Mutual Fund SIP Analysis: ఈక్విటీలో పెట్టుబడి పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్ అందించే 'సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్' ‍‌(SIP) ఒక అద్భుతమైన సాధనంగా మారింది. దీని ఫాలోయింగ్‌ రోజురోజుకు పెరుగుతోంది. 2016 మే నెలలో నెలవారీ SIPs ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ. 3189 కోట్ల పెట్టుబడులు వస్తే; 2024 మే నాటికి ఇది 6.6 రెట్లు పెరిగి రూ. 20,904 కోట్లకు చేరింది. ఈ ఏడేళ్లలో నెలవారీ సిప్ పెట్టుబడులు రూ.17,715 కోట్లు పెరిగాయి.


సిప్ మీద పెట్టుబడిదార్ల ఆసక్తి ఎప్పటికప్పుడు పెరుగుతుండటంతో, దాని గురించి చాలా ప్రశ్నలు తలెత్తడం సహజం. వైట్‌ఓక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ ఈ విషయంలో ఒక అధ్యయనం నిర్వహించింది. చాలా మ్యూచువల్‌ ఫండ్స్‌ గత సంవత్సరాల్లో ఇచ్చిన రిటర్న్స్‌ గురించి బాగా స్టడీ చేసి, ఎక్కువ మంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు కనుగొంది. 


అస్థిర మార్కెట్‌లో దీర్ఘకాలం పెట్టుబడులు కొనసాగించడం సమంజసమేనా? 
ఈ ప్రశ్నకు "ఔను" అని వైట్‌ఓక్‌ మ్యూచువల్ ఫండ్ నివేదిక సమాధానం చెబుతోంది. ఒక ఇన్వెస్టర్, తన పెట్టుబడి వ్యవధిని పెంచే కొద్దీ హెచ్చుతగ్గులు తగ్గుముఖం పడతాయని అధ్యయనం కనుగొంది.


మార్కెట్‌ ఏ స్థాయిలో ఉన్నప్పుడు SIP ప్రారంభించాలి?
మార్కెట్ సైకిల్ దిగువ స్థాయిలో ఉన్నప్పుడు SIPను ప్రారంభిస్తే, శాతం పరంగా మంచి రాబడి వస్తుందని అధ్యయనం కనుగొంది. మార్కెట్ సైకిల్‌ ఎగువ స్థాయిలో SIPను ప్రారంభిస్తే, రూపాయిల పరంగా అధిక రాబడిని వస్తుందట. 


SIPని ఆలస్యంగా ప్రారంభిస్తే నష్టమేంటి?
వైట్‌ఓక్‌ క్యాపిటల్‌ అధ్యయనం దీనికి ఒక ఉదాహరణ చెప్పింది. మార్కెట్ అధిక స్థాయిలో ఉన్నప్పుడు, 2009 జనవరిలో ఒక పెట్టుబడిదారుడు రూ.10 వేలతో SIP ప్రారంభించినట్లయితే, 2024 మే 31 నాటికి పెట్టుబడి మొత్తం రూ.19.7 లక్షలు అవుతుంది. దీనిపై 13.6 శాతం వార్షిక రాబడితో రూ. 67.2 లక్షలకు చేరింది. అయితే.. ఒక పెట్టుబడిదారుడు 2009 మార్చిలో, మార్కెట్‌ సైకిల్‌ దిగువ స్థాయిలో ఉన్నప్పుడు, రూ.10 వేల SIP ప్రారంభించినట్లయితే, 2024 మే 31 నాటికి అతని పెట్టుబడి రూ. 18.3 లక్షలు అవుతుంది. 13.8 శాతం రాబడితో మొత్తం విలువ రూ. 57.3 లక్షలకు పెరిగింది. అంటే మొదటి పెట్టుబడిదారుడి కంటే రూ.9.8 లక్షల తక్కువ రాబడి వచ్చింది.


లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్‌లో ఏది బెటర్?
స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్‌ కంటే లార్జ్ క్యాప్ స్టాక్స్‌ తక్కువ అస్థిరత చూపుతాయి, పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని అందిస్తాయి. కానీ, స్మాల్ అండ్‌ మిడ్ క్యాప్ (SMID) సెగ్మెంట్ దీర్ఘకాలంలో అధిక రాబడికి అవకాశం కల్పిస్తుంది. వైట్‌ఓక్‌ అధ్యయనం ప్రకారం, SIP కోసం ఉత్తమ ఎంపిక 'మిడ్ క్యాప్ సెగ్మెంట్' అవుతుంది.


నెలవారీ SIP కోసం నెలలోని ఏ తేదీని ఎంచుకోవాలి? 
గత 10 సంవత్సరాల SIP సగటు రాబడిని చూసిన తర్వాత, SIP కోసం ఏ తేదీని ఎంచుకున్నారనేదాంతో పట్టింపు లేదని అధ్యయనం కనుగొంది. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తుంటే... రోజువారీ, వారానికోసారి లేదా నెలవారీ SIP చేసినా పట్టింపు లేదు.


మార్కెట్ బాగా లేకుంటే SIPని నిలిపివేయాలా? 
SIP ప్రారంభించినప్పుడు తక్కువ రాబడి రావచ్చు. SIP, మొదటి 5 సంవత్సరాల్లో తక్కువ రాబడిని ఇచ్చిందని చారిత్రక డేటా చూపిస్తోంది. 10 సంవత్సరాల సగటు రాబడి మాత్రం అద్భుతంగా ఉంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: వార్షిక ఆదాయం రూ.7 లక్షల లోపున్నా ఐటీఆర్‌ ఫైల్‌ చేయాల్సిందేనా?