Sankashti Chaturthi 2023: సంకష్ట చతుర్థి వ్రతం లేదా ఉపవాసం ప్రతి నెల కృష్ణ చతుర్థి తిథి నాడు ఆచరిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తారు. అదేవిధంగా శ్రావణ మాసంలో కృష్ణ పక్ష చతుర్థి తిథి నాడు జరుపుకునే చతుర్థిని హేరంబ సంకష్ట చతుర్థి అంటారు. 2023 హేరంబ సంకష్ట చతుర్థి సెప్టెంబర్ 3వ తేదీ ఆదివారం జరుపుకుంటారు. హేరంబ వినాయకుని రూపాలలో ఒకటి. ఈ పవిత్రమైన చతుర్థి శుభ ముహూర్తం, పూజా విధానం, విశిష్టత గురించి ఇక్కడ తెలుసుకుందాం.


హేరంబ అంటే ఎవరు?
హేరంబ సంకష్ట చతుర్థి రోజున వినాయకుని 32 రూపాలలో ఒకటైన హేరంబను పూజించే సంప్రదాయం ఉంది. హేరంబ స్వామికి ఐదు ముఖాలు, పది చేతులు ఉంటాయి. ఈ రూపంలో గణేశుడు తన ఒక చేతిని వరం ఇచ్చే భంగిమలో ఉంచుతాడు. మరొక చేతిలో మోదకం పట్టుకుని ఉంటాడు. దీనితో పాటుగా మిగిలిన ఎనిమిది చేతులలో వరుసగా పాము, అంకుశం, మాల, దుర్వ, పండు, గొడ్డలి మొదలైన వాటిని పట్టుకుని ద‌ర్శ‌న‌మిస్తాడు. గణేశుడి ఈ రూపాన్ని బలహీనుల రక్షకుడిగా పరిగణిస్తారు.


Also Read : సోమవారం, శనివారం గణపతిని ఇలా పూజిస్తే శనిబాధలతో పాటూ కష్టాలన్నీ తొలగిపోతాయట…


హేరంబ సంకష్ట చతుర్థి ప్రాముఖ్యత
హేరంబ సంక‌ష్ట‌ చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల, దాని పుణ్యఫలం మన జీవితంలోని అన్ని రకాల ప్రతికూలతలను తొలగిస్తుందని నమ్ముతారు. తద్వారా మీరు జీవితంలో ఆనందం, శాంతిని పొందవచ్చు. విరిగిన దంతం ఉన్న గణేశుడు ఒక వ్యక్తి జీవితంలోని అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తాడు. ఆయ‌న్ను పూజిస్తే మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. దీనితో పాటు, ఈ రోజున చంద్ర దర్శనానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది.


హేరంబ సంకష్ట చతుర్థి 2023
- చతుర్థి తిథి ప్రారంభం: 02 సెప్టెంబర్ 2023 ఉద‌యం 08:49 నుంచి
- చతుర్థి తిథి గడువు: సంక‌ష్ట‌ చతుర్థి శుభ యోగం 03 సెప్టెంబర్ 2023న సాయంత్రం 6:24 వరకు
- అభిజిత్ ముహూర్తం: 03 సెప్టెంబర్ 2023 ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు
- విజయ ముహూర్తం: 03 సెప్టెంబర్ 2023 మధ్యాహ్నం 02:27 నుంచి 03:18 వరకు
- గోధూళి ముహూర్తం: 03 సెప్టెంబర్ 2023 సాయంత్రం 06:41 నుంచి 07:04 వరకు
- సర్వార్థ సిద్ధి యోగం: సెప్టెంబర్ 03, 2023 ఉదయం 10:38 నుంచి సెప్టెంబర్ 4, 2023 ఉదయం 06:00 వరకు.


హేరంబ సంకష్ట చతుర్థి పూజా విధానం
- సెప్టెంబరు 3వ తేదీ తెల్లవారుజామున నిద్రలేచి స్వచ్ఛత, ఉపవాసం ప్రతిజ్ఞ చేయండి.
-  కఠినమైన ఉపవాసం చేయలేకపోతే పండ్లు, పాలు తీసుకోవచ్చు.
- ఈ రోజు మీరు తక్కువగా మాట్లాడాలి
- మనస్సులో నుంచి చెడు ఆలోచనలను తొలగించండి.
- చంద్రోదయానికి ముందు సాయంత్రం వినాయకుడిని పూజించండి. స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించండి.
- తర్వాత గణేశుడికి కుంకుమతో తిలకం దిద్ది పూలమాల వేయాలి.
- మీ శ‌క్తి మేరకు శ్రీ గణేశుడికి నైవేద్యాలు సమర్పించండి.
- దూర్వాయుగ్మం కూడా తప్పకుండా ఇవ్వాలి.
- పూజ సమయంలో శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని జపించండి.
- చంద్రోదయ సమయంలో చంద్రునికి అర్ఘ్యం సమర్పించి పూజ పూర్తి చేయండి.


Also Read : వినాయకుడి పూజకు తులసిని వాడకూడదట - ఎందుకో తెలుసా?


హేరంబ సంకష్ట చతుర్థి మంత్రం


'ఓం గణపత‌యే న‌మః'


'శ్రీ గణేశా నమః'


ఏకదన్తాయ విద్మహే వక్రతుణ్డాయ ధీమహి తన్నో దన్తి ప్రచోదయాత్ ॥


వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవసర్వకార్యేషు సర్వదా


'ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపత్యే వరద సర్వజనం మే వశమానాయ స్వాహా.'


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.


సెప్టెంబరు 4 నుంచి 10 వరకూ వారఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి