Srikakulam Man searching for his Wife | నా భార్యను ఆమె పుట్టింటి వాళ్ళు కొందరు యువకులు, మహిళలతో కలిసి ఇంటి మీద దాడి చేసి కిడ్నాప్ చేసుకుని తీసుకువెళ్ళిపోయారు. ప్లీజ్ నా భార్యను నాకు అప్పగించండి అంటూ ఓ భర్త పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న కోపంతో అమ్మాయి తల్లిదండ్రులు, ఆమె తరఫు బంధువులు  తన ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేసి.. ఇష్టం లేకపోయినా తన భార్యను బలవంతంగా వారితో తీసుకువెళ్ళిపోయారు. ఈ విషయంపై పోలీసులకి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని బాధితుడు వాపోయాడు.


కేసు నమోదు, చర్యలు లేవంటూ ఆవేదన 
శ్రీకాకుళం జిల్లా ఎస్పీకి గ్రీవెన్స్ సందర్భంగా ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేశారే తప్పా బాధ్యులపై ఇంత వరకూ చర్యలు తీసుకోలేదని వారంతా తన కళ్ళ ముందే కాలర్ ఎగురేసుకుని తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఫిర్యాదుపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు రోజులు గడిపేస్తూ తనను మానసిక క్షోభకి గురిచేస్తున్నారంటూ ఆ యువకుడు కన్నీరుమున్నీరవుతున్నాడు. బాధితుడు శ్రీకాకుళం వన్ టౌన్ పోలీసులకి... జిల్లా ఎస్పీకి అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.


శ్రీకాకుళం నగరంలోని మంగువారితోటకి చెందిన తేజేశ్వర రావు "రావు ఓ షాపును సొంతంగా నిర్వహిస్తున్నాడు. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పొన్నాడ గ్రామంలోని తెప్పరేవుకి చెందిన గొల్లంగి పల్లవి అనే అమ్మాయిని గత 9 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు. మండలవీదిలో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ లో చదువుకున్న రోజులలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఈక్రమంలో తేజేశ్వర రావు, పల్లవి పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించు కున్నారు. ఈ క్రమంలో జూన్ 5న ఇంటి నుంచి వెళ్లిపోయి లవ్ మ్యారేజీ చేసుకున్నారు. తమ కుమార్తె కనిపించడం లేదని పల్లవి కుటుంబ సభ్యులు ఎచ్చెర్ల పోలీసులకి ఫిర్యాదు చేశారు. తేజేశ్వరరావుపై అనుమానం వ్యక్తం చేయగా.. ఎచ్చెర్ల పోలీసులు అతడి ఇంటికి వచ్చి ఆరా తీయగా.. పల్లవి కనిపించడంతో  తమతో పాటుగా పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళారు.


తేజేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఎచ్చెర్ల స్టేషన్ కి వెళ్ళి పల్లవి తాను ప్రేమించుకున్నామని, పెళ్ళి చేసుకున్నామని తెలిపాడు. పోలీసులు పల్లవికి కౌన్సిలింగ్ నిర్వహించా రు. ఆమె భర్త తేజేశ్వరరావుతోనే కలిసి ఉంటానని చెప్పడంతో అతడితోనే ఆమెను పంపించారు. ఈ నెల 14న శ్రీకాకుళం సబ్  రిజిస్ట్రార్ కార్యాలయంలో తేజేశ్వరరావు, పల్లవిలు తమ వివాహాన్ని హిందూ మేరేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ నెల 20వ  తేదిన పల్లవి తల్లితండ్రులు గొల్లంగి రమణ, సుశీలలు పెద్దపాడు, గుజరాతీపేట,హయాతినగరం ప్రాంతాలకి చెందిన కొంత మంది యువకులు, మహిళలను కారు, ఆటోలలో తీసుకువెళ్లి  పల్లవిని కిడ్నాప్ చేశారు. అడ్డుకున్న భర్త తేజేశ్వరరావుపై విచక్షణారహితంగా దాడి చేసి, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. తన భార్యను కిడ్నాప్ చేశారని  శ్రీకాకుళం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుల వివరాలు చెప్పి, తనకి న్యాయం చేయాలని ఆ ఫిర్యాదులో కోరాడు.


చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశం 
ఫిర్యాదు చేసి 4 రోజులు గడిచినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, జిల్లా ఎస్పీ జి.ఆర్. రాధికను ఈ నెల 24న కలిసిన తేజేశ్వరరావు మరో సారి గ్రీవెన్స్ లో తన ఆవేదనను వెల్లగక్కాడు. తన భార్యను కిడ్నాప్ చేశారని, తనకి న్యాయం చేయాలని విన్నవించుకున్నాడు. అతడి ఫిర్యాదుపై తక్షణం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రాధిక వన్ టౌన్ పోలీసులను ఆదేశించారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినా, పల్లవి ఆచూకీ కనిపెట్టలేదని, తెలిస్తే చెప్పాలని బాధితుడ్ని పోలీసులు అడుగుతున్నారని చెప్పాడు.


తేజేశ్వరరావుపై దాడి చేసి పల్లవిని కిడ్నాప్ లో పాల్గొన్న పెద్దపాడు, గుజరాతీపేట, హయాతినగరం యువకులు తన కళ్ల ముందే తిరుగుతూ, ఏం చేసుకుంటా వో చేస్కో అంటున్నారని తెలిపాడు. ఫిర్యాదు ఇచ్చిన భర్త తేజేశ్వరరావు పలుమార్లు వన్ టౌన్ పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా న్యాయం జరగడం లేదని, జిల్లా ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేదన్నాడు. ప్రేమించి పెళ్ళి చేసుకోవడం నేరమా అంటూ కన్నీరు మున్నీరవుతున్నాడు.