Kalki Real Story: పరశురాముడి దగ్గర సకలవిద్యలు నేర్చుకున్న కల్కి..తన అవతార ఆంతర్యం గురించి తెలుసుకని శివుడికోసం తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శివపార్వతులు తెల్లటి గుర్రం, బరువైన ఖడ్గం, సర్వజ్ఞుడు అనే చిలుకను ప్రసాదించారు. వాటిని తీసుకుని తాను జన్మించిన శంబలవైపు కదిలాడు కల్కి. మరి శంబలలో ఉన్న కల్కి శ్రీలంకలో పద్మావతిగా జన్మించిన లక్ష్మీదేవిని ఎలా చేరుకున్నాడు? అసలు కల్కిని ధర్మ సంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రీలంకలో పద్మావతిగా జన్మించిన లక్ష్మీదేవి
సింహళదేశంలో బృహధ్వజుడు - కౌముది అనే రాజకుటుంబంలో పద్మావతిగా జన్మించింది లక్ష్మీదేవి. చిన్నప్పటి నుంచి నారాయణుడి ఆలోచనలో ఉండే పద్మావతి..పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం తపస్సు చేసింది. ప్రత్యక్షమైన శివుడు..విష్ణువుతో పాణిగ్రహం జరుగుతుందని వరమిచ్చాడు. అసలు నారాయణడు ఎవరో ఎలా గుర్తించాలని అడిగింది పద్మావతి. శ్రీ మహావిష్ణువు తప్ప ఇంకెవ్వరు నిన్ను కామభావనతో చూసినా వారు స్త్రీలుగా మారిపోతారని చెబుతాడు. ఆ విషయాన్ని తండ్రికి తెలియజేసింది పద్మావతి. తండ్రి వెంటనే స్వయంవరం ఏర్పాటు చేశాడు..కానీ అక్కడకు వచ్చిన మహారాజులంతా పద్మావతిని చూసి మోహించి వెంటనే స్త్రీలుగా మారిపోయారు. అప్పటి నుంచి రాజభజనం నుంచి బయట అడుగుపెడితే చాలు పద్మావతి అందాన్నీ చూసి ఆశ్చర్యపోయిన యువకులంతా స్త్రీలుగా మారిపోవడం మొదలైంది. అప్పటి నుంచీ రాజభవనం దాటి వెళ్లడం మానేసింది..కేవలం స్త్రీలమధ్యలో మాత్రమే ఉండేది. ఆ బాధను అనుభవించలేక అగ్నిప్రవేశం చేసుకునేందుకు సిద్ధపడింది పద్మావతి...ఆ సమయానికి సర్వజ్ఞుడనే చిలుక అక్కడకు వచ్చి ఏం జరిగిందని అడిగింది. చిలుక మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయిన పద్మావతి..తనకు శివుడు ఇచ్చిన వరం గురించి చెప్పింది. అప్పుడు శంబలలో జన్మించిన నారాయణుడి గురించి చిలుక చెప్పిన మాటలు విని తన జాడ స్వామివారికి చెప్పమని కోరింది.
చిలుక ద్వారా కల్కికి సందేశం
చిలుక నుంచి సందేశం విన్న నారాయణుడు..వెంటనే శ్రీలంకలో ఉన్న కారుమతి అనే నగరంలో ప్రవేశించాడు. అక్కడ సరోవరం దగ్గరకు వచ్చి అక్కడి నుంచి చిలుకను దూతగా పంపించాడు. ఆ మాట వినగానే జన్మధన్యం అయిందని భావించి పరుగున చెలికత్తెలతో సరోవరానికి వెళ్లింది. అయితే మనసులో సందేహం...చెలికత్తెల వెనుక దాక్కుని నారాయణుడిని చూసింది.. ఏమో ఎదురుపడితే తను నారాయణుడు కాకపోతే స్త్రీగా మారిపోతాడేమో అనే భయంతో ఆగిపోయింది. అది గమనించిన నారాయణుడి పిలుపు విని పరుగున వెళ్లి కాళ్లపై పడి నమస్కరించింది పద్మావతి. స్వయంగా శ్రీ మహావిష్ణువే కల్కిగా వచ్చిన సంగతి తల్లిదండ్రులతో చెప్పి పరిణయమాడింది. ఇన్నాళ్ల ఆలస్యానికి పరిహారంగా ఏ వరం కావాలో కోరుకో అన్న కల్కితో.. ఇన్నాళ్లూ తనని చూసి స్త్రీలుగా మారిపోయిన వారికి పూర్వరూపాన్నివ్వమని అడిగింది. ఆ తర్వాత పద్మావతిని తీసుకుని శంబల నగరానికి బయలుదేరాడు...
కల్కి ధర్మసంస్థాపన దిశగా బయలుదేరిన సందర్భం ఇదే..
కల్కి-పద్మావతికి జయవిజయులు అనే సంతానం కలిగారు. వారిద్దరూ తండ్రి దగ్గరకు వచ్చి నాన్నగారూ మీరు అశ్వమేథ యాగం, రాజసూయ యాగం చేసి భూమిని పాలిస్తే చూడాలని ఉందని కోరారు. అప్పుడు దండయాత్రకు బయలుదేరాడు కల్కి. మొదటగా కల్కి వెళ్లిన ప్రదేశం కార్తావీర్యార్జునుడు పాలించిన..పరశురాముడు జయించిన మాహిష్మతి రాజ్యం. అప్పటికి ఆ రాజ్యంలో కలి ప్రభావం ఏమాత్రం లేదు.. ధర్మమైన పాలన సాగుతోంది. అక్కడ విశాఖయూపుడు అనే రాజుపై దండయాత్రకు వెళ్లగా..ఆ మహారాజు కల్కితో కలసి రాజసూయయాగం చేసేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు ఇద్దరూ కలసి కీటకపురం అనే ప్రదేశానికి వెళ్లారు...కలి ప్రభావంతో నిండిపోయిన ఈ ప్రదేశం నుంచి ధర్మసంస్థాప దిశగా కల్కి అడుగులుపడ్డాయి...
కీటకపురంలో ఏం జరిగింది? కల్కిపై దండెత్తిన మహిళలు ఎవరు? కల్కికి అశ్వత్థాముడు ఏ విధంగా సహాయపడ్డాడు? కలిని కల్కి తరిమికొట్టిన ప్రదేశం ఏంటి? కలియుగం అంతమయ్యాక సత్యయుగ పాలన ఏ ప్రాంతం నుంచి ప్రారంభమైంది? తర్వాత కథనంలో తెలుసుకుందాం...