Income Tax Return Filing 2024: ఫైనాన్షియల్‌ ఇయర్‌ 2023-24 లేదా అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2024-25 కోసం ఆదాయ పన్ను పత్రాల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్న వ్యక్తులు (Individuals) ఆదాయ పన్ను రిటర్న్‌ (ITR 2024) దాఖలు చేయాలి.


పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) ఎంచుకునే వ్యక్తులు రూ. 5 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతున్నారు. కొత్త పన్ను విధానం (New Tax Rebate) ప్రకారం, రూ. 7 లక్షల వరకు ఉన్న ఆదాయంపై ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.


ఉదాహరణకు... మీ ఆదాయం రూ. 7.50 లక్షలు అయితే, రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ క్లెయిమ్ చేసిన తర్వాత, ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఇలాంటి కేస్‌లో ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయాల్సిందే. 


ఒక పన్ను చెల్లింపుదారుకు (Taxpayer), పాత పన్ను విధానంలో గరిష్టంగా రూ. 12,500 పన్ను మినహాయింపు ‍‌(Tax Rebate) ప్రయోజనం అందుతుంది. కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపు రూ. 25,000గా ఉంది. ఈ రెండు సందర్భాల్లోనూ పన్ను బాధ్యత సున్నా. పన్ను బాధ్యత లేనప్పటికీ, కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైల్ చేయాల్సిందే. పన్ను బాధ్యత లేకపోతే ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయాల్సిన అవసరం లేదని చాలామంది భావిస్తున్నారు. అది నిజం కాదు. పన్ను బాధ్యత లేకున్నా 'జీరో టాక్స్‌' చూపిస్తూ ఐటీఆర్‌ దాఖలు చేయాలి. పైగా, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక సంబంధ విషయాల్లో ఆ పత్రాలు మీకు పనికొస్తాయి.


ఏ వ్యక్తులు ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయాలి?


-- ఒక వ్యక్తి స్థూల ఆదాయం (ఎలాంటి తగ్గింపులు లేకుండా) పన్ను స్లాబ్‌లోకి వస్తే, ఆదాయ పన్ను రిటర్న్‌ ఫైల్ చేయాల్సి ఉంటుంది.
-- పాత పన్ను విధానం ప్రకారం, వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షల కంటే ఎక్కువ ఉన్న 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లు ఐటీఆర్ ఫైల్ చేయాలి.
-- వార్షిక ఆదాయం రూ. 3 లక్షల కంటే ఎక్కువ ఉన్న 60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న సీనియర్ సిటిజన్‌లు ITR ఫైల్ చేయాలి.
-- రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లు కూడా ఆదాయ పన్ను రిటర్న్‌ దాఖలు చేయాలి.
-- వివిధ బ్యాంక్‌ ఖాతాల్లో కలిపి రూ. 50 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లు కలిగిన పన్ను చెల్లింపుదారు ఆదాయ పన్ను పత్రాలు సమర్పించాలి.
-- ఒక ఆర్థిక సంవత్సరంలో, వృత్తిపరమైన ఆదాయం రూపంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తే ITR ఫైల్‌ చేయాలి.
-- TCS లేదా TDS రూ. 25,000 కంటే ఎక్కువ ఉన్న వారు కూడా ఐటీ రిటర్న్‌ దాఖలు చేయడం అవసరం.
-- ఒక భారతీయుడికి విదేశాల్లోని ఉద్యోగం లేదా ఆస్తి లేదా మరేదైనా వనరు నుంచి ఆదాయం వస్తుంటే, ఈ కేస్‌లోనూ ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయాలి.
-- విదేశీ ప్రయాణాల కోసం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే, ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్ సమర్పించాలి.


ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయడానికి చివరి తేదీ జులై 31, 2024. ఈ గడువు తర్వాత కూడా ఆలస్య రుసుము చెల్లించి ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటే రూ. 1000 జరిమానా; రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే రూ. 5000 జరిమానా చెల్లించాలి. జరిమానాతో కలిపి ఐటీఆర్‌ ఫైల్‌ చేయడానికి ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు సమయం ఉంది.


మరో ఆసక్తికర కథనం: రెండున్నర నెలల్లోనే రూ.53,322 కోట్ల టాక్స్ రిఫండ్స్‌ - మీకు అందిందా?