International Yoga Day 2024 : లోకానికి వెలుగు ప్రసాదించే ప్రత్యక్షదైవం సూర్యభగవానుడు. నిత్యం సూర్యారాధన చేసేవారికి ఆరోగ్యం, ఆయుష్షు, మనోవికాసం సిద్ధిస్తుంది. రోజులో భగవంతుడి ప్రార్థన మొదలయ్యేది సూర్యారాధనతోనే. రామ రావణ యుద్ధం సమయంలో శ్రీరాముడు ఆగస్త్యమహర్షి సూచన మేరకు ఆదిత్య హృదయం పఠించి విజయం సాధించాడు. సమస్త విశ్వంలో ఉండే చీకట్లు చీల్చి వెలుగు ప్రసాదించే ఆదిత్యుడు..నవగ్రహాలకు రాజు. అందుకే సూర్యారాధన ద్వారా విజయం, ఆరోగ్యంతో పాటూ సకల గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. 


సూర్యుడు ప్రయాణించే రథం కాలచక్రానికి నిదర్శనం. ఆ చక్రానికి ఉండే 6 ఆకులు రుతువులు, ఏడు గుర్రాలు 7 కిరణాలు..అవే సుషుమ్న, హరికేశం, సంపద్వసు, అర్వాగ్వం, స్వరాడ్వసు, విశ్వకర్మ, విశ్వవ్యచ..ఈ కిరణాలే మానవ శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం దరిచేరకుండా కాపాడుతాయి.


ఉదయం బ్రహ్మ స్వరూపం మధ్యాహ్నంతు మహేశ్వరం, 
సాయంకాలే స్వయం విష్ణుః, త్రిముర్తిస్తూ దివాకరః 


ఉదయ బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి..మధ్యాహ్నం కిరణాల ద్వారా సృష్టి దైవిక వికారాలను తొలగించి.. సాయంత్రం విష్ణు స్వరూపుడిగా కిరణాల ద్వారా ఆనందాన్నిచ్చే ద్వాదశ రూపుడు సూర్యుడు.  ధాతా, అర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పుషా, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్టా, విష్ణు పేర్లతో నెలకో పేరుతో సంచరించే సూర్యుడిని ద్వాదశ ఆదిత్యులు అంటారు. ఈ 12 నామాలు స్మరిస్తే దీర్ఘకాలంగా వెంటాడుతున్న వ్యాధులు నయమవుతాయని, దారిద్ర్యం తొలగిపోతుందని భవిష్యపురాణంలో ఉంది.  


12 ఆసనాలు..ఆసనానికో ఆరోగ్య ప్రయోజనం


సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా ఇందులో మొత్తం 12 రకాల ఆసనాలుంటాయి. కేవలం కుడి ఎడమల వ్యత్యాసం మినహా ఈ 12 ఆసనాల్లో 1 నుంచి 5… 8 నుంచి 12 ఆసనాలు ఒకేలా ఉంటాయి. అయితే ప్రతి ఆసనానికి ఓ ప్రయోజనం ఉంటుంది. 



  • 1, 12 ఆసనాలతో శ్వాస కోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. మెడ, భుజాలు, వెన్నెముక దగ్గర  కండరాలు దృఢంగా మారుతాయి

  • 2, 7, 11 ఆసనాలతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది..వెన్నుముక బలోపేతమవుతుంది

  • 3, 10 ఆసనాలతో రక్త ప్రసరణ మెరుగుపడి..కాలి కండరాలు బలోపేతం అవుతాయి.

  • 4, 9 ఆసనాలు వెన్నుముక , చేతి మణికట్టు కండరాలను దృఢంగా తయారు చేస్తాయి

  • 5,6, 8 ఆసనాలు గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి


సూర్య నమస్కారాలు చేయడం వల్ల అధిక బరువు సమస్య తగ్గుతుంది. జర్ణక్రియ మెరుగుపడుతుంది, మానసిక ఒత్తిడి మటుమాయం అవుతుంది రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాదు..దీర్ఘకాలిన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మొత్తం 12 ఆసనాలకు 12 పేర్లున్నాయి.. ఒక్కో ఆసన వేస్తున్నప్పుడు ద్వాదశ ఆదిత్యులలో ఒక్కో నామాన్ని జపించాలి..
 
నమస్కారాసనం -  ఓం మిత్రాయ నమ: 
సూర్యునికి ఎదురుగా నమస్కారం చేయాలి 


హస్త ఉత్తానాసనం - ఓం రవయే నమః
రెండు చేతులను పైకెత్తి, తలను, నడుమును వెనుకకు వంచాలి 


పాదహస్తాసనం - ఓం సూర్యాయ నమః
శ్వాసను నెమ్మదిగా వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమి మీద ఆనించి  తలను మోకాలుకు ఆనించాలి


ఆంజనేయాసనం - ఓం భానవే నమః
ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి రెండు చేతులు పైకెత్తి నడుము భాగాన్ని వెనక్కు వంచాలి  


పర్వతాసనం - ఓం ఖగాయ నమః
 కాళ్ళు, చేతులు నేల మీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస నెమ్మదిగా వదలి తిరిగి పీల్చాలి 


సాష్టాంగ నమస్కారం  - ఓం పూష్ణే నమః
8 అంగాలు నేలమీద ఉంచి నడుము భాగాన్ని కొద్దిగా పైకి లేపి..శ్వాసను పూర్తిగా బయటకు వదలాలి..
  
సర్పాసనం  - ఓం హిరణ్యగర్భాయ నమః
శ్వాసను పీల్చి తలను వెనుక్కు వంచాలి 


పర్వతాసనం  -  ఓం మరీచయే నమః
కాళ్ళు చేతులు నేలమీద ఆనించి నడుమును పైకెత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి 


ఆంజనేయాసనం - ఓం ఆదిత్యాయ నమః
కుడి పాదాన్ని నేలపై ఉంచి మోకాలును మడచి ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి రెండు చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి - 


పాదహస్తాసనం - ఓం సవిత్రే నమః
చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఉంచి తల మోకాలుకి తగిలేలా వంగాలి 


హస్త ఉత్తానాసనం - ఓం అర్కాయ నమః
రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి 


నమస్కారాసనం - ఓం భాస్కరాయ నమః
నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి


ఈ 12 ఆసనాలు వేసేటప్పుడు శ్వాస పై ధ్యాసతో పాటూ ప్రార్థనను జోస్తే శరీరంలో ప్రతి అవయవంలోనూ ఉండే విషపదార్థాలు తొలగిపోతాయి.  
 
ఓం భాస్కరాయ విద్మహే 
దివాకరాయ ధీమహి
తన్నో సూర్యః ప్రచోదయాత్


Also Read: రామాయణ, మహాభారత యుద్ధాలకు ఓ కారణం ఉంది..మరి కల్కిని ధర్మసంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటి!