International Women's Day 2024 : మార్చి 8 అంతర్జాతీయ మహిళాదినోత్సవం
ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం , దూసుకెళుతున్న మహిళలు, అబల కాదు సబల, మహిళలు అత్యంత శక్తివంతులు అని ఈ దినోత్సవాల సందర్భంగా చెబుతుంటారు. అయితే మహిళలు పవర్ ఫుల్ అని ఇప్పుడు చెప్పడం ఏంటి...ఎప్పుడూ పవర్ ఫుల్లే. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం...ఇప్పుడు నడుస్తున్న కలియుగం... ఏ యుగంలో తీసుకున్నా మహిళల ప్రాధాన్యత తగ్గలేదు అని చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే పురాణాల్లో పవర్ ఫుల్ మహిళ గురించి చెప్పుకోవాలంటే ముందుగా ద్రౌపది గురించి మాట్లాడుకోవాలి. ఐదుగురిని పెళ్లిచేసుకున్న ఆమె ఏం చేసింది అనే సందేహం వస్తుందేమో...మరి మహాభారత యుద్ధానికి కారణం ఆమె అని ఎందుకంటారు?
Also Read: మహా శివరాత్రి పూజ , అభిషేకం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఉపవాస నియమాలు - మరెన్నో వివరాలు సమగ్రంగా
ద్రౌపదిని మించిన వ్యూహకర్త ఎవరు!
ద్రుపదుడి యఙ్ఞవాటికలో అగ్ని నుంచి జన్మించిన శక్తి స్వరూపిణి ద్రౌపది. అందమైన, బలమైన స్త్రీ మాత్రమే కాదు మంచి వ్యూహకర్త కూడా. పాండవులతో మెట్టినింట్లో అడుగుపెట్టినప్పటి నుంచీ అడుగడుకునా అవమానాలు ఎదుర్కొంది.
- కురుసభలో దుశ్శాసనుడు
- అరణ్యవాసంలో ఉన్నప్పుడు సైంధవుడు
- అజ్ఞాతవాసంలో విరాటుని కొలువులో దాసిగా పనిచేస్తున్న సమయంలో కీచకుడు
ఇలా ఎంత మందితో అవమానాలు, వేధింపులు ఎదుర్కొని ఒక్కొక్కరికీ బుద్ధి చెప్పింది.
Also Read: మీ జీవితంలో ఉన్న స్త్రీ గురించి ఏం తెలుసు మీకు - ఇలా తెలుసుకోండి!
పాండవుల్లో ప్రతీకార జ్వాల రగిలించిన ద్రౌపది
జూదంలో పాండవులు ఓడిపోవడంతో..ద్రౌపదిని నిండు సభలోకి ఈడ్చుకొచ్చి వస్త్రాపహరణం చేసి అవమానిస్తారు. తనను నిండు సభలో అవమానించిన సంఘటనను పదేపదే గుర్తుచేసుకుంటూ పాండవులను కార్యోన్ముఖులను చేసి మహాభారత యుద్ధానికి పరోక్షంగా కారణమైంది ద్రౌపది. తనకు జరిగిన అవమానాన్ని గుర్తుంచుకోవడమే కాదు, పాండవుల్లో ప్రతీకార జ్వాలను రగిలించింది. ఓ దశలో సంధి చేసుకునేందుకు ధర్మరాజు ప్రయత్నించినా కూడా తనకు సంధి వద్దని స్పష్టంగా చెప్పేసింది. ద్రౌపది ఎంత పవర్ ఫుల్ అంటే...ఆమె మాట్లాడితే ఎదురు చెప్పడానికి ఐదుగురు భర్తలు సాహసించేవారు కాదు. ఆమె అంటే భయం అని కాదు...తన ఆలోచన, అభిప్రాయం తిరిగి మాట్లాడలేనంత స్పష్టంగా ఉంటాయని అర్థం.
Also Read: మహా శివరాత్రి రోజు మీ రాశిప్రకారం పఠించాల్సిన మంత్రం ఇదే!
శపథం నెరవేర్చుకునే వరకూ జుట్టు ముడివేయలేదు
మాయాజూదంలో ధర్మరాజు తాను ఓడిపోవడమే కాదు సోదరులు, రాజ్యాన్ని, ద్రౌపదిని కూడా పోగొట్టుకుంటాడు. ఈ ఓటమి తర్వాత ద్రౌపది తమ బానిస కాబట్టి ఆమెను సభలోకి తీసుకురమ్మని దుర్యోధనుడు ఆఙ్ఞాపిస్తాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని ద్రౌపదని నిండు సభలోకి ఈడ్చుకొస్తాడు. ప్రస్తుతం మాకు బానిసవు, ఎవరికీ దీనిపై ఫిర్యాదు చేసే హక్కు నీకు లేదంటూ ఆమె మేలి ముసుగు తొలగించి దుశ్శాసనుడు అవమానిస్తాడు. ఇంతటితో ఆగకుండా దుర్యోధనుడు తన తొడపై కూర్చోమంటాడు. రక్షించమని పాండవుల వంక దీనంగా చూసి అర్థించినా వారు నిస్సహాయులై ఏమీ చేయలేక చూస్తుండిపోతారు. సభలో ఉన్న పెద్దలు కూడా ఏమీ మాట్లాడలేక ఆగిపోతారు. ఆ సమయంలో కృష్ణుడు రక్షిస్తాడు. ఈ పరాభవానికి గుర్తుగా..తనను వెలయాలిలా ఈడ్చుకొచ్చిన దుశ్శాననుడి రక్తం కళ్లజూసిన వరకూ తన కురులను ముడివేయనని కురు సభలోనే శపథం చేసింది. అందుకే 13 ఏళ్ల పాటు జుట్టు విరబోసుకునే ఉంది ద్రౌపది. ఎవరైతే తనను నిండు సభలో అవమానించారో వారి రక్తంతోనే తన శిరోజాలను తడిపినంతవరకు వాటిని ముడివేయనంది. దుశ్శాసనుడి రక్తం తాగి, దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి తెస్తానని ఆమెకు ప్రమాణం చేశాడు భీముడు. అందుకే కురుక్షేత్ర సంగ్రామం వరకూ ఆమె ఎదురుచూసింది. మహాభారత యుద్ధంలో భీముడు తన మాటని నెరవేర్చుకున్నాడు. దుశ్శాసనుడిని చంపి రక్తం తీసుకొచ్చి ద్రౌపదికి ఇచ్చాడు. దుశ్శాసనుడి రక్తాన్ని తన జట్టుకు రాసిన తర్వాతే ఆమె వాటిని ముడివేసింది. అందుకే ద్రౌపది శపథం కూడా మహాభారత సంగ్రామానికి ఓ కారణం అని చెబుతారు..
స్త్రీ శపథం చేసి ప్రతీకారం తీర్చుకోవాలంటే ఇలా ఉంటుందని చెప్పేందుకు పురాణాల్లో ఇంతకు మించి చెప్పుకోదగిన పాత్ర ఏముంటుంది.