలు ప్రయత్నించినా మంచి పనులు పూర్తిచేయలేరు. పైగా ఎవరైతే మంచి కార్యాలు తలపెడతారో వారిని ధనం లేదా స్త్రీని ఆశచూపి ఆపేస్తాడు కలి. బంధాల మధ్య ప్రేమాభిమానాలు ఎక్కడా కనిపించవు. ఎక్కడచూసినా అవసరం మాత్రమే రాజ్యమేలుతుంది. ఎక్కడ మంచి పనులు జరిగితే అక్కడ వెంటనే కలిపురుషుడు ప్రత్యక్షమై వాటిని నాశనం చేస్తాడు.  


కలి ఉండే ప్రదేశాలు ఇవే!


ముఖ్యంగా కలి ఉండే ప్రదేశాలు నాలుగు..అవేంటంటే... మద్యపానం చేసినవారు, వారితో పాటూ ఉండేవారిని కలి విడిచిపెట్టడు.  రెండోది జూదం ఆడేవారితోనే కలి ఉంటాడు...మూడోది వ్యభిచార గృహాల్లో అడుగుపెట్టేవారితో కలి ఉంచాడు..నాలుగో ప్రదేశం ప్రాణవధ చేయడం. ఈ నాలుగు ప్రదేశాల్లో కలి వద్దన్నా ఉంటాడు. అందుకే ఒక్కసారి వీటి బారిన పడితే దాన్నుంచి బయటపడడం అంత సులభం కాదు. పైగా ఈ నాలుగు వ్యసనాలు ఉండేవారు తాము ఏం చేస్తున్నామో అనే విచక్షణ కోల్పోతారు. అందుకే కలిప్రభావం అధికంగా ఉండే ఈ నాలుగు ప్రదేశాలకు దూరంగా ఉండడం మంచిది.


Also Read: శంబల నగరం ఎక్కడుంది , ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లొచ్చారు - శంబల గురించి ఆశ్చర్యపోయే విషయాలివే!


మీపై కలి ప్రభావం ఉండకూడదు అనుకుంటే!


కలియుగంలో పుట్టి కలిప్రభావం పడకుండా ఉండడం చాలా కష్టం. అయితే చాలా చిన్న మార్గాలను అనుసరించడం ద్వారా కలి ప్రభావం నుంచి తప్పించుకోగలుగుతారు.  ఇందుకోసం నాలుగు పద్ధతులు పాటించండి చాలు..


నిత్యం ఇంట్లో దీపారాధన చేయండి..కొద్దిసేపు అయినా ప్రశాంతంగా దేవుడి ఎదురుగా ప్రశాంతంగా కూర్చునేందుకు ప్రయత్నించండి..


భగవంతుడి నామస్మరణ మరవకండి. కేవలం దేవుడి ఎదురుగా కూర్చుని మాత్రమే  భగవన్నామస్మరణ  చేయాల్సిన అవసరం లేదు.. అటు ఇటు తిరుగుతూ, వంట చేస్తూ, వాహనం నడుపుతూ కూడా మీరు నమ్మే భగవంతుడిని స్మరించండి.


Also Read: రామాయణ, మహాభారత యుద్ధాలకు ఓ కారణం ఉంది..మరి కల్కిని ధర్మసంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటి!
 
గడిచిన యుగాల్లో మనసులో పాపపు ఆలోచన వస్తే చాలు ఫలితం వెంటనే అనుభవించేవారు.. పరశురాముడి తల్లి రేణుక నీటికోసం చెరువు దగ్గరకు వెళ్లి తనని తాను మైమరచిపోయింది. తన తపోఫలంతో జరిగినది గ్రహించిన జమదగ్ని మహర్షి కుమారులను పిలిచి రేణుక తల నరికేయమని ఆదేశించాడు. పరశురాముడు తండ్రి ఆజ్ఞపాటించి ఆ తర్వాత మళ్లీ వరం కోరుకుని తల్లిని బతికించాడు. ఇలా..మనసులో చెడు ఆలోచన వస్తే చాలు అందుకు పాప ఫలితం అనుభవించేవారు. కానీ కలియుగంలో అలాకాదు.. పాపం తలిస్తే కాదు చేస్తేనే అందుకు తగిన ఫలితం అనుభవిస్తారు. అలాఅని పాపపు ఆలోచనలు చేయమని కాదు..వాటి బదులు సానుకూల ఆలోచనలతో ఉండమని ఆంతర్యం.


Also Read: 'హనుమాన్' లో విభీషణుడు , 'కల్కి' లో అశ్వత్థామ.. సప్త చిరంజీవులపై ఫోకస్ చేస్తున్న మేకర్స్.. కల్కి ఎంట్రీ తర్వాత వీళ్ల పాత్రేంటి!


భూమిమొత్తం అధర్మం, పాపంతో నిండిపోయినప్పుడు కల్కి జన్మించి ధర్మసంస్థాపన చేస్తాడు. అనంతరం సత్యయుగం ప్రారంభమైన తర్వాత కల్కి అవతారం చాలిస్తాడు.