శరణు భైరవా అంటే నేనున్నా అంటూ అభయమిస్తాడు కాలభైరవుడు. కాశీ క్షేత్రం తర్వాత అంత ప్రసిద్ధమైన కాలభైరవుడి ఆలయం కామారెడ్డి జిల్లా ఇసన్నపల్లిలో ఉంది. శివాలయం, రామాలయాల నిర్వహణకోసం అప్పట్లో దోమకొండ సంస్థానాధీశులు రాసిచ్చిన అగ్రహారమే ఇసనపల్లి.
పేడపూస్తే వానలు కురిపిస్తాడు
ఈ గ్రామానికి ఎనిమిది దిక్కులా అష్టభైరవులున్నారు. ఇక్కడ కాలభైరవ ఆలాయన్ని దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించారు. ఇందులో స్వామి విగ్రహం క్రీస్తుశకం 13వ శతాబ్ధ కాలం నాటిదని చెబుతారు. అయితే ఈ విగ్రహాన్ని చూసి కొందరు దిగంబర జైన విగ్రహం అని వాదిస్తుంటారు. అయితే కాలభైరవుడిని కూడా దిగంబరుడిగానే చెప్పాయి పురాణాలు. కరవు కాటకాలతో అల్లాడిపోతున్న సమయంలో ఇక్కడి కాలభైరవుడి విగ్రహానికి స్థానికులు పేడ పూస్తారట, ఆ పేడను తొలగించుకునేందుకు భైరవుడు వానలు కురిపిస్తాడని అక్కడి ప్రజల విశ్వాసం.
దుష్టశక్తుల నుంచి విముక్తి
దయ్యాలు,చిల్లంగి, చేతబడి లాంటి వాటిని ఇప్పటికీ విశ్వసించేవారున్నారు. ఇలాంటి భయాలున్నవారైనా, వాటితో బాధలు ఎదుర్కొంటున్నవారైనా కానీ ఈ దేవాలయంలో 21 రోజులు లేదా 41 నిద్ర చేస్తే మంచిదని, ఆలయ ప్రాంగణంలో ఉండే కోనేరులో స్నానమాచరిస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని భక్తుల నమ్మకం.
గ్రహదోషాలు నివారించే భైరవుడు
గ్రహాల అనుగ్రహం లేనిదే ఏ పని చేసినా పెద్దగా కలసిరాదు. జాతకంలో కొన్ని గ్రహాలు నీఛ స్థితిలో ఉండడం వల్ల చాలా రకాలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి వారు కాలభైరవ ఉపాసన చేస్తే మంచిదంటారు పండితులు.
ఆయుష్షు ప్రసాదించే దేవుడు
సంతానం లేక ఇబ్బంది పడే దంపతులు, పెళ్లికాలేదని బాధపడేవారు ఈ ఆలయాన్ని సందర్శించే వారి కోర్కెలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మరీ ముఖ్యంగా కాలభైరవునికి గారెల మాల వేసి బెల్లం, కొబ్బరి నైవేద్యంగా పెడతారు. ఇలా చేస్తే మృత్యభయం తొలగి ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.
శివపురాణం ప్రకారం
శివపురాణం ప్రకారం భైరవులు ఎనిమిది మంది. 1. అసితాంగభైరవుడు 2. రురుభైరవుడు 3. చండబైరవుడు 4. క్రోధబైరవుడు 5.ఉన్మత్తభైరవుడు 6. కపాలభైరవుడు 7. భీషణభైరవుడు 8. సంహారభైరవుడు. ఈ ఎనిమిది మంచి శ్యామలా, ఛండీ యంత్రాలలో కూడా పూజలందుకునే దేవతలు. వీరు రక్షక స్వరూపాలు. తీవ్రమైన నాదశక్తి, తేజశ్శక్తి కలిగినవారు భైరవులు.
మార్తాండభైరవుడు - ఆదిత్య స్వరూపుడు
కాలభైరవుడు - శివస్వరూపుడు
భైరవుడంటే పోషకుడని, భయంకురడనే అర్థం. భైరవుని దగ్గర కాలుడు (కాలం)కూడా అణిగి ఉంటాడు, కనుకే కాలభైరవుడయ్యాడు. అందుకే భైరవుడిని శరణుకోరితే మృత్యు భయం తొలగిపోతుందని విశ్వాసం.
కాలభైరవుని దేవాలయాలు
కాలభైరవుని దేవాలయాలు మనదేశంలో చాలా ఉన్నాయి..నేపాల్, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌లలో కాలభైరవుణ్ణి విశేషంగా పూజిస్తారు.
Also Read: మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది
Also Read: వివాహం, సంతానం, శని బాధలు ఇలా సుందరకాండలో ఏ ఘట్టం చదివితే ఎలాంటి సమస్యలు తీరుతాయో తెలుసా
Also Read: అనారోగ్యం, శనిబాధలు తొలగిపోవాలంటే మంగళవారం ఇలా చేయండి