Union Budget 2024 May Include Income Tax Rate Cuts: మోదీ 3.0 ప్రభుత్వంలో మొదటి బడ్జెట్‌ను పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో, జులై 22న సమర్పించే అవకాశం ఉంది. వాస్తవానికి, 18వ లోక్‌సభ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం అవుతాయి, జులై 03వ తేదీ వరకు జరుగుతాయి. పార్లమెంట్‌ సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌ ఎన్నిక, ఆర్థిక సర్వే సమర్పణ, మరికొన్ని కీలక విషయాలకే ఆ సమావేశాలు పరిమితం అవుతాయి. జులై 22 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభించి, ఆగస్ట్‌ 09వ తేదీ వరకు నిర్వహించాలని కేంద్ర సర్కార్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందని సమాచారం. 


భారతీయ జనతా పార్టీకి (BJP) గతం కంటే ఈసారి బలం తగ్గింది, ప్రతిపక్ష పార్టీలు బలం పెంచుకున్నాయి. నిరుద్యోగం, ఆదాయం పడిపోవడం, ద్రవ్యోల్బణం, ఆదాయ అసమానతలు సహా కొన్ని విషయాల్లో మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, అందువల్లే ఆ పార్టీకి ఓట్లు తగ్గాయని 'పోలింగ్‌ తర్వాతి సర్వే'లను బట్టి తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ 3.0 ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది. ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకునే ప్రకటనలు పూర్తి స్థాయి బడ్జెట్‌లో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా, వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో పన్ను చెల్లింపుదార్లకు ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.


పన్ను చెల్లింపుదార్లకు ఊరట
ఇద్దరు కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ ఉద్యోగులను ఉటంకిస్తూ, రాయిటర్స్ ఒక కథనం ఇచ్చింది. ఆ రిపోర్ట్‌ ప్రకారం... వార్షిక ఆదాయం రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఉన్న పన్ను చెల్లింపుదార్లకు ఆదాయ పన్ను విషయంలో ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, ప్రస్తుతం అమల్లో ఉన్న కొత్త ఆదాయపు పన్ను విధానంలో (New Tax Regime) మార్పులు ఉండొచ్చు. ప్రస్తుతం, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 15 లక్షల వరకు సంపాదిస్తున్న వాళ్లు 5 శాతం నుంచి 20 శాతం పన్ను చెల్లిస్తున్నారు. రూ. 15 లక్షలు దాటిన సంపాదనపరులు 30 శాతం ట్యాక్స్‌ కట్టాల్సి వస్తోంది. ఈ రేట్లలో మార్పులు ఉండొచ్చని రాయిటర్స్‌ రాసింది. అంతేకాదు, రూ. 10 లక్షల వార్షిక ఆదాయంపైనా టాక్స్‌ రేట్‌ తగ్గించే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. కొత్త ఆదాయ పన్ను శ్లాబ్‌లను పూర్తిగా మార్చాలన్న విషయంపైనా ఆర్థిక శాఖలో చర్చ జరుగుతోందని రిపోర్ట్ చేసింది.


నెమ్మదిగా ఉన్న వినియోగం
పన్ను రేట్లు తగ్గించడం వల్ల మిగిలిన డబ్బును ప్రజలు తమ ఖర్చుల కోసం వినియోగించుకుంటారు. దీనివల్ల దేశంలో వినియోగం ‍‌(Consumption) పెరుగుతుంది, GST రూపంలో ఆ డబ్బు తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. అంతేకాదు, ప్రజల నుంచి పెట్టుబడులు కూడా పెరుగుతాయి. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, వినియోగం మాత్రం చాలా నెమ్మదిగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ 8.2 శాతం చొప్పున వృద్ధి చెందింది. ప్రపంచంలోని ఏ దేశపు వృద్ధి రేటుతో పోల్చినా ఇది చాలా ఎక్కువ. కానీ, మన దేశంలో వినియోగం మాత్రం 4 శాతం మాత్రమే పెరిగింది. అందువల్ల, వ్యక్తిగత ఆదాయ పన్నును తగ్గించి, దేశంలో వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్లు సమాచారం.


మరో ఆసక్తికర కథనం: ప్రపంచంలో 7 అందమైన భవనాలు - జీవితంలో ఒక్కసారైనా వీటిని నేరుగా చూడాలి