Possible Income Tax Rate Cuts In Union Budget 2024: మోదీ 3.0 ప్రభుత్వంలో, జులై నెలలో సమర్పించనున్న మొదటి పూర్తిస్థాయి బడ్జెట్‌పై సాధారణ ప్రజల నుంచి బడా కార్పొరేట్ల వరకు అందరూ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా, వేతన జీవులు ఆదాయ పన్ను విషయంలో వరాలు అడుగుతున్నారు. దేశంలో అతి పెద్ద ట్రేడ్ అసోసియేషన్ CII (Confederation of Indian Industry) కూడా ఆర్థిక పద్ధులో కొన్ని ఉపశమనాలు ఆశిస్తోంది.
రూ.20 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఉపశమనం
ఇటీవల, CII ప్రెసిడెంట్ సంజీవ్ పూరి సహా ఆ సంస్థ ప్రతినిధులు కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాతో సమావేశం అయ్యారు. ఆయనకు ప్రి-బడ్జెట్ డిమాండ్ల జాబితాను సమర్పించారు. వార్షిక ఆదాయం రూ. 20 లక్షలకు మించని వ్యక్తులను దృష్టిలో పెట్టుకోవాలని, ఆదాయ పన్ను విషయంలో వారికి ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.
పాత పన్ను విధానం (Old Tax Regime) ప్రకారం, రూ. 10 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదార్లు 30 శాతం; కొత్త పన్ను విధానం (New Tax Regime) ప్రకారం, రూ. 15 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదార్లు 30 శాతం చొప్పున ఇన్‌కమ్ టాక్స్ కడుతున్నారు. రూ.20 లక్షల లోపు వార్షిక ఆదాయ వర్గంలోకి వచ్చేవాళ్లంతా మధ్య తరగతి ప్రజలే కాబట్టి, వాళ్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని CII విజ్ఞప్తి చేసింది.
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని కూడా సీఐఐ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ద్రవ్యోల్బణ భారం నుంచి సామాన్య ప్రజలకు ఊరట లభిస్తుంది. ముఖ్యంగా, డీజిల్‌పై సుంకం తగ్గిస్తే అది విస్తృత ప్రభావం చూపుతుంది.
క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను (Capital Gains Tax) హేతుబద్ధీకరించాలని కూడా సీఐఐ డిమాండ్ చేసింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో వచ్చే లాభాలపై దీర్ఘకాలిక మూలధన లాభాలు, స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను విధించాలి. మోదీ హయాంలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ విధించారు. కార్పొరేట్ పన్నును పెంచకుండా పరిశ్రమకు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగించాలని కూడా CII కోరింది.
ఉపాధి హామీ (MNREGA) కార్మికులకు ఇచ్చే కనీస వేతనాన్ని రోజుకు రూ.267 నుంచి రూ.375కి పెంచాలని బిజినెస్ ఛాంబర్ సూచించింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్, వినియోగం పెరుగుతుంది. జాతీయ కనీస వేతనాన్ని నిర్ణయించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా CII అడిగింది. పీఎం కిసాన్ యోజన కింద ఏటా ఇస్తున్న మొత్తాన్ని ప్రస్తుతమున్న రూ. 6000 నుంచి రూ. 8000కు పెంచాలని కూడా చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ నుంచి అందే రూ. 2.11 లక్షల కోట్ల డివిడెండ్‌లో 25 శాతాన్ని మూలధన వ్యయంపై ఉపయోగించుకోవచ్చని సీఐఐ ప్రభుత్వానికి సూచించింది.
మరో ఆసక్తికర కథనం: ఈ బడ్జెట్‌లో గుడ్ న్యూస్ ఖాయం! మీ ఆదాయ పన్ను తగ్గే ఛాన్స్ ఉంది!