Taxes That Are Collected In India: మన దేశంలో ముందస్తు పన్ను ‍‌(Advance Tax) వసూళ్లతో కేంద్ర ప్రభుత్వ ఖజానా కళకళలాడుతోంది. ఈ నెల 16న విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో (2024-25) ముందస్తు పన్ను వసూళ్లు రూ.1.48 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది దాదాపు 28 శాతం ఎక్కువ. 2024-25 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 4.62 లక్షల కోట్లు, ఇది గతేడాది కంటే ఇది దాదాపు 22 శాతం ఎక్కువ. అధికారిక డేటా ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో జూన్ 16 నాటికి, భారతదేశ ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 4.62 ట్రిలియన్లకు చేరాయి. 2023-24లోని ఇదే కాలంతో పోలిస్తే 9.81 శాతం పెరిగాయి. 


నికర కార్పొరేట్ పన్ను రూ.1.60 లక్షల కోట్లుగా ఉంది. వ్యక్తిగత ఆదాయ పన్ను ద్వారా భారత ప్రభుత్వానికి అందిన నికర ఆదాయం రూ.3.79 లక్షల కోట్లకు చేరుకుంది. స్థూల పన్ను రూ. 5.15 లక్షల కోట్లకు పెరిగింది, అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే ఇది 22.89 శాతం ఎక్కువ.


భారతదేశంలో ఎన్ని రకాల పన్నులు ఉన్నాయి?


మన దేశంలో పన్నును ప్రధానంగా రెండు వర్గాలుగా వసూలు చేస్తున్నారు. 1. ప్రత్యక్ష పన్ను (Direct Tax), 2. అంటే పరోక్ష పన్ను (Indirect Tax)


1. ప్రత్యక్ష పన్ను: ఒక వ్యక్తి లేదా సంస్థ ఆదాయంపై నేరుగా విధించే పన్ను. వీటిని నేరుగా ప్రభుత్వానికి చెల్లిస్తారు. భారతదేశంలో అమలవుతున్న ప్రత్యక్ష పన్నులు ఇవి:


ఆదాయ పన్ను: వ్యక్తులు, కంపెనీలు, ఇతర సంస్థల వార్షిక ఆదాయంపై విధిస్తారు.
క్యాపిటల్ గెయిన్స్ టాక్స్: ఆస్తి, షేర్లు వంటి వాటి అమ్మకం ద్వారా వచ్చే లాభాలపై విధిస్తారు.
సెక్యూరిటీస్‌ లావాదేవీ పన్ను: స్టాక్ మార్కెట్ లేదా ఈక్విటీలకు వర్తిస్తుంది. 
కార్పొరేట్ పన్ను: కంపెనీల ఆదాయంపై ఈ పన్ను విధిస్తారు.
బహుమతి పన్ను: స్వీకరించిన బహుమతుల విలుపై విధిస్తారు (ఇది ఇప్పుడు ఆదాయ పన్ను చట్టం కిందకు వస్తుంది).


2. పరోక్ష పన్ను: వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేసే సమయంలో ఈ పన్ను విధిస్తారు. వినియోగదార్లు వీటిని నేరుగా ప్రభుత్వానికి చెల్లించరు కాబట్టి పరోక్ష పన్నులు అంటారు. వినియోగదార్లు కొనే వస్తువులు, లేదా సేవలపై వసూలు చేసే పన్నును ఆ వ్యాపార సంస్థ ప్రభుత్వానికి జమ చేస్తుంది. భారతదేశంలో అమలవుతున్న పరోక్ష పన్నులు ఇవి:


వస్తువులు & సేవల పన్ను: దీనిని GST పిలుస్తున్నాం. ఇందులో, వస్తువులు & సేవలపై పన్ను విధిస్తారు. GST రేట్లలోనూ వివిధ శ్లాబ్‌లు, విభాగాలు ఉన్నాయి.
సెంట్రల్ జీఎస్టీ: వస్తువులు & సేవల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం విధించే పన్ను ఇది.
స్టేట్‌ జీఎస్టీ: వస్తువులు & సేవల కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే పన్ను ఇది.
ఏకీకృత జీఎస్టీ: అంతర్రాష్ట్ర లావాదేవీలపై దీనిని విధిస్తారు.
ఎక్సైజ్ సుంకం: ఈ పన్నులను వస్తు తయారీ స్థాయిలో విధిస్తారు.
కస్టమ్స్ డ్యూటీ: దిగుమతి చేసుకున్న వస్తువులపై ఈ పన్ను చెల్లించాలి.
విలువ ఆధారిత పన్ను: దీనిని VATగా పిలుస్తాం. కొన్ని వస్తువులపై ఇప్పటికీ వర్తిస్తోంది. నిర్దిష్ట వస్తువులపై రాష్ట్ర ప్రభుత్వాలు VAT వసూలు చేస్తున్నాయి.
సెంట్రల్ సేల్స్ ట్యాక్స్: అంతర్రాష్ట్ర అమ్మకాలపై విధిస్తారు. అయితే, GST అమలు తర్వాత దీని ప్రాముఖ్యత తగ్గింది.
సర్వీస్‌ టాక్స్‌: ఈ పన్నును సేవలపై విధించారు. ఇది ఇప్పుడు GST పరిధిలోకి వచ్చింది.


పన్నులు విధించాల్సిన అవసరమేంటి?
ఏ దేశం ముందుకు నడవాలన్నా ఆదాయం ఉండాలి. ప్రభుత్వ ఆదాయంలో అతి పెద్ద భాగం పన్ను వసూళ్లు. అంటే, పన్నులు విధించకపోతే ఏ ప్రభుత్వానికి ఆదాయం ఉండదు, దేశం అభివృద్ధి చెందదు. వసూలు చేసిన పన్నులను అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఖర్చు చేస్తాయి.


మరో ఆసక్తికర కథనం: రూ.20 లక్షల ఆదాయంపై పన్ను సడలింపు - పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు!