Most Valuable Company In The World: అమెరికా చిప్‌ల తయారీ సంస్థ ఎన్‌విడియా షేర్లలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న చారిత్రాత్మక ర్యాలీతో సరికొత్త చరిత్ర నమోదవుతోంది. ఎన్‌విడియా షేర్లు హిస్టరీ సృష్టించడంతో పాటు ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీల జాబితాను పూర్తిగా మార్చేశాయి. ఈ నెలలో తొలిసారిగా 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ క్లబ్‌లోకి ప్రవేశించిన చిప్ తయారీ కంపెనీ, ఇప్పుడు ఏకంగా ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలను సైతం ఓడించింది.
హిస్టరీ క్రియేట్ చేసిన ఎన్‌విడియా
ఎన్‌విడియా కంపెనీ షేర్లు మంగళవారం 3.5 శాతం ర్యాలీ చేశాయి, దీంతో కంపెనీ మార్కెట్ విలువ 3.34 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రపంచంలోని ఏ లిస్టెడ్ కంపెనీతో పోల్చినా ఇదే అత్యధికం. ఎన్‌విడియా, ఇప్పుడు, ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా అవతరించింది.
గత వారంలో నంబర్ 2
గత కొన్ని నెలలుగా రాకెట్‌ను మించిన స్పీడ్‌తో దూసుకెళ్తున్న ఎన్‌విడియా, గత వారం ప్రారంభంలో ఆపిల్‌ను దాటింది, ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. గత బుధవారం నాడు (జూన్ 12, 2024) ఎన్‌విడియా షేర్లు 5.2 శాతం పెరిగాయి, ఆ కంపెనీ విలువ మొదటిసారిగా 3 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. ప్రపంచంలోనే ఈ రికార్డు సాధించిన మూడో కంపెనీగా ఎన్‌విడియా నిలిచింది. ఇప్పటి వరకు, గ్లోబల్ టెక్ జెయింట్స్ అయిన ఆపిల్, మైక్రోసాఫ్ట్ మాత్రమే 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌ను దాటాయి.
ప్రపంచంలోని 3 అతి పెద్ద కంపెనీలు
ఎన్‌విడియా ఇప్పుడు 3.335 ట్రిలియన్ డాలర్ల విలువతో ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీగా అవతరించింది. మైక్రోసాఫ్ట్, 3.317 లక్షల కోట్ల డాలర్ల విలువతో రెండో స్థానానికి పడిపోయింది. ఆపిల్ 3.285 ట్రిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉంది. గూగుల్ (Google) మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కు ఫోర్త్ ర్యాంక్ దక్కింది. ఈ సంస్థ ప్రస్తుత మార్కెట్ క్యాప్ 2.170 ట్రిలియన్ డాలర్లు.
ఈ ఏడాదిలో 170 శాతానికి పైగా జంప్
ఎన్‌విడియా షేర్లు గత కొన్ని నెలలుగా అద్భుతమైన వృద్ధిని చూశాయి. ఈ క్యాలెండర్ సంవత్సరంలోనే, ఇప్పటి వరకు ఎన్‌విడియా స్టాక్ 170 శాతానికి పైగా లాభపడింది. 2022 అక్టోబర్ నుంచి చూస్తే ఈ షేర్లు దాదాపు 1,100 శాతం పెరిగాయి.
రాకెట్ తరహా ప్రయాణం ఇలా సాగింది...
ఎన్‌విడియా, 2 ట్రిలియన్ డాలర్ల విలువ నుంచి 3 ట్రిలియన్ డాలర్లకు చేరడానికి కేవలం 96 రోజుల సమయం మాత్రమే తీసుకుంది. ఈ ఏడాది మార్చిలో, 2.056 ట్రిలియన్ డాలర్లకు చేరిన ఎన్‌విడియా, ఆ సమయంలో సౌదీ అరామ్‌కోను అధిగమించింది. ఇప్పుడు ఎన్‌విడియా విలువ 3.335 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అంటే, గత 3 నెలల్లోనే ఈ కంపెనీ విలువ అత్యంత భారీగా 1 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. అంతకు ముందు, అమెజాన్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా వంటి దిగ్గజాలను ఓడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు (AI) ప్రపంచవ్యాప్తంగా, అన్ని రంగాల్లో డిమాండ్ పెరుగుతుండేసరికి, ఆ పరిస్థితుల నుంచి ఎన్‌విడియా షేర్లు లాభపడుతున్నాయి.
మరో ఆసక్తికర కథనం: రెండున్నర నెలల్లోనే రూ.53,322 కోట్ల టాక్స్ రిఫండ్స్ - మీకు అందిందా?